“నేను ఇష్టపడిన ప్రతీదీ నాకు దూరమవుతూనే ఉంది” – ఈ డైలాగ్ దాదాపు ప్రతీ ఒక్కళ్లూ లైఫ్‌లో ఎప్పుడోసారి వాడేస్తూనే ఉంటారు.
“ఇవ్వాళ ఇంతలా నవ్వేస్తున్నాను.. ఏం bad జరగబోతోందో” అన్న డైలాగ్ కూడా తరచూ విన్పిస్తూనే ఉంటుంది.
సో మనం జనాలకు అంటీముట్టనట్లు తిరుగుతుంటాం.. ఎవరైనా కొద్దిగా క్లోజ్ అవుతుంటే మనకు మనం భయపడిపోయి.. బలవంతంగా దూరం పెట్టేస్తుంటాం. ఎక్కడ చనువు కాస్తా వికటిస్తుందోనన్న ఆదుర్దా. “ఎంతవరకూ ఉండాలో అంతవరకూ ఉంటే పోదా..” అనే ఓ ఉజ్జాయింపు లెక్క మనల్ని మెకానికల్‌గా ప్రవర్తించేలా చేస్తుంటుంది.
ప్రపంచాన్ని మర్చిపోయి సరదాగా నవ్వుకోవాలన్నా సంకోచమే.. అంత సంతోషంలోనూ ఏ మూల నుండో అశుభం మనస్సులోకి తొంగిచూసి.. హాయిగా విప్పారిన పెదాల్ని ముడిచి పారేస్తుంది.
——————————-
భగవంతుడు కక్షకట్టి ఇష్టమైన వాళ్లని దూరం చేశాడనో, మన సంతోషాన్ని ఆవిరి చేశాడనో బాధపడిపోతుంటాం.. మన తలరాత ఇంతే.. సో దేని మీదా ఆశపడకూడదు.. ఏదీ మనస్సులోకి సంతోషంగా తీసుకోకూడదు.. అని ఫిక్సపోయి చాలా కృత్రిమంగా బ్రతికేస్తుంటాం.
ఎవ్వరూ మన సంతోషాన్ని, అయిన వాళ్లనీ దూరం చెయ్యలేరు. దూరం చేసుకుంటున్నదల్లా మనమే.
యెస్… ఒక మనిషి చనువుగా ఉంటే మనకు ఎక్కడ లేని అంచనాలూ పుట్టుకొస్తాయి.. ఆ మనిషిని పూర్తిగా మన ఆలోచనలకు తగ్గట్లే ప్రవర్తించాలన్న పొసెసివ్‌నెస్ కూడా తన్నుకొస్తుంది. అవతలి వ్యక్తి ఏ కొద్దిగా భిన్నంగా ప్రవర్తించినా.. మన అంచనాలకు తగ్గట్లు లేకపోయినా.. మనకే ఫస్ట్ ద్వేషం పుట్టుకొస్తుంది.. మనకు మనమే దూరం అవడం మొదలెడతాం. కానీ, మనల్ని ఎవరు తప్పుబడతారోనని… అవతలి మనిషి మనకు ఏ విధంగా అన్యాయం చేశారో.. మనం “అంత చేస్తే” మననెంత నిర్లక్ష్యం చేశారో అందరి దగ్గరా ఎస్టాబ్లిష్ చెయ్యడానికి రకరకాల కారణాలూ, సాకులూ వెదుకుతుంటాం. మొత్తానికి అవతలి మనిషికి దూరం అవ్వడానికి తగిన platform సిద్ధం చేసుకుని.. అవతలి మనిషిని ఓ వెధవని చేసి పారేసి.. మనం ఏం తప్పులేని గొప్పవాళ్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుని దూరంగా జరిగిపోతాం.
ఇక్కడ భగవంతుడో, ఇంకెవ్వరో కాదు మన రిలేషన్ చెడగొట్టింది.. స్వయంగా మనకు మనమే.
———————
ప్రేమించు.. అభిమానించు… అంతవరకే నీ చేతిలో ఉన్నది. అవతలి మనిషి లైఫ్ అవతలి మనిషిది. ఆ మనిషిని అన్కండిషనల్గా అభిమానించడం వరకే నువ్వు చేయాల్సింది. బట్ మన లవ్‌కి, ఎఫెక్షన్కీ చాలానే కండిషన్స్ ఉంటాయి. “ఇంతగా అభిమానిస్తున్నాం కాబట్టి.. ఇంతగా ప్రేమిస్తున్నాం కాబట్టి.. వాళ్లు సర్కస్‌లో జంతువుల్లా మనం ఆలోచనల్ని గ్రహించకుండా వాళ్లకంటూ స్వంత వ్యక్తిత్వం కూడా కోల్పోయి మన అడుగుజాడల్లోకి ఒదిగిపోవాలి. అప్పుడే మన ఇగో సంతృప్తి పడుతుంది.
ఇంకే నిలుస్తుంది రిలేషన్?
మనిషిని ఇష్టపడండి… మిగతాదంతా వదిలేయండి.. వాళ్లని స్వేచ్ఛగా వారి జీవితాల్ని వారిని జీవించనీయండి.. ఇలా చేస్తే ఏ రిలేషన్ అయినా ఎందుకుండదు జీవితాంతం? ఎవరు తెంచగలరు ఇంత గొప్ప అండర్‌స్టాండింగ్‌ని?
———-
అలాగే next minsలో ఏడుపు పొంచి ఉందేమోనన్న భయం కొద్దీ నవ్వడం ఆపేయడం కూడా మనలో పెరిగిపోతున్న ఇన్సెక్యూరిటీని సూచిస్తుంది. లైఫ్‌లో ఏడుపు ఉంటుంది.. అది సహజం. కానీ ఆ ఏడుపు మనం మనస్ఫూర్తిగా నవ్వుతున్నాం కాబట్టి మనల్ని వెక్కిరించడానికి కక్షకట్టి మరీ రాదు. అలా వస్తుందనుకోవడం మన అమాయకత్వం. ఒకవేళ నవ్విన వెంటనే ఏడుపు వచ్చినా రెండింటికీ మధ్య లింకింగ్ క్రియేట్ చేసుకోవడం వల్ల మనం జీవితాంతం నవ్వే భాగ్యాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్నాం.
సో మనుషుల్ని ప్రేమించండి.. మనస్ఫూర్తిగా నవ్వండి.. ఏం నష్టం లేదు… మనుషులూ, నవ్వులూ ఎక్కడికీ పోవు… మనకు కమిట్మెంట్ ఉంటే!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply