ఓ ప్రవాహంలో కొట్టుకుపోవడానికి అలవాటు పడిపోయి ఉంటాయి మన ఆలోచనలు…
అందుకే మాస్ హిస్టీరియాని సృష్టించడం చాలా సులభం.
ఎంత స్థితప్రజ్ఞులుగా తమని తాము భావించుకునే వారైనా సమూహపు ఆలోచనలచే ప్రభావితులవడం కామన్.
"వందమంది ఏదేదో అయిపోతోంది.." అని పరుగులు తీస్తుంటే విచక్షణ ఉన్న ఒక్కడు కూడా నింపాదిగా తన పని తాను చేసుకోలేకపోవడం ఎమోషనల్ బ్యాలెన్సింగ్ కోల్పోతున్నట్లే.
ఉన్నదున్నట్లు చెప్పుకోవాలంటే.. ఇప్పుడు సమాజంలో మనం ప్రతీరోజూ చాలా హిస్టీరిక్‌గా తయారై ప్రవర్తిస్తున్నాం. చాలా external factors మన మనసుల్ని ఇన్ సెక్యూర్డ్ చేస్తున్నాయి.
"సంతోషంగా ఉన్నాం" అనే మాటకు బదులు "అన్యాయమైపోతున్నాం" అనే మాటని ప్రతీ ఒక్కళ్లం ఎడాపెడా వాడేస్తున్నాం. దీన్నిబట్టే చెప్పొచ్చు.. మనం ఎంత బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నామో.
మనం బాధపడే సోషల్ ఇష్యూస్ ఏవీ.. కేవలం మనం నలుగురితో వాపోవడం వల్ల సాల్వ్ అయ్యేవి కావు.. కానీ మనం గుండెలు బాదుకుంటూనే మరింత గుండె భారాన్ని మోస్తున్నాం… ఉన్న సంతోషాన్ని అటకెక్కిస్తున్నాం.
భయభ్రాంతపు Panic నేచర్ పదునైన కత్తి లాంటిది. పీకల్ని కోసేస్తుందది…
ఓ టివి ఛానెల్లోనో, ఓ సోషల్ నెట్వర్క్ సైట్లోనో, ఓ ఫ్రెండ్‌తో పిచ్చాపాటీ కబుర్లలోనో భయం ఉత్పత్తి చేయబడుతుంది.. అది ఆలోచనల్లో వెంటాడుతుంది.. మరింత మంది బుర్రలకు ఇంజెక్ట్ చేయబడుతుంది… చివరకు అందరూ కలిసి భయపడుతూనే.. "కలిసి ఉన్నాం కాబట్టి భయం లేదనే" మేకపోతు గాంభీర్యంలో బ్రతుకుతుంటారు. కాలంతో పాటే ఆ భయమూ కడిగేయబడుతుంది… అంతలో కొత్త భయం పట్టుకుంటుంది.
ఇది ఓ సైకిక్ బిహేవియర్. భయాల్నీ, వ్యవస్థలపై అపనమ్మకాల్నీ ఉత్పత్తి చేసే కేంద్రాలు రోజూ న్యూస్ పేపర్ల దగ్గర్నుండి అర్థరాత్రి బులెటన్ల వరకూ కొత్త భయాల్ని సృష్టిస్తూనే ఉంటాయి. వాటికి కావలసింది మనల్ని ఉద్వేగానికి లోను చేయడం.
సమాజంలో పేరుకుపోయిన కుళ్లుని చూపిస్తూ… మాట్లాడుకుంటూ.. డిబేట్లు చేసుకుంటూ.. కుళ్లుని కడిగేయజూస్తే ఆ కుళ్లు ఆక్టోపస్‌లా ఇంకా మరిన్ని మూలలకు వ్యాపిస్తుందన్న విషయం ఎవరూ గ్రహించరు…
నిజంగా సమాజంలో మార్పు రావాలంటే.. ఓ పది మంచి పనుల్ని చూపించినా… పది మంచి పనుల గురించి మాట్లాడుకున్నా.. ఓ పదిమందిని ప్రశంసించినా.. ప్రోత్సహించినా.. పెద్ద కష్టపడకుండానే దానంతట అదే వస్తుంది.
నెగిటివ్ ఎనర్జీని విస్తరింపజేయడానికి పెద్ద efforts అవసరం లేదు. మనలాంటి గొర్రెల తరహా జనాలు వాహకాలుగా ఉన్నంతకాలం! కానీ ఆ నెగిటివ్ ఎనర్జీతో కుళ్లు కడిగేద్దామనుకోవడమే ఎప్పటికీ అవని పని.
మురికి పట్టిన చోట మంచినీళ్లతో కడగాలి గానీ… మురికిని పదే పదే తలుచుకుంటూ బాధపడిపోతే ఫలితం ఉండదు.
మన బాధ్యతారాహిత్యపు ఆలోచనలూ, మీడియా మొదలుకుని ఓ సగటు వ్యక్తి వరకూ సొసైటీలో పంప్ చేసే నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కలిసి సమాజంలో మార్పు తెస్తున్నాయో లేదో తెలీదు గానీ మానసిక రోగుల్ని మాత్రం ఖచ్చితంగా తయారు చేస్తున్నాయి.
ఏ ఒక్కరన్నా ఆహ్లాదాన్ని పంచుకుంటున్నారా…. కనీసం ఆహ్లాదకరపు విషయాల్ని అన్యాయాల్ని బుర్రకు ఎక్కించుకున్నంత rapidగా షేర్ చేసుకుంటున్నారా?
ఏ ఎమోషన్ అయినా మొదట్లో హెల్తీగానే ఉంటుంది. దాని డోస్ పెరిగితే పిచ్చి అన్పించుకోబడుతుంది. అది మనల్ని కబళించి వేస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ఆ ఎమోషన్ మనల్ని బానిసల్ని చేసుకుంటుంది. అంతకన్నా మంచి ఎమోషన్ మన ముందున్నా నెగిటివ్ ఎమోషనే మనకు బాగున్నట్లు అన్పిస్తుంది.
ఇప్పుుడు సొసైటీలో జరుగుతున్నది అదే. ఓ స్థాయికి మించి జనాలు మీడియా వల్ల కావచ్చు.. ఇతరత్రా మార్గాల ద్వారా కావచ్చు భయపెట్టబడుతున్నారు… ఆ భయాలకు వాళ్లు బానిసలైపోయారు. భయం లేనిదే, పొద్దున్నే పేపర్ చదివి కొత్త భయం బుర్రలోకి ఎత్తుకోనిదే ప్రశాంతత అన్పించదు ఈ మాస్ హిస్టీరిక్ పేషెంట్లకు..!! (దయచేసి ఇక్కడ ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి.. నేను నా సైకాలజీ నాలెడ్జ్ నీ, ప్రస్తుత సమాజపు పోకడనీ అనలైజ్ చేస్తూ ఇలా రాస్తున్నా తప్ప ఎవర్నీ చిన్నచూపు చూడట్లేదు)
లైఫ్ ఎంత అద్భుతమైనది… ఎంత హాపీగా ప్రతీ క్షణాన్నీ గడపొచ్చు… పనికిమాలిన భయాలన్నీ మోసుకు తిరక్కపోతే…?
ఒక్కటి మాత్రం నిజం.. భయాన్ని ప్రొడ్యూస్ చేస్తూ.. రీషేర్ చేస్తూ.. పెట్రోలు ధరలు పెరిగినా, శాన్వి లాంటి పాప చనిపోయినా అందరం కలిసికట్టుగా ఉన్నామనే భ్రాంతిలో హిస్టీరిక్ గా తిరగబడుతూ… మళ్లీ మనలో మనమే మన పక్క వ్యక్తులకు పైకి తెలీని గాయాలు చేస్తూ… బ్రతుకుతూ పోతే జీవితంలో ఆనందం ఎప్పటికీ మనకు దొరకదు.
ఇది 100% సత్యం…
గమనిక: ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందన్పిస్తే షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply