మూడూ పూట్లా ముద్ద దిగందే మనకు ఈ కంప్యూటర్లూ, ఉద్యోగాలూ, సినిమాలూ, ఛాటింగులూ.. ఏమీ అఖ్ఖర్లేదు.
ముద్ద తినకపోతే ప్రేమలూ, దోమల గురించి ఆలోచించే ఓపికా ఉండదు..
ఆ ముద్దే కరువైపోతోంది.. వర్షాల్లేవు.. పొలాలకు నీళ్లు లేవు.. పంటల్లేవూ..!!
పేపర్లలో కరువుపై కధనాలు రాస్తున్నా.. ఏ సినిమా పేజీలో, స్పోర్ట్స్ పేజీకో నేరుగా వెళ్లిపోతాం. ఎందుకంటే కరువు మనకు సం
కిరాణా షాపుకెళ్లి కేజీ బియ్యం ధర పెరిగిందని, కూరగాయల ధరలు పెరిగాయనీ షాపు వాడు చెప్తే.. మన వేలాది జీతంలో ఓ 4-5% కాస్టాఫ్ లివింగ్ పెరిగిందని గ్రహించి.. అయినా దర్జాగా బ్రతగ్గలుగుతున్నందుకు మన ఫైనాన్షియల్ ప్లానింగులనూ, మన ఉద్యోగాల్ని చూసి మనం గర్వపడుకునే బాపతు జనాలం మనం!
పల్లెటూల్లో రైతెలా బ్రతుకుతున్నాడో మనకు తెలీదు, తెలుసుకోవలసిన అవసరమూ లేదు.
నాది రైతువారీ కుటుంబం. ఇప్పుడు మా పొలాలు కౌలు చేసే అతను పొలాన్ని ఎంత బంగారంగా చూసుకుంటాడో నాకు తెలుసు.. సంవత్సరానికి నాలుగైదు వేలు అదనంగా పొలానికి పెట్టుబడి కావల్సి వస్తే ఎంత అల్లాడిపోతాడో తెలుసు, నేను సాగుబడి చేయకపోతున్నా కష్టపడి సాగుబడి చేస్తున్న అతనికి నాకు వీలున్నంత సపోర్ట్ చేస్తుంటాను. ఇది గొప్పదనానికి చెప్పట్లేదు.. ఊళ్లల్లో రైతులు, కౌలుదార్లు ఎలా బ్రతుకుతున్నారో వేలాది రూపాయలు సంపాదించే మనం మర్చిపోతున్నాం.
వంద రూపాయలు అప్పు పుడితే సర్ధుకుని ఒకటో రెండో రోజులు గడిపే మన గ్రామీణ వెనుకబాటుతనాన్ని మర్చిపోయి మనం పబ్బుల్లోనూ, మోటార్ బైకుల రేసుల్లోనూ, ఫ్రెండ్స్‌తో వేలకు వేల పార్టీల్లోనూ గడిపేస్తున్నాం.
మనం సంపాదించిన డబ్బుని మనం ఖర్చుపెట్టుకోవడంలో తప్పేముంది అని ఇక్కడ చాలామంది క్వశ్చన్ చేయొచ్చు. నిజమే మనం స్వార్థపరులం.. ఎంతైనా ఖర్చుపెట్టేయగలం మన ఆనందాలకు! మీకు పొలాలుంటే ఒక్కసారి మీ ఊళ్లో రైతులు పడుతున్న కష్టాల్ని గుర్తుతెచ్చుకుని ఖర్చుపెట్టండి.
"రైతు గురించి ఎందుకు ఆలోచించాలి? మాకు అవసరం లేని టాపిక్స్ గురించి చెప్పేసి మా మూడ్లు ఖరాబు చేయకండి.." అంటూ విసుక్కుని కాలక్షేపపు కబుర్లలోనూ, జోకుల్లోనూ మునిగి తేలకండి.
అదే రైతు లేనిదే.. ఆ రైతు కష్టపడి పండించిన నాలుగు బియ్యం గింజలు లేనిదే మన వంటిళ్లల్లో పొయ్యి వెలగదు. మన ఆకలి తీరదు.. మన కాలక్షేపాలు సాగవు. ఆకలేసినప్పుడు ముద్ద దిగడాన్ని మించిన ఆనందం ఏ సినిమాలోనూ, జోకుల్లోనూ, కబుర్లలోనూ దొరకదు.
మనం గ్రామాల నుండి వలస వచ్చాం… పెద్ద పెద్ద నగరాలకూ, విదేశాలకూ విస్తరించాం.
మన లైఫ్ స్టయిల్ మారింది.. ఆదాయాలూ, అవసరాలూ, స్టేటస్‌లూ అన్నీ మారిపోయాయి కాబట్టి మన పాత గ్రామాలెలా పోయినా, మన రైతులెలా బ్రతికినా మనకు అనవసరం అనుకుని, కళ్లు మూసుకుని అదే రైతు కష్టపడి పండించిన ముద్దని ఆవురావురుమంటూ మింగేయడం మనకు సిగ్గుగా అన్పించదు.
డబ్బులిచ్చి బియ్యం కొన్నాం కాబట్టి తినే ప్రాప్తం మనకొచ్చినట్లే అన్నది మన అహంకారం. కష్టపడి పండించి.. ఓ పది బస్తాలు స్వంత అవసరాలకు ఇంట్లో ఓ మూలన పడేసుకున్న పాత రోజులు, మన పెద్దల రోజులు మనకు తెలీవు.
ఇంకా పచ్చిగా చెప్పాలంటే వడ్లూ, బియ్యం పండించి నలుగురికీ కూడుపెట్టగల మహారాజులుగా ఒకప్పుడు బ్రతికి ఇప్పుడు అవే బియ్యాల్ని కొనుక్కు తినే వినియోగదారుడిగా మారిపోతాం. ఈ మార్పు మీలో చాలామందికి తెలియకపోవచ్చు. "బీరూ, బ్రాందీలూ కొనుక్కున్నట్లే బియ్యమూ కొనుక్కుంటున్నాం తప్పేముంది" అని అమాయకంగా చూసే మన ఎదుగుదలకు ఇంకేం వాస్తవాలు చెప్పగలం?
"అలా మనం కొనుక్కునేవి చెమటోడ్చి పండించే వాడు తన కడుపు నింపుకోలేకపోతున్నాడు, పస్తులు ఉంటున్నాడు" అంటే అవి మనకు రుచించని ఆకలి కేకలుగా.. టివి ఛానెళ్లనీ ఠక్కున మార్చేసే అవసరం లేని విషయాలుగా మిగిలిపోతుంటే.. ప్రపంచానికి కూడుపెట్టే అన్నపూర్ణని ఆదుకునేదెవ్వరు?
కుర్చీలు కాపాడుకోవడం తప్ప ప్రభుత్వాలు పట్టించుకోవు..
కొనుక్కుని తినడమే తప్ప వెనుకున్న కష్టాలు గ్రహించని ప్రజలకు ఇవేం పట్టవు..
కంప్యూటర్ల ముందు కబుర్లు చెప్పుకుంటూ గడిపే మనకు ఇలాంటివేమీ అవసరం లేదు..
రైతు బ్రతికినా, చచ్చినా.. అది ఓ వార్తే, మరు క్షణంలో ఓ పాటని చూస్తూ దాన్ని మర్చిపోవడమే మనకు తెలుసు.
"మనమేం చెయ్యగలం.." అని మాత్రం అనకండి.. తినే ముద్ద సాక్షిగా కనీసం రైతు బాధ గురించి ఆలోచిద్దాం, ఓట్లేసేటప్పుడు రైతుని దృష్టిలో పెట్టుకుని నాయకుల్ని ఎన్నుకుందాం, కడుపు నింపేవాడు లేకపోతే జీవితమే లేదు! ఆ ఒక్క basic fact గుర్తుంటే చాలు.
గమనిక: నేను రాసే వ్యాసాల్లో ఆవేదన ఉండొచ్చేమో గానీ ఎవర్నీ తప్పు పట్టను, అది గ్రహిస్తే చాలు.. కాబట్టి ఎవరూ నొచ్చుకోవలసిన అవసరం లేదు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply