"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|
ధర్మసంస్థాపనార్థాయ సమ్భవామి యుగే యుగే…"
శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరిస్తాడని.. చిన్నప్పటి నుండి నరనరాల్లో భగవద్గీత సారాన్ని ఇంకించుకున్న జాతి మనది…
కళ్లెదుట ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి… ఏడీ భగవంతుడు… మనం నమ్ముతున్నదంతా ఒట్టిదేనా… మెలమెల్లగా అనుమానం పెరుగుతూనే ఉంది…. ఆ అనుమానంతో పాటే పాపభీతీ పోతోంది… మనమూ అన్యాయాలు చేయొచ్చు, మనల్ని శిక్షించడానికీ భగవంతుడు లేడు అన్న భరోసా కూడా వస్తోంది….
విర్రవీగిపోతున్నాం….
మనిషీ లేడూ, మనస్సూ లేదూ… ఎవడెట్లా పోతే మనకేంటి… మనం బాగుంటే చాలు… ఎంతకైనా తెగిస్తున్నాం…. ప్రతీదీ కాలిక్యులేషన్సే…
అస్సలు ఏది తప్పు, ఏది కరెక్ట్… డిసైడ్ చెయ్యడానికి ఎవరికి హక్కుంది….? అని కూడా అన్పిస్తోంది…. ఆర్గ్యుమెంట్‌కి వంద లాజిక్‌లు సిద్ధంగా ఉన్నాయి….
మనిష్టమొచ్చినట్లు మనం బిహేవ్ చేస్తాం… క్వశ్చన్ చేసే దమ్ము ఎవరికుంది…..? అని కూడా అన్పిస్తూ రొమ్ములు విశాలం అవుతున్నాయి…
పోదాం… ఎంతవరకూ పోగలుగుదామో అదీ చూద్దాం…. అన్ని భ్రమలూ, తలకెక్కిన అహంకారాలూ, అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయన్న భ్రాంతులూ తొలగిపోవడానికి ఓ టర్నింగ్ పాయింట్ సిద్ధంగా ఎటూ ఉంటుంది.. ఆ పాయింట్ వరకూ చేరుకునే వరకే ఏ తెగింపైనా…!!
నిజమే… సొసైటీనీ, మనుషుల్నీ ఓ macro angleలో చూస్తే… అంతా అపసవ్యంగానే ఉన్నట్లు అన్పిస్తుంది….
అందరూ తప్పుగా ప్రవర్తిస్తుంటే మనం మాత్రం ఎందుకు మంచిగా ఉండాలి…. చేత కాకా… మనమేమైనా గాజులు తొడుక్కున్నామా…… ఎక్కడ లేని రోషాలూ పొడుచుకొస్తాయి….. మనమూ గుంపులో విలువలన్నీ వదిలేసి.. మునగడం మొదలెడతాం…
ఇక్కడ ఒక్కమాట స్పష్టంగా చెప్పుకోవాలి…
మనం నమ్మింది ఉన్నదున్నట్లు ఆచరించాలి….. పక్కింటోళ్లతోనో, దారిన పోయే దానయ్యతోనో, కుంభకోణాల్లో కోట్లు తిన్న పొలిటీషియన్తోనో… ఇంకెవరితోనో పోల్చుకుని…. వాళ్లు ఫాలో అవుతున్నారా లేదా…. అని confirm చేసుకుని విలువలు వదిలేసే బాపతైతే అస్సలు"మనకు విలువ" ఏం ఉందని?
వంద మంది వంద రకాలుగా పోతారు… పోనీయండి…. ఎందుకు అసంతృప్తి….?
కష్టపడడం, నిజాయితీగా ఉండడం, హెల్పింగ్ నేచర్ కలిగి ఉండడం వంటి క్వాలిటీస్‌తో మనం బ్రతకాలనుకుంటున్నప్పుడు…. మనం వాటిని ఫాలో అవకుండా ఎవరు ఆపగలుగుతున్నారు? ఎవరూ ఆపలేరు కదా….. మనమే కుంటి సాకులు వెదుక్కుని… ఫాలో అవకుండా ఆపేస్తున్నాం…
సంతోషమూ, సంతృప్తీ ఎక్కడో లేవు… నమ్మిన విలువల్ని పాటిస్తూ సంతృప్తిగా పాటిస్తూ పోతే…. లైఫ్ చాలా తేలికగా ఉంటుంది….
—————————
అంతా బానే ఉంది….. మరి భగవద్గీతలో చెప్పుకుంటున్నట్లు దేవుడు రాడే… ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా….? అన్న క్వశ్చన్ మాత్రం తీరడం లేదు కదూ….?
ప్రతీ మనిషికీ ఓ మెలిక ఉంటుంది… ఒక్కసారి అక్కడ కలుక్కుమంటే చాలు… అన్నీ సర్ధుకుంటాయి… ఆ మెలిక కలుక్కుమందా లేదా అన్నది మనకు బయటకు ఇంత పెద్ద సొసైటీలో ఇన్ని కోట్ల మంది మనుషుల మధ్య కన్పించదు….
అన్యాయాలు చేసే ప్రతీ ఒక్కరి పెదాలపై చిరునవ్వులే చూస్తున్నాం… పళ్ల క్రింద బిగపెట్టుకున్న బాధలెన్ని ఉన్నాయో….!
అయినా మనకెందుకు చెప్పండి… భగవద్గీతలో చెప్పుకున్నట్లు దేవుడు తన పని తాను చేస్తున్నాడా…. లేదా మనం గుడ్డిగా నమ్ముతున్నామా…. అని అనాలసిస్‌లు? నమ్మిందేమో చేసుకుంటూ పోక….?
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply