ఒక మనిషి అడుగులో అడుగు వేసుకుంటూ చాలా నిదానంగా నడుస్తున్నాడు.. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అంటే అంతా పర్ఫెక్ట్.. వయసైపోయిందా అంటే, 40 ఏళ్లు కూడా దాటలేదు. మరి ప్రాబ్లెం ఏమిటి?
ఆ మధ్య మాటల్లో ఓ దర్శక మిత్రులు దీన్ని భలే ప్రస్తావించారు. సరిగ్గా ఇవే రకమైన అభిప్రాయాలు నాకు ఎప్పటినుండో ఉండీ… ఖచ్చితంగా దీనిపై రాయాలని ఆరోజు అన్పించి, ఇన్నాళ్లకు తీరింది.
——————–
చురుకుదనం లోపించడం.. జీవితం మొద్దుబారిపోవడం.. చాలా రొటీన్ అయిపోవడం.. ఇదీ సమస్య చాలామందికి. యాభై వేలకు పైబడి వస్తే చాలు… దర్జాగా కాలు మీద కాలు వేసుకుని బ్రతికేయొచ్చు అన్నది చాలామంది అభిప్రాయం. ఇలా చల్ల కదలకుండా ఉండే ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కుస్తీపడి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోటీ పడడం కూడా చాలా కామన్. ఇది తప్పు కాదు. ఎవర్నీ తప్పు పట్టడం కూడా ఈ పోస్ట్ ఉద్దేశం కాదు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి.
పొద్దున్నే 11 గంటలకు తాపీగా ఆఫీస్‌కెళ్లి.. కాసేపు కబుర్లు చెప్పుకుని.. ఒకటి రెండు ఫైళ్లు చూసి.. అలా క్యాంటీన్‌కి వెళ్లి.. సిగిరెట్ తాగుతూ, కబుర్లు చెప్పుకుంటూ, టీ తాగి.. మళ్లీ లంచ్ టైమ్‌కి బాక్స్ తినేసి.. ఇంకో గంట ఉన్నట్లు అనిపించి.. మెల్లగా కారునో, టూవీలరో నడుపుకుంటూ ఇంటికెళ్లి.. పిల్లల్ని ట్యూషన్లో వదిలిపెట్టి.. స్నానం చేసి, దగ్గరలో ఉన్న బార్‌కెళ్లి.. రెండే రెండు ఔన్సులు రోజూ కలిసే బ్యాచ్‌తో తాగేసి.. ఆ కాసేపట్లోనే ప్రపంచంలోని రాజకీయాలన్నీ మాట్లాడుకుని.. ఇంటికొచ్చి కడుపు నిండా తినేసి.. సరిగ్గా 11 గంటల్లోపు పడుకుని.. పొద్దున్నే లేచే బ్యాచ్ ఈ ప్రపంచంలో కొన్ని కోట్లమంది ఉన్నారు. ఇది చూడడానికి చాలా పద్ధతైన జీవితం, డిసిప్లెయిన్తో కూడిన జీవితం అన్పిస్తుంది.
ఇలాంటి జీవితాల్లో ఉద్యోగం రావడం, పెళ్లవడం, పిల్లలు పుట్టడం, పిల్లలకు పెళ్లి చేసి పంపడం ఇవే మేజర్ ఇన్సిడెంట్లు. ఈ నాలుగు పనులూ సాఫీగా అయితే “భగవంతుడి దయ వల్ల ఏ లోటూ లేకుండా జీవితం” గడిచిపోయింది అని సంతోషపడతారు. రిస్క్ ఫేస్ చెయ్యడానికి భయపడే బాపతు. కొత్తదనం అస్సలు ఇష్టపడని తత్వం. ఇంకేదైనా జీవితంలో సాధిద్దామా అన్న కోరిక నరాల్లో శాశ్వతంగా చచ్చిపోయి ఉంటుంది. “ఇప్పుడు అంతా బానే జరిగిపోతోంది కదా..” అని ఎప్పటికప్పుడు సేఫ్జోన్లో చాలా కూల్‌గా బ్రతికేస్తారు.
———————-
సో డైనమిజం ఏ కోశానా ఉండదు. అస్సలు జీవితమే కొత్తగా కన్పించదు. ముప్పై ఏళ్లు ఒకే పని చేసీ, చేసీ.. ఒకే విధంగా బ్రతికీ బ్రతికీ ఒంట్లో ఓపిక ఉన్నా చాలా నింపాదిగా బ్రతకడం అలవాటవుతుంది. ముసలాళ్లలా మెల్లగా నడుచుకుంటూ వచ్చి కుర్చీ ఎక్కడ పడిపోతుందో అని చాలా జాగ్రత్తగా కుర్చీని ఒక చేత్తో పట్టుకుని, కుర్చీలో ఏమైనా మురికి ఉందేమోనని చూసి తుడుచుకుని కూర్చుని, “జీవితంలో చాలా సాధించేశాం” అన్న ఫీలింగ్ ద్వారా వచ్చిన భంగిమ అయిన కాలు మీద కాలు వేసుకుని అప్పుడు మాట్లాడుతుంటారు.
మనం లొడలొడా మాట్లాడుతూనే ఉంటాం. ఆ, ఊ కొట్టడం తప్పించి పెద్దగా మాటలు కూడా రావు. ఆచితూచి మాట్లాడతారు.. అది అలవాటైపోయి ఉంటుంది.
———————
ఎందుకిలా జరుగుతోంది? అస్సలు ఎవరూ గమనించరు… మనిషి సగం వయస్సుకే జీవశ్చవంలా మారిపోతున్న వైనాన్ని! అంతా కూడబెట్టిన ఆస్థినీ, ఉన్న లక్జరీలను, చుట్టూ ఉన్న మందీ మార్భలాన్నీ చూసి.. “వాడిదేముంది.. హాపీ లైఫ్” అనుకుని వాడిలా ఉండాలని ఆశపడతారే గానీ.. అలా ఉండడం మరణంతో సమానం అని ఎవరికీ అర్థం కాదు.
యెస్.. అన్నీ సుఖంగా ఉన్న వాడి లైఫ్ పైకే బాగుంటుంది. లోపల అస్సలు జీవమే ఉండదు. నిరంతరం పడిలేస్తూ, ఎప్పటికప్పుడు కొత్త టార్గెట్లు పెట్టుకుంటూ, వాటిని సాధిస్తూ.. జీవితాంతం కొత్తవి మెళకువలు నేర్చుకుంటూ, పదిమందితో కలుస్తూ, “ఈ కాస్తంత లైఫ్ చాలు” అని అస్సలు ఏ ఫేజ్లోనూ సంతృప్తిపడకుండా నిరంతర విద్యార్థిగా ఉండే వాడిదే గొప్ప లైఫ్. అలాంటి వాడు ఎంత చురుకుగా ఉంటాడో మీరు ఎక్కడైనా ప్రాక్టికల్‌గా చూడండి.
జీవితం వడ్డించిన విస్తరిగా ఉండాలని కోరుకునే వాడు ఎప్పుడూ ఓ అసంపూర్ణమైన జీవితాన్నే అనుభవిస్తాడు. “జీవితం ఎలా ఉన్నా కూడా నాకు నచ్చినట్లు మలుచుకుంటాను.. కొత్త ఛాలెంజెస్ రావాలి” అని రెడీగా ఉండే వాడు జీవితం అంతు చూస్తాడు. 60 ఏళ్లు వచ్చినా యంగ్‌గానే కన్పిస్తాడు.. రాజకీయ నాయకుల ప్రస్తావన తప్పనిసరై తెస్తున్నాను.. ఓ చంద్రబాబుని, ఓ కేసీయార్‌ని, మోదీని చూడండి.. వాళ్లు వయస్సుకి మనలో ఎంతమంది ఆ మాత్రం చలాకీగా ఉంటారు? నిరంతరం డైనమిక్‌గా ఉండే వాడికే అలా సాధ్యం. అలా బ్రతకడానికి ప్రయత్నిద్దాం.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply