క్షణకాలమైనా ఆలోచనలను స్థంభింపజేసి మనస్సుని లౌకిక జీవితపు వాసనలేవీ అంటుకోని మౌనస్ధితిలో ఉంచగలమా..? నాలుగేళ్ల క్రితం నేను ధ్యానవిద్యను అభ్యసించేటప్పుడు గాఢ ధ్యానావస్థలోకి చేరుకోనివ్వకుండా ఒకదానితో ఒకటి పొంతన లేని సవాలక్ష ఆలోచనలు అస్థిరపరిచేవి. క్రమేపీ అభ్యాసం కొద్దీ ఒక ఆలోచన యొక్క మూలం, దాని గమనం, గమ్యం, అది మరో ఆలోచనకు దారితీసే వైనం దేనికది స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది. అది మొదలు తుఫానులా చెలరేగే ఆలోచనలనూ అర నిముషానికో, నిముషానికో లేదా రెండు నిముషాలకో కట్టిపడేయగల నేర్పు అలవడింది. మనం ఆనందమో, విచారమో ఓ మానసిక స్థితిలో కూరుకుపోయి ఉన్నప్పుడు ప్రతీ ఆలోచనా ఆ మానసిక స్థితిని మరింత బలోపేతం చేసేదై ఉంటుంది. నా గమనింపుకి వచ్చిన మరో విచిత్రమేమంటే మన మనసు ఆనందంలో తేలియాడుతున్నప్పుడు ఏ మూలనో చిన్న అభద్రతాభావం పొంచి ఉండి క్షణకాలం మనల్ని "ఈ ఆనందం నిజమైనదేనా, ఇది ఇలాగే కొనసాగుతుందా" అని ఆందోళనపరుస్తుంది. దాంతో మిశ్రమ ఆలోచనలతో మనసు ఊగిసలాడడం మొదలవుతుంది. అదే పూర్తిగా విచారంలో ఉన్నప్పుడు ఇంతకుముందులా ఏ కోశానా ఆశారేఖ అగుపించదు. ఒకవేళ క్షణకాలం ఆశ మిణుక్కుమిణుక్కుమన్నా ప్రతికూల ఆలోచనలు పూర్తిగా మనస్సుని కప్పేసి ఆ ఆశనూ అసాధ్యమైనదిగా సమాధి చేస్తాయి.
మనం అనుభవిస్తున్నది ఆనందమా.. విచారమా..
మనుషులు, సమాజం, మిత్రులు, బంధువులూ, మనస్థత్వాలూ, రాజకీయాలూ, సినిమాలూ, వృత్తి వ్యాపారాలూ.. అసలు మన మనస్సు చొచ్చుకుని వెళ్లని ప్రదేశం లేదు. అన్నింట్లోనూ దూరి మనస్సు ఏదో అంటించుకోవాలని చూస్తుంది. ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, రాతల ద్వారా, చేతల ద్వారా, ఛేష్టల ద్వారా ఏదో తనని తాను ప్రకటితం చేసుకోవాలనీ చూస్తుంది. ఆ ప్రయత్నంలో ఎక్కడో భంగపాటు కలిగి నిరుత్సాహపడి ఆ నిరుత్సాహం నుండి మరో భిన్నమైన ఆలోచనకు శ్రీకారం చుడుతుంది. ఇలా అర్థరాత్రిళ్లు గాఢసుషుప్తావస్థలోకి చేరుకునే వరకూ ఆలోచనలు మనల్ని విడిచిపెట్టవు. బాహ్యప్రపంచంలో అంత గాఢమైన స్థితిలోనూ స్వప్నాల ద్వారా మనల్ని ప్రభావితం చేయజూస్తుంది. మన అంతఃచేతనలో ప్రతీ సంఘటనా ఎంత బలంగా ముద్ర వేసుకుపోతోందో రుజువు చేయడానికి ఈ స్వప్నాలే నిదర్శనం.
వీటన్నింటిని నుండి మనసుని బంధవిముక్తం చేసి దేహాన్నీ, లౌకిక ప్రపంచాన్నీ వేరుగా పెట్టి అనిర్వచనీయమైన నిర్మల స్థితికి చేరుకోవడం బ్రహ్మవిద్యేం కాదు. కావలసిందల్లా మన ఆలోచనాసరళిపై కొద్దిపాటి గమనింపూ, జీవితంలో ఏది శాశ్వతం, ఏది క్షణికం అన్న దానిపై మరికొద్ది అవగాహనా, మన ఆరాటం, మన ఆలోచనల వేగమూ సమంజసమైనవేనా అన్న నిర్థారణా. మనం ఏం కోరుకుంటే, దేన్ని బలంగా కాంక్షిస్తే మన ఆలోచనలు ఆ దిశగా బలోపేతం అవడం ఆలోచనల సహజ లక్షణం. మన కోరికలకు ఓ హద్దు లేకపోతే ఆలోచనలు అలా మనల్ని నిరంతరం ముప్పిరిగొంటూనే ఉంటాయి. వాటి సాధనలో మరిన్ని చిక్కుముడులు మనసుకి చుట్టుకుంటూనే మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఆలోచనలు స్థిరత్వానికి చేరుకోవాలంటే ప్రతీ ఆలోచన ఆద్యంతాలపై మన స్వీయ విశ్లేషణా, ముక్తాయింపూ, ఆ ఆలోచన పర్యవసానాలపై అంచనా చాలా అవసరం. అప్పుడు ఏ ఆలోచనా మనల్ని కల్లోలభరితం చేయలేదు.
Leave a Reply