రోజూ పొలాల్లో నాట్లు వేస్తూ కాళ్లు పాచిపోయి.. సాయంత్రాలకు ఇల్లు చేరుకుని ఏదో తినాలి కాబట్టి లేని ఓపిక తెచ్చుకుని రోటి పచ్చళ్లతో కడుపు నింపుకునే మనుషుల్ని మీరు స్వయంగా చూశారా?
నాకైతే బంగారం లాంటి మా అమ్మమ్మ తాతయ్యలున్నారు.. 15వ ఏట వరకూ వాళ్లతో పాటు పొలంలో పనిచేసిన నా బాల్యం కష్టమంటే ఏమిటో అర్థం తెలిపింది.
"అంత కష్టపడడం ఎందుకు.. కాస్త రిలాక్స్ అవ్వొచ్చు కదా" అని చాలామంది చనువున్న మిత్రులు కొద్దిగా కోపంగానే అంటుంటారు. వారి concernని తక్కువ చూడలేను గానీ.. వీలైనంత కష్టపడడమే లైఫ్ అని మా పెద్దల్ని చూసి నేర్చుకున్నాను.
తాము పడే కష్టం నేను పడకూడదు అని ఎంతో అపురూపంగా మా అమ్మమ్మ, తాతయ్యలు చూసుకోవడానికి ప్రయత్నించినా.. వాళ్లు కాళ్లకు పుండ్లు పడో, ఒళ్లు నొప్పులతోనో, తినీ తినకా నీరసంతో బాధపడుతుంటే.. నేనెలా సుఖంగా ఫీల్ కాగలను?
కందిపోకుండా, కష్టం తెలీకుండా పెరిగే సంస్కృతి వచ్చేసింది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న కంఫర్ట్స్లో ఓ 2% అయినా మా పెద్దవాళ్లు చూడలేకపోయారే అన్న బాధ చాలాసార్లు నన్ను బాధిస్తుంది.
వాళ్లు ఎంత కష్టపడ్డారో కళ్లారా చూసిన నాకు రిలాక్స్డ్గా బ్రతికేయడం ఎలా సాధ్యమవుతుంది?
ఇందులో ఏ ఒక్క మాటా నా గొప్ప కోసం రాయలేదు. చాలా బాధతో మనస్సు నుండి రాస్తున్న మాటలు ఇవి. అస్సలు మనకు ఇన్ని సౌఖ్యాలు వచ్చి చేరాయి కాబట్టే కబుర్లు చెప్పుకోవడం తప్ప వేరే పనేమీ లేనట్లు బ్రతికేస్తున్నాం.
మన సంపాదనలో మన కడుపు నింపుకోవడానికి 5% శాతానికి మించి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని గొప్ప స్థోమత గల జీవితాలు మనవి. ముద్ద చాలా కంఫర్టబుల్‌గా దిగుతోంది కాబట్టి ఎన్ని కబుర్లయినా చెప్తాం.
ఎంత కష్టపడినా కడుపు నిండడానికి సరిపడా సంపాదన లేని జీవితాలనెన్నో బాల్యంలో చూశాను. వాళ్లు కబుర్లు చెప్పుకోలేరు.. కష్టపడి పనిచేయడం తప్ప వాళ్లకే తీరుబడీ లేదు. మూడు పూట్లా కావాలన్నా బిర్యానీలు తినే మనకూ, ఒక్క పూట తినడానికే ఒకరోజు కష్టం చాలని మన పూర్వీకులకు ఎంత వ్యత్యాసం? తిన్నా అరిగించుకోలేని సిస్టమ్‌లు మనవి.. అరిగించుకోగలిగినా సరిపడా తిండిలేక నకనకలాడే జీవితాలు వాళ్లవి
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. కష్టపడడం అన్నది ఎక్కడా జస్టిఫై చెయ్యబడట్లేదు.
జనాలకు కష్టపడడం అంతే చేతకానితనంగానే కన్పిస్తుంది. కష్టం విలువ తెలీని రోజున ఎంత గొప్ప సుఖమైనా మొహమెత్తట్లేదా?
అందరం ఉద్యోగాలు చేస్తాం.. నిజంగా చేస్తున్న పనిని ఆస్వాదిస్తూ, మన బాధ్యతని నూటికి నూరుశాతం నెవవేర్చాలన్న తపనతో చేస్తున్న వాళ్లెంతమంది? ఇది ఎవర్నీ తప్పు పట్టడానికి అనట్లేదు. ఓ బాధ అంతే.
డబ్బే కొరతగా ఉన్న నిన్నటికీ, ఏమీ లేకుండా డబ్బు మాత్రమే ఉన్న నేటికీ మధ్య మనం పోగొట్టుకున్న బాధ్యతలూ, విలువలూ, అంకితభావం వంటివన్నీ ఎవరెన్ని చెప్పినా పుట్టుకురావు.. మళ్లీ మన పెద్దల నాటి కష్టాలు.. పంటలు పండక డబ్బెంత ఉన్నా కొనడానికి గింజలు దొరకని రోజులు వచ్చినప్పుడో.. ఇంకో విధంగానే మనకూ అనుభవమైతే తప్ప!
కష్టాన్ని నమ్ముకుంటే సుఖం రెట్టింపవుతుందని మాత్రం నావరకూ వ్యక్తిగతంగా రకరకాల అనుభవాల ద్వారా తెలుసుకోగలిగాను. ఆ జ్ఞానాన్ని తమ జీవితాల్ని కరిగించేసి మా పెద్దలూ అందించారు, రకరకాల అనుభవాల్ని అందించడం ద్వారా భగవంతుడూ ప్రసాదించాడు.
నావరకైతే ఇంతకన్నా అద్భుతమైన గొప్ప జీవితం ఏదీ లేదు… ఎన్ని సుఖాల్లోనూ 🙂
గమనిక: ఈ ఆలోచనా విధానం ఎవరికైనా పనికొస్తుందనిపిస్తే మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply