యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ ।
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ।। 5 ।।
ఇంతకుముందు సంభాషణ కొనసాగిస్తూ త్యాగం అనేది మూడు విధమలుగా ఉంటుంది అని చెబుతూ.. “యజ్ఞము, దానము మరియు తపస్సుల సంబంధిత కర్మలను ఎప్పుడూ త్యజించరాదు; అవి తప్పకుండా చేయబడాలి. నిజానికి యజ్ఞము, దానము మరియు తపస్సు అనేవి బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి.” అని పై శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టం చేశారు.
వివరణ:
త్యాగం అనగానే చేసే అన్ని పనులనూ త్యాగం చేయడం మంచిది కాదని, ఒక సోల్‌గా (ఆత్మ) మనల్ని మనం మెరుగుపరుచుకునే, లోకానికి మంచి చేసే పనుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ త్యజించకూడదు అన్నది దీని సారాంశం. “బుద్ధిమంతులను కూడా పవిత్రం చేస్తాయి” అంటే శ్లోకంలో మనీషి అని ప్రస్తావన ఉంది చూడండి. మనిషి, మనీషి అని మనుషుల స్వభావాన్ని బట్టి రెండుగా విభజిస్తారు. ఏ మనిషి అయితే విచక్షణాశక్తి కలిగి ఉండి, ఏది సమాజ హితమూ, ఏది తనకీ, సమాజానికి హాని చేస్తుంది అన్న విచక్షణ కలిగి ఉంటారో అతను మనీషి క్రింద లెక్క. అలాంటి అప్పటికే విచక్షణ కలిగిన మనుషులను కూడా యజ్ఞము, దానము మరియు తపస్సు అనే పనులు మరింత స్వచ్ఛంగా మారుస్తాయి అని అర్థం చేసుకోవాలి.
ప్రతీ యుగానికీ ఓ ధర్మముంది. కృత యుగంలో తపస్సు, త్రేతా యుగంలో యజ్ఞం, ద్వాపర యుగంలో దానం, కలి యుగంలో ధ్యానం యుగ ధర్మాలుగా పేర్కొనబడి ఉన్నాయి. అయితే అన్ని ధర్మాల్లోనూ, అన్ని కాలాల్లోనూ దానం ఉత్తమమైనది అని స్పష్టం చేయబడింది. ఈ ధర్మాల గురించి లోతుగా తెలుసుకుందాం.
యజ్ఞాలు ఎందుకు చేస్తారు.. ప్రాధాన్యత ఏంటి?
దేవదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి, వారి అనుగ్రహం పొందడానికి వేద మంత్రోచ్ఛారణ నడుమ వేద పండితులు యజ్ఞాలను నిర్వహిస్తారు. దీని వెనుక ఉన్న సైన్స్ చెబుతాను. దేవదేవతలను ప్రసన్నం చేసుకోవడం అంటే ఏంటి.. అంటే మనిషి తన ఇగోని పక్కనబెట్టి రకరకాల మంత్రోచ్ఛారణల ద్వారా భగవంతుడు, దేవతలు అనే శక్తి రూపాలకు తనని తాను వినమ్రంగా శరణాగతి (సరెండర్) కోరుతూ.. లోక శ్రేయస్సుని, తాను చేపట్టదలిచిన సత్కార్యాలను నెరవేర్చమని కోరడానికి చేయబడేవి యజ్ఞాలు. ఇక్కడ ప్రధానంగా రెండు అంశాలు పరిశీలించాలి. మొదటిది యజ్ఞంలో పాల్గొనే వారి సంకల్పం. “లోకమంతా బాగుండాలి” అని రుత్వికులచే చెప్పుకోబడే బలమైన సంకల్పం ఒక ఇంటెన్షన్ అని అర్థం చేసుకోండి. క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాల ప్రకారం ఇంటెన్షన్ + ఎనర్జీ రెండూ కలిస్తే ఒక ఎనర్జీ మరో ఎనర్జీగా రూపాంతరం చెందుతుంది.
అంటే నేను ఈ మేటర్ టైప్ చెయ్యాలి అనే నా ఇంటెన్షన్, నేను కీబోర్డ్ మీద టైప్ చేస్తూ ఉపయోగించే కొంత ఎనర్జీ రెండూ కలిసి నా ఆలోచనలు అనే ఓ ఎనర్జీని స్క్రీన్ మీద అక్షరాలు అనే మరో ఎనర్జీ రూపంగా మార్చబడుతున్నాయి కదా! అంటే మనం ఏ పని చెయ్యాలన్నా ఆ పని చెయ్యాలన్న సంకల్పమూ ఉండాలి.. ఆ పని చెయ్యడానికి ఆలోచనల రూపంలో గానీ, కాళ్లు చేతులు, వేళ్లు శరీరంలోని వివిధ భాగాలను ఉపయోగిస్తూ కొంత ఎనర్జీని ఆ ఇంటెన్షన్కి జతచెయ్యాలి కదా!
కాబట్టి యజ్ఞం చెయ్యబడేటప్పుడు మొదట సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం సహజంగానే లోక హితమై ఉంటుంది. కొన్నిసార్లు వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం కొంతమంది హోమాలు చేస్తారు. అవీ నెరవేరతాయి. కారణం ఒక వ్యక్తి “నేను సమస్యల్లో ఉన్నాను, రక్షించు దేవా” అని యూనివర్శల్ పవర్‌ని తన మూలాధార చక్ర, స్వాధిష్టాన చక్రలలో బ్లాక్ అయిన ఎనర్జీని విడుదల చేసి ఆ సమస్యల నుండి గట్టెక్కించమని కోరుకోవడంలో తప్పు లేదు కదా! ఆ సమస్యలను అధిగమించినప్పుడే అతను శరీరంలో పై భాగాన ఉండే అనాహత చక్ర ద్వారా అన్ కండిషనల్ లవ్‌కీ, ఇతర చక్రాలలోకి ఎనర్జీ ప్రవహించి అతను విశ్వంతో ఏకమయ్యే శక్తిని పొందగలుగుతాడు. ఒక సోల్ (ఆత్మ) తనని తాను సంస్కరించుకోవడానికి ఓ హోమం ద్వారా ఓ ఇంటెన్షన్ (కోరిక)ను కలిగి ఉండి చేసుకునే ఏ క్రతువైనా ఆమోదయోగ్యమే.
యజ్ఞ కార్యాన్ని నిర్వర్తించేటప్పుడు ఎప్పుడైనా దగ్గరుండి చూడండి. ఓ హార్మొనీలో అందరు రుత్వికులు వివిధ మంత్రాలను పెద్దగా ఉచ్ఛరిస్తుంటారు. మంత్రమనేది మానవ శరీర రూపంలో పోగుపడిన ఎనర్జీని శరీరంలోని వివిధ ఎనర్జీ సెంటర్లని (చక్రాలను) ఉత్తేజితం చేయడానికి, ఆ శక్తి మనిషి సహస్రార చక్ర ద్వారా ఎలక్ట్రో మేగ్నటిక్ తరంగాలుగా వెలువడి విశ్వ శక్తిలోని ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవడానికి ఉపయోగపడే గొప్ప ఆయుధం. “మంత్రాలకు చింతకాయలు రాలతాయా” అని కొందరు ఎద్దేవా చేస్తారు. వివరంగా చెబుతాను.
“ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్” అనే గాయత్రీ మంత్రాన్నే తీసుకోండి. చాలామంది “ఓం”ని యధాతధంగా “ఓం” అనే పలుకుతారు. అలా కాకుండా “ఆ…మ్..” అంటూ ఆ, ఊ, మ అనే మూడు శబ్ధాలుగా నెమ్మదిగా విభజించి ఆ అనేటప్పుడు నోరు పూర్తిగా తెరిచి నోటి ద్వారా శ్వాస తీసుకోండి. ఇప్పుడు కొంత వరకూ ఊపిరి తిత్తులు ఆ పలికేటప్పుడు తీసుకున్న శ్వాసతో నిండిపోయాక, “ఊ” అనే శబ్ధాన్ని చేసేటప్పుడు పెదాలు కొద్దిగా మూసుకోవడం (అంటే తీసుకున్న శ్వాస లోపల లాక్ అవుతుంది అన్నమాట), “మ్” అనే శబ్ధాన్ని చేసేటప్పుడు పెదాలు ఆల్రెడీ లాక్ అయి ఉంటాయి కాబట్టి ఆ శ్వాస అంతా బ్రెయిన్‌ని యాక్టివేట్ చేస్తూ, ముఖ్యంగా ఆధ్యాత్మికకు అత్యంత ప్రాధాన్యత కలిగిన పీనియల్ గ్లాండ్ మీద వత్తిడి తీసుకు వస్తూ జరుగుతుంది. మెదడులో ఉండే పీనియల్ గ్లాండ్‌లో చిన్న చిన్న ఉప్పు కణాల లాంటి మైక్రో క్రిస్టల్స్ ఉంటాయి. బయట నుండి ప్రాణాయామం ద్వారా గానీ, లేదా మంత్రోచ్ఛారణ ద్వారా గానీ శ్వాసని మెదడు వైపు బదిలీ చేసి పీనియల్ గ్లాండ్ మీద వత్తిడి తెచ్చినప్పుడు, అందులో ఉండే మైక్రో క్రిస్టల్స్ ఉన్న ఫళంగా విద్యుత్ ఆయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేసి, ఆ ఎలక్ట్రో మాగ్నటిక్ వేవ్స్ మన దేహంలోని తల భాగంలో ఉండే సహస్రార చక్ర ద్వారా శరీరాన్ని అధిగమించి, విశ్వంలోకి చేరుకుని విశ్వ శక్తిని యాక్సెస్ చేసే అద్భుతమైన అవకాశాన్ని కలిగిస్తాయి.
కేవలం “ఓం” అనే ఓ శబ్ధం వెనుకే ఇంత సైన్స్ ఉంటే ప్రతీ మంత్రం శరీరంలోని వివిధ భాగాల్లో శక్తిని ప్రేరేపితం చేస్తూ మనిషిని ఎలా మెరుగుపరుస్తాయో, తాను వేరు, భగవంతుడు వేరు అనే ఇగోయిస్టిక్ భావన నుండి తనలోనే భగవంతుడు ఉన్నాడు అనే స్థితికి అతన్ని ఎలా సంస్కరిస్తాయో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.
సరే అసలు విషయానికి వద్దాం. యజ్ఞం చేసేటప్పుడు రుత్వికులు ఒకటే హార్మొనీలో పఠించే మంత్రాలు అత్యంత శక్తిని విశ్వంలోకి విడుదల చేస్తాయి. ఆ శక్తితో పాటు, వారి ఇంటెన్షన్ కూడా కలగలసి ఉంటుంది కాబట్టి… లోక కళ్యాణం అని వారు కోరుకునే ఇంటెన్షన్ నెరవేరడానికి విశ్వం సహకరిస్తుంది.
“యజ్ఞంలో నెయ్యి, ధాన్యం, ఆకులు వంటి వివిధ ద్రవ్యాలు వేస్తారు కదా.. వాటి వల్ల ఉపయోగం ఏంటి” అనే సందేహం చాలామందికి కలుగుతుంది. యజ్ఞానికి ఎంచుకోబడే ప్రతీ ద్రవ్యమూ వాతావరణంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని శుభ్రపరడానికి ఉపయోగపడుతుంది. నెగిటివ్ ఎనర్జీ శుభ్రం అయ్యాక, వాతావరణం కాలుష్యాల నుండి విముక్తం అయ్యాక, యజ్ఞాలు చేసిన సందర్భాల్లో వర్షాలు పడడం చాలామందికి తెలిసిందే. ఇదంతా యజ్ఞం చేసే రుత్వికులు, యజ్ఞానికి ఏర్పాట్లు చేసే సామాన్యులు, వారి ఇంటెన్షన్లోని స్వచ్ఛత, ఎంత నిబద్దతతో చెయ్యబడింది అన్న దాన్ని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి.
శ్రీకృష్ణ భగవానుడు త్యజించవద్దని చెప్పిన మిగిలిన ధర్మాల గురించి మళ్లీ చూద్దాం.
– Sridhar Nallamothu