కృష్ణ భగవానుడు ఇంతకు ముందు సంభాషణ కొనసాగిస్తూ ఇలా చెప్పారు..
త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః ।
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ।। 3 ।।
అన్ని రకాల కర్మలూ దోష స్వభావం కలిగినవనీ, వాటిని విడిచి పెట్టాలనీ కొంతమంది జ్ఞానులు అంటారు. మరో వైపు మరికొంతమంది యజ్ఞము, దానము తపస్సు అనే కర్మలను విడిచి పెట్టవద్దని అంటారు.
వివరణ:
మనం చేసే ప్రతీ ఒక్క కర్మా శక్తి రూపమే. ఉదా.కి.. ఎవరికో ఫోన్ చెయ్యాలన్న మన ఆలోచన బ్రెయిన్లో న్యూరాన్ల మధ్య ఫైరింగ్ జరిగి ఎలక్ట్రో మాగ్నటివ్ తరంగాలుగా ఏర్పడి ఆ వ్యక్తికి సంబంధించిన రూపమూ, జ్ఞాపకాలు, అతను ఈ సమయంలో లేచి ఉంటారా పడుకుని ఉంటారా అనే అంచనా, అతను మంచి వాడు లేదా స్వార్థపరుడు, అతనితో జాగ్రత్తగా ఉండాలి అనే లేబుల్స్, అతనితో మనం ఎలా ప్రవర్తించాలి అనే వ్యూహమూ అంతా కూడా మన మానసిక శక్తి ద్వారా ఒక రూపానికి వచ్చి అతనికి కాల్ చెయ్యడం జరుగుతుంది కదా!
ఇప్పుడు కాల్ చేసినప్పుడు మన ఫోన్లో నొక్కే నెంబర్లు వేలు, ఫోన్ ఉపరితలం అనే భౌతిక రూపంలో కన్పిస్తున్న రెండు ఆబ్జెక్టుల మధ్య ఏర్పడే రాపిడి వల్ల టచ్ అనే మరో మాధ్యమం ద్వారా మనం ఏ నెంబర్లు నొక్కామో ఆ వ్యక్తి నెంబర్, ఫోన్ మెమరీ అనే మరో శక్తి రూపకం నుండి వెలికి తీయబడి.. ఫోన్లోని రేడియో చిప్ అనే చిన్న చిప్ ద్వారా ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలుగా ఫోన్ నుండి ఆ శక్తి బయటకు వెళ్లి మనకు దగ్గరలో ఉన్న సెల్‌ఫోన్ టవర్ ఆ శక్తిని సంగ్రహించి ఆ శక్తిని రకరకాల టవర్లకి బదిలీ చేసి చిట్టచివరకు ఎవరికైతే ఫోన్ చేస్తున్నామో ఆ వ్యక్తికి దగ్గరలో ఉన్న టవర్‌కి సమాచారాన్ని బదిలీ చేసే వ్యవస్థ ద్వారా మన ఫోన్ కాల్ వెళుతుంది. ఆ తర్వాత అవతలి వ్యక్తి ఫోన్ ఎత్తాక మనం మాట్లాడే మాటలన్నీ శబ్ధ రూపంలో ఓ శక్తిగా ఉత్పత్తి అయి ఫోన్లో ఉండే మైక్రోఫోన్ ఆ శక్తిని స్వీకరించి అనలాగ్ మరియు డిజిటల్ సిగ్నల్స్‌గా మార్చి దాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి అవతలి వ్యక్తికి చేరవేస్తూ ఉంటుంది.
ఇప్పుడు ఆ వ్యక్తి స్వార్థపరుడు అనే మీ అంచనా ద్వారా మీరు మాట్లాడే మాటల్లో ఉత్పత్తి అయ్యే ఓ రకమైన నిష్టూరమో, జాగ్రత్తో ఓ వైబ్రేషనే కదా! ఆ వైబ్రేషన్ అవతలి వ్యక్తికి శబ్ధ రూపంలో చేరినప్పుడు అతని మనస్సులో ఓ రకమైన సందేహాన్ని, మీరు ఆచి తూచి మాట్లాడుతున్నారు అనే భావనను సృష్టిస్తుంది కదా! అంటే ఒక ఆత్మ అయిన మీరు మరో ఆత్మ స్వరూపమైన మరో వ్యక్తిని మీ కర్మ ద్వారా ఓ సెల్ఫ్ డౌట్ అనే నెగిటివ్ ఎమోషన్‌కి గురి చేస్తున్నట్లే కదా!
ఒక వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడాలి అనే ఓ కర్మే (చర్యే) ఏదో ఒక రూపంలో దోష స్వభావం కలిగి ఉంటే మరి మనం నిరంతరం మన మైండ్ ద్వారా కాన్షియస్గానో అంటే ఉద్దేశ పూర్వకంగానో, అన్ కాన్షియస్గానో (గాయపరుస్తున్నామని తెలియక) చేసే కోట్లాది కర్మలు ఎంత మొత్తంలో దోష స్వభావం కలిగి ఉంటాయో కదా! అలాగని ఆయా కర్మలను చెయ్యకుండా మానేయగలమా? సరిగ్గా ఇదే విషయాన్ని భగవానుడు ఈ శ్లోకం ద్వారా వ్యక్తపరిచారు. కొంతమంది జ్ఞానులు ప్రతీ కర్మా దోష స్వభావం కలిగి ఉన్నది కాబట్టి కర్మలు చెయ్యడమే విడిచి పెట్టాలని భావిస్తారని ఆయన అంటున్నారు. అది ఎంత వరకూ సమంజసమో తర్వాతి శ్లోకాల్లో భగవానుడు వివరించాడు. మరికొంతమంది జ్ఞానులు అన్ని కర్మలూ చెయ్యకుండా ఆపేయాల్సిన పనిలేదు.. యజ్ఞమూ, దానము, తపస్సు అనే కర్మలను వాటి వల్ల అకారణంగా దోషం కలిగినా విడిచి పెట్టవద్దని భావిస్తారని ఆయన జ్ఞానులు అనుకునే వారి వారి వ్యక్తిగత భావనలను ప్రస్తావించారు. అలా ప్రస్తావించిన తర్వాత ఆయన వివరణ తర్వాతి శ్లోకాల్లో ఉంది.
మనం నేల మీద నడిస్తే చీమలు, చిన్న చిన్న సూక్ష్మ జీవులు అంతరించిపోవచ్చు. అంటే నడవడం అనేది దోష స్వభావం కలిగి ఉంది కాబట్టి అహింసను పాటించే జ్ఞానులు నడవకుండా ఉండగలరా? అలాగే యజ్ఞం చేసేటప్పడు ఆ వేడికి మనకు కళ్లకి కన్పించని చిన్న చిన్న జీవులు ప్రాణాలు కోల్పోవచ్చు. మరి యజ్ఞం చెయ్యడం తప్పా… ఇలాంటి వివిధ వర్గాల దృక్కోణాన్ని (పర్సెప్షన్)ని, వారి సందేహాలను భగవానుడు ముందే ఊహించి, వాటి గురించి వివరణ ఇవ్వడానికి ముందుగా ఈ శ్లోకం ద్వారా ప్రస్తావించారు.
భగవద్గీత 18వ అధ్యాయం – నాలుగవ శ్లోకం
నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ ।
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః ।। 4 ।।
ఎలాంటి కర్మలను త్యాగం చెయ్యాలి అన్న దాని మీద ఇప్పుడు నా తుది నిర్ణయము వినుము ఓ పురుషవ్యాఘ్ర! త్యాగం అనేది మూడు విధాలుగా ఉంటుంది.
ఇక్కడ చాలామందిని ఆకర్షించే అంశం “పురుషవ్యాఘ్ర” అనే పదం. “గోముఖ వ్యాఘ్రం” వంటి పదాలను తరచూ విని అర్జునుడిని క్రూర మృగమైన పులితో శ్రీ కృష్ణ భగవానుడు ఎందుకు పోల్చారు అనే సందేహం చాలామందికి రావచ్చు. “పురుషవ్యాఘ్ర” అంటే “పురుషులలో పులి వంటి వాడా” అని అర్థం. త్యాగం చెయ్యడానికి సాహసోపేతమైన హృదయం అవసరం. అలాంటి సాహసం అర్జునుడిలో ఉందన్న భావనతో భగవానుడు అతన్ని సాహసానికి ప్రతీక అయిన పులితో పోల్చారు.
ఎలాంటి పనులు చెయ్యడం ఆపేయాలి, వాటిని త్యాగం చెయ్యాలి అని భగవానుడు తర్వాతి శ్లోకాల్లో వివరించబోతూ త్యాగం అనేది మూడు రకాలుగా ఉంటుంది అని చెబుతున్నారు.
ఇక్కడ త్యాగ గుణం గురించి క్లుప్తంగా మనం చెప్పుకోవాలి. త్యాగమనేది ఒక గొప్ప మానసిక స్థితి. మనలో ఉండే సోల్ తనని తాను పరిశుద్దం చేసుకోవడానికి ఈ త్యాగం ఉపయోగపడుతుంది. ఉదా.కి.. “ఇతరుల గురించి తప్పుగా ఆలోచించడాన్ని ఈరోజు నుండి నేను ఆపేస్తున్నాను” అని ఈరోజు నేను ఓ నిర్ణయం తీసుకున్నాను అనుకోండి. నా మనస్సులో ఉండే ఓ దోషపూరితమైన స్వభావాన్ని వదిలించుకుని నా ఆత్మని స్వచ్ఛంగా మార్చుకోవడానికి ఇలాంటి దుష్కర్మని త్యాగం చెయ్యడం ఉపయోగపడుతుంది. కొంతమంది కాశీకి వెళ్లి కొన్ని చెడు అలవాట్లు, తమకు ఇష్టమైనవి మానేస్తుంటారు. కొంతమంది తమకు ఇష్టమైన వంకాయ, బజ్జీలు వంటివి కూడా శివుడికి వదిలేసి వస్తుంటారు. ఈ త్యజించడం వెనుక పరమార్థమూ ఇదే!
ఓ ఆహారపు అలవాటు పట్ల గానీ, ఓ మానసిక అలవాటు, ప్రవర్తన పట్ల గానీ మమకారాన్ని వదిలిపెట్టి దానిని త్యజించడం ద్వారా ఓ మనిషి తన బాడీ, మైండ్లకు అధిగమించి సోల్‌కి చేరుకోవడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి.
- Sridhar Nallamothu