జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ।
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావఛ్చృణు తాన్యపి ।। 19 ।।
జ్ఞానము, కర్మ, మరియు కర్త – ఇవి ప్రకృతి త్రి-గుణముల పరముగా ఒక్కోటి మూడు రకాలుగా ఉంటాయని సాంఖ్య శాస్త్రము పేర్కొంటున్నది. నేను ఈ వ్యత్యాసాలు నీకు ఇప్పుడు చెప్తాను వినుము.
వివరణ: ఇంతకుముందు శ్లోకంలో జ్ఞానమంటే ఏమిటో తెలుసుకున్నాం. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని ఒక కర్త ఎలాంటి కర్మలు చేస్తాడో ఆ కర్మలు మూడు విధాలుగా ఉంటాయని, వాటి గురించి భగవానుడు చెప్పబోతున్నారు. ఇందులో భాగంగా ఏది ఎలాంటి జ్ఞానమో క్రింది శ్లోకాల్లో చెప్పనున్నారు.
20వ శ్లోకం:
సర్వ భూతేశు యేనైకం భావమవ్యయమీక్షతే ।
అవిభక్తం విభక్తేషు తత్ జ్ఞానం విద్ధి సాత్వికం ।। 20 ।।
సమస్త విభిన్నమైన జీవరాశులలో ఒకే అవిభక్తమైన అనశ్వరమైన ఒకే అస్థిత్వము ఉన్నట్టు తెలుసుకోనటమే సత్త్వ గుణము లో ఉన్న జ్ఞానము.
వివరణ: అన్ని జీవరాశుల్లో నాశనం చెయ్యడానికి వీల్లేని ఒకటే అస్థిత్వముందని తెలుసుకోవడం సత్త్వ గుణంలో ఉన్న జ్ఞానమని భగవానుడు చెబుతున్నారు. అందర్నీ తరచూ ఒకటే ప్రశ్న వేధిస్తూ ఉంటుంది. మీరు వేరు, నేను వేరు, ఫోన్ వేరు, టివి వేరు.. ఒక జంతువు వేరు, మరో సూక్ష్మ క్రిమి వేరు.. ఇలా కళ్లకు కనిపించే ప్రతీదీ వేర్వేరు భౌతిక రూపాల్లో కనిపిస్తుంటే “విశ్వం మొత్తం ఒకటే, వేర్వేరుగా చూడకు” అని ఆధ్యాత్మిక ప్రవచనాల్లో ఎలా చెఋతారు అనే గందరగోళానికి మనం గురవుతూ ఉంటాం.
మనం ఒక విషయాన్ని కళ్లతో చూసే విధానం చాలా పరిమితమైనది. అంటే కళ్లు భ్రాంతిని సృష్టించగలుగుతాయి. ఇది అర్థం కావడానికి ఓ ఉదాహరణ చెబుతాను. మీ ఇంట్లో హోలోగ్రామ్‌తో తయారు చెయ్యబడిన ఏదైనా ఫొటో ఫ్రేమ్ ఉంటే కాసేపు దాని వైపు చూడండి. అందులో ఏదో బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మ కూడా మామూలు పేపర్ మీద ప్రింట్ చెయ్యబడిన ఫొటోల్లా 2Dలా ఫ్లాట్‌గా కాకుండా ఉబ్బెత్తుగా 3Dలో కనిపిస్తుంది కదా! కేవలం పొడవు, వెడల్పు మాత్రమే ఉండే ఆ ఫొటోకి ఎత్తు అనే మూడవ డైమెన్షన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చింది అంటే ఆ ఫొటో మీద ఒక స్కేల్లో (పరిమాణంలో) పొందుపరచబడిన చుక్కల సముదాయాన్ని ఒక వ్యక్తి దూరంగా నుండి ఆ స్కేల్‌కి భిన్నమైన కోణంలో తన కళ్లతో చూసినప్పుడు వాస్తవానికి లేని కొత్త డైమెన్షన్ జత అవుతుంది. అందుకే ఆ ఫొటో త్రీడీలో ఉన్నట్లు కనిపిస్తుంది.
విశ్వానికి సంబంధించిన రహస్యాలను చేధించడానికి అనేకమంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో విశ్వం మొత్తం మన కళ్లకి కన్పించేలా త్రీడైమెన్షనల్ రూపంలో కాకుండాఇప్పుడు నేను చెప్పిన హోలోగ్రామ్లా 2Dలో భారీ మొత్తంలో సమాచారం ఎన్కోడ్ చెయ్యబడిన హోలోగ్రఫిక్ రూపంలో ఏర్పడిందని తేలింది.
ఫిజిక్స్ రంగానికి చెందిన శాస్త్రవేత్తలు టి.హూఫ్ట్, లియోనార్ట్ సస్కైండ్ ఒక ఉపరితలం మీద అన్ని ఆబ్జెక్ట్‌లు, వాటి పరిమాణం మాత్రమే కాకుండా, ఆ ఉపరితలం మీద ఆ వస్తువులు స్వేచ్ఛగా విస్తరించడానికి, సంకోచించడానికి కావలసిన, ఆ వస్తువు యొక్క స్వభావాన్ని నిర్వచించే సమాచారం మొత్తాన్నీ నిక్షిప్తం చేయొచ్చని ప్రతిపాదించారు. సరిగ్గా ఇదే పద్ధతిలో విశ్వంలోని జీవజాతులు, పదార్థాలకు సంబంధించిన సమాచారం అంతా ఒక హోలోగ్రామ్ రూపంలో 2Dలో ఉండే ఉపరితలం మీద ఎన్కోడ్ చెయ్యబడింది. ఈ ఉపరితలం మీద వివిధ ప్రదేశాల్లో ఉండే సమాచారం ఒకదాని చేత ఒకటి ప్రభావితం అవడం ద్వారా విశ్వంలోని ప్రతీ చర్యకీ ప్రతిచర్య ఏర్పడి మనం కలిగి ఉండే ఆలోచనలు విశ్వంలోని వేరొక చోట వేరొక పరిణామానికి దారితీయడమో, వేరొక ఎనర్జీని ప్రేరేపించడమో చేస్తుంటాయి.
విశ్వంలో అది చెట్టయినా, పుట్టయినా, మనిషైనా, వస్తువైనా ప్రతీ దాని నుండి నిరంతరం ఏర్పడే ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలు మిగతా అన్ని అంశాలను ప్రభావితం చేస్తుంటాయి. ఆ ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలే ఎనర్జీ. అంటే పైన హోలోగ్రామ్‌లో చెప్పినట్లు విశ్వం మొత్తం యొక్క సమాచారం ఓ 2-డీ హోలోగ్రామ్‌లో ఎన్కోడ్ చెయ్యబడి ఉంటే, ఆయా వస్తువులు, మనుషులు, జీవుల వైబ్రేషన్‌ని బట్టి అవి ఒకదానితో మరొకటి ఇంటరాక్ట్ అవుతూ, ఒకే రకమైన ఎనర్జీ విశ్వంలో ఎక్కడ ఉన్నా కనెక్ట్ చెయ్యబడుతూ, భిన్నమైన ఎనర్జీలు డిస్కనెక్ట్ అవుతూ అవన్నీ కలిసి ఓ సంఘటన, ఓ సమస్య, ఓ సంతోషం, ఓ కొత్త వస్తువు రూపంలో సృష్టి, ఓ ఎనర్జీ మరో ఎనర్జీగా మార్పిడి చెందడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
“సృష్టిలో ప్రతీదీ ఎనర్జీ రూపంలో ఉంటుంది.. ఒక మనిషిని గానీ, జీవిని గానీ, వస్తువును గానీ మనం కళ్ల ద్వారా వాటి భౌతిక రూపంలో చూస్తుంటాం గానీ వాటిలో ఉండేది ఎనర్జీ అన్న విషయం అర్థమైతే లైఫ్‌ని మనం చూసే దృష్టి మారిపోతుంది” అని గతంలో చాలాసార్లు నేను రాసిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.
“మరి కళ్లకు కన్పించేది అబద్ధమా, చేతితో టచ్ చేస్తే తగిలే ఓ మనిషి భౌతిక రూపం అబద్ధమా.. కళ్లెదుట ఇవన్నీ ఫిజికల్‌గా కన్పిస్తుంటే ప్రపంచం అంతా కేవలం ఎనర్జీ మాత్రమే అని ఎలా నమ్మమంటారు” అని చాలామందికి సందేహం వస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది అర్థం కాకపోతే ఒకటికి పదిసార్లు చదవండి. ఈ సీక్రెట్స్ అర్థమైతే మాత్రం విశ్వంలో ఉన్న ఎనర్జీతో హార్మొనీలో జీవితాన్ని లీడ్ చేస్తూ చాలా ప్రశాంతతని పొందొచ్చు, అనుకున్న విషయాలు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు, ఇంకా లైఫ్ అనేది ఏటికి ఎదురీదినట్లు కాకుండా లైఫ్ ఎనర్జీకి సరిసమానంగా మన ఆలోచనలు సాగుతూ సులభతరం అవుతుంది.
మొదట ఒక విషయం చెబుతాను. అది చిమ్మ చీకటి అనుకోండి. కనుచూపు మేర ఎక్కడా చిన్న లైట్ కూడా లేదు అనుకోండి. చంద్రుడు నుండి కాంతి కూడా లేని అమావాస్య అనుకోండి. అప్పుడు మీ ఎదురుగా ఉన్న మనిషి మీ కళ్లకి కన్పిస్తారా? కళ్లు పొడుచుకుని చూసినా కన్పించరు కదా! దూరంగా ఉన్న వస్తువులు, బిల్డింగులు కన్పిస్తాయా? అస్సలు కన్పించవు కదా!
మరి చీకట్లో ఏదీ కన్పించనప్పుడు.. మన కళ్లకి ఏదైనా కన్పించేలా చేస్తున్న మీడియం ఏంటి? “వెలుతురు” కదా! మనం ఇంట్లో వేసుకునే లైట్ కావచ్చు.. మన భూమికి కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సూర్యుడు, చంద్రుడు భూమి మీదకు ప్రసరింపజేసే వెలుతురు కావచ్చు, మన ఆకారంపై రిఫ్లెక్ట్ అయి బౌన్స్ అయితే ఆ బౌన్స్ అయిన కాంతిని ఎదుటి వ్యక్తి అతని కళ్లతో చూసినప్పుడు మాత్రమే మన రూపం వారికి షేప్లతో సహా అర్థమవుతుంది. అంటే వారు చూస్తున్నది మన నిజమైన ఫిజికల్ రూపాన్నా లేక బౌన్స్ అయిన కాంతి అనే ఓ ఊహాజనితమైన, కళ్లు మాత్రమే ఆప్టిక్ నెర్వ్ ద్వారా చూడగలిగే ఓ నీడనా అంటే నిస్సందేహంగా అందరూ చూసేది అంతా కాంతి ద్వారా ఏర్పడే ఓ నీడనే! కాంతి అనే ఎనర్జీ మీడియం లేకపోతే కళ్లు అనే జ్ఞానేంద్రియాలు ఇప్పుడు దేన్నీ చూడలేనప్పుడు మెటీరియలిస్టిక్ ప్రపంచంలో మనకు త్రీ-డీలో కళ్లకి కన్పిస్తున్న రూపాలు మొదట భ్రాంతి మాత్రమే అన్నది మొదట గ్రహించండి. ఇక్కడ “ఆ మనిషి రూపాన్ని టచ్ చేస్తే మనకు స్పర్శ తెలుస్తోంది కదా” అనే సందేహం చాలామందికి వెంటనే వస్తుంది. అదీ తర్వాత చెబుతాను, మొదట “కళ్లు చీకట్లో చూడలేనిది వెలుగులో చూస్తున్నాయంటే వెలుగు అనే ఎనర్జీ మీడియం లేకపోతే ఈ త్రీడీ ప్రపంచంలో ఏదీ లేనట్లే కదా!” అన్న విషయం గ్రహించండి చాలు.
ఇప్పుడు ఏం అర్థమైంది? జ్ఞానేంద్రియాలలో ఒకటైన కళ్లు లేని దాన్ని ఉన్నట్లు ఓ కాంతి అనే అదనపు ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే భావించగలుగుతున్నాయన్నమాట.. అంతే కదా!
ఇక రెండో జ్ఞానేంద్రియం దగ్గరకు వద్దాం. అది స్పర్శ! మీరు నా దగ్గరకు వచ్చి నన్ను టచ్ చేస్తే “నా స్కిన్, నా భౌతిక రూపం స్పర్శకు తెలుస్తున్నాయి కదా! అలాగే స్మార్ట్‌ఫోన్ పట్టుకుంటే అది చేతికి తెలుస్తోంది కదా.. ఇవన్నీ ఎలా ఎనర్జీ అనుకోమంటారు” అనే డౌట్ చూద్దాం.
క్వాంటమ్ ఫిజిక్స్ 1920 తర్వాత అందుబాటులోకి వచ్చాక అనేక పరిశోధనలు జరిగాయి. మనిషి గానీ, పక్షి గానీ, ఇతర జంతువులు గానీ, మొక్కలు గానీ, రాళ్లు గానీ, వస్తువులు గానీ, చివరకు మన ఆలోచనలు గానీ ప్రతీ దానిలో అంతర్లీనంగా ఉన్నదంతా ఎనర్జీ అన్నది ఆధారాలతో సహా నిరూపించబడింది. ఇప్పుడు మనిషి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనిషినే చూద్దాం. మీరు నన్ను టచ్ చేస్తే నా భౌతిక రూపం అర్థమవుతున్నప్పుడు అది ఎనర్జీ అని ఎలా నమ్మాలి అనే డౌట్ మీకు వస్తోంది కదా! చెబుతాను.
మనిషి శరీరంలో రకరకాల ప్రదేశాల్లో జెనెటిక్ ఎక్స్ప్రెషన్ ద్వారా ప్రొటీన్ ఉత్పత్తి చేయబడి గుండె, లివర్, కిడ్నీ, చర్మం, మెదడులోని గ్రే మేటర్, వైట్ మేటర్ వంటి మాస్, కండరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ప్రొటీన్‌ని ఎవరు ఉత్పత్తి చేస్తారు అంటే ఆయా ప్రదేశాల్లో ఉండే సెల్స్ (అంటే కణాలు). ప్రతీ కణాన్ని శక్తివంతమైన మైక్రోస్కోప్‌ల ద్వారా చూస్తే వాటిలో మాలిక్యూల్స్, ఆటమ్స్, సబ్‌అటామిక్ పార్టికల్స్ నిక్షిప్తమై ఉంటాయి. అంటే మనం లివర్‌నే ఉదాహరణగా తీసుకుందాం. ఎవరైనా డాక్టర్ ఆపరేషన్ చేస్తే లోపల కన్పించే లివర్ అనే భౌతిక రూపాన్ని సూక్ష్మస్థాయిలో విభజించుకుంటూ వెళితే చివరకు మిగిలేది ఆటమ్, సబ్ అటామిక్ పార్టికల్! ఈ ఆటమ్‌లో పరిశీలించగా 70 శాతం వృధాగానూ, 30 శాతం పాజిటివ్, నెగిటివ్ ఛార్జ్ కలిగిన ఎనర్జీ నిక్షిప్తమై ఉన్నట్లు నిరూపితమైంది.
లివర్, స్కిన్, కిడ్నీ వంటి అవయువాలను అతి సూక్ష్మ స్థాయిలోకి వెళ్లాక ఆ 30 శాతం ఎలక్ట్రిసిటీ రూపంలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో.. ఆ ఆటమ్ నిరంతరం బయట మన ఆలోచనలకు తగ్గట్లు మారే సెల్ ఇన్ఫర్మేషన్, సెల్ మెంబ్రేన్ ద్వారా కణం లోపలికి చేరే ఆ సమాచారాన్ని బట్టి ఆ ఆటమ్లోని ఎనర్జీ ప్రభావితం అవుతూ, అది వేగంగా తిరుగుతూ 70 శాతం ఖాళీగా ఉన్నది కాస్తా ఓ త్రీ-డీ రూపాన్ని ఏర్పరిచి లేని దాన్ని ఉన్నట్లుగా చేస్తుంది.
చిన్న ఉదాహరణ చెబుతాను. ఓ టేబుల్ ఫ్యాన్ తీసుకోండి. ఫ్యాన్ వెయ్యక ముందు ఆ రెక్కలకు మధ్య మీరు చేయి పెట్టగలరు కదా! ఫ్యాన్ వేశాక ఆ ఫ్యాన్ తిరిగే వేగాన్ని బట్టి రెక్కలన్నీ వేగంగా తిరుగుతూ చేయి పెట్టడానికి ఖాళీ లేనట్లు, ఒకవేళ పెడితే ఖాళీ ప్రదేశం లేకుండా వేలు కట్ అవడం జరుగుతుంది కదా! సరిగ్గా ఇలాగే ఓ కణంలోని ఆటమ్స్ వేగంగా తిరుగుతూ లేని రూపాన్ని ఏర్పరుస్తాయి. అలాంటి కోట్ల ఆటమ్స్ ద్వారా ఓ సెల్ భౌతికంగా ఏర్పడి.. అలాంటి సెల్స్ ద్వారా టిష్యూస్, ఆర్గాన్లు, చివరకు మనం చూస్తే భౌతిక రూపం ఏర్పడతాయి.
అంటే ఇక్కడ ఎనర్జీ అనేది అంత వేగంగా తిరగకపోతే అక్కడ ఉన్నది ఏంటి? ఖాళీ స్థలమే కదా! అంటే మన శరీరం ఉంది అనే భౌతిక రూపాన్ని ఇస్తోంది ఎవరు? ఎనర్జీనే కదా.. వేగంగా తిరగడం ద్వారా! సో ఇదీ సంగతి. మనం ఎవర్నయినా టచ్ చేస్తే మన స్పర్శకు తెలిసే వారి భౌతిక రూపం, మనం సెల్‌ఫోన్ పట్టుకుంటే అది స్పర్శకు తెలియడం వెనుక ఎనర్జీ మాత్రమే ఓ రూపంగా ఓ భ్రాంతిగా ఏర్పడి ఉంది.
కళ్లు చూశాం. స్పర్శ చూశాం. ఈ రెండూ భ్రాంతే అని అర్థమైంది కదా! ఇక చెవులు అనే జ్ఞానేంద్రియానికి వద్దాం. కంఠం ద్వారా ఉత్పత్తి అయ్యే శబ్ధం, వివిధ వస్తువుల రాపిడి వల్ల ఏర్పడే ఎనర్జీ ఫ్రిక్షన్ వంటివన్నీ తమ ఎనర్జీ రూపాన్ని మార్చుకుని శబ్ధంగా మారి తరంగాలుగా మన చెవులకి విన్పిస్తూ ఉంటాయి. ఆ శబ్ధాన్ని విని బ్రెయిన్లోని ఆడిటరీ న్యూరాన్లకి చేరవేసి అది డీకోడ్ చెయ్యబడితేనే మనకు అది ఏ శబ్ధమో అర్థమవుతుంది. ఒకవేళ ఎనర్జీతో తయారైన ఆ న్యూరాన్లు ఎనర్జీని కోల్పోతే, ఆడిటరీ నెర్వ్ బలహీనపడితే ఎనర్జీ రూపంలో ఉన్న ఆ తరంగాలు చెవులకి చేరినా మనకు ఏదీ వినిపించదు కదా!
అంతెందుకు.. ఓ మైక్రోఫోన్‌ని తీసుకుందాం. మీరు మాట్లాడే మాటల్ని అది ఎలా రికార్డ్ చేస్తుంటుందో తెలుసా? మీరు మాట్లాడే కొద్దీ మీ శరీరం అనే ఎనర్జీ సెంటర్ ద్వారా ఉత్పత్తి అయిన శబ్ధాన్ని ఆ మైక్రోఫోన్‌లోని కండెన్సర్ వైబ్రేట్ అవుతూ స్వీకరించి దాన్ని ఎలక్ట్రిక్ ఇంపల్సెస్గా మార్చి ఆ సమాచారం మళ్లీ కాంతి అనే ఎనర్జీ రూపంలో మీ USB కేబుల్ ద్వారా ప్రయాణించి సాఫ్ట్వేర్ ద్వారా వేవ్ఫార్మ్గా తయారవుతుంది!
సో ఇలా సృష్టిలో ఉన్నది ఎనర్జీ మాత్రమే. మనం కళ్లతో చూసేదీ, వినేదీ, స్పర్శతో గ్రహించేదీ అంతా భౌతిక రూపం కాదు.. అంతర్లీనంగా ఉన్న ఎనర్జీ.
ఇప్పుడు మరో ఆర్టికల్లోకి వెళ్లబోయే ముందు అసలు విషయం చెబుతాను. మనం నిరంతరం ఆలోచనల్లో కలిగి ఉండే నెగిటివ్, పాజిటివ్ ఎనర్జీ అంతా మన కణాలు మొదలుకుని చుట్టూ ఉండే విశ్వంలోని ప్రతీ ఎనర్జీని ప్రభావితం చేస్తుంది. ఎనర్జీ అంతరించిపోదు… అది రూపాలు మార్చుకుంటుంది.. కొలిమిలో కాలిస్తే బంగారం ఎలా పాలిష్ అవుతుందో మన ఆలోచనలతో దేన్నయినా కొత్త ఎనర్జీ రూపంలోకి మార్చుకోవచ్చు. ఆత్మీయులను సృష్టించుకోవచ్చు.. యూనివర్శ్‌కి మన వైబ్రేషన్ తెలియజేసి దేన్నయినా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు.
అందుకే మనుషుల్ని విశ్వాన్నీ వాటి భౌతిక రూపంగా చూడడం ఆపేసి వారిని ఎనర్జీ రూపాలుగా భావించడం మొదలుపెట్టండి.. దీంతో పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ సులభంగా అర్థమవుతాయి. మాటలతో మనుషుల్ని జడ్జ్ చెయ్యడం లేదా దగ్గరకు చేరడం దూరంగా జరగడం కాకుండా వారి వైబ్స్‌ని బట్టి సహజసిద్ధంగా మన ప్రవర్తనని మార్చుకోవచ్చు.
కృష్ణ భగవానుడు పై శ్లోకంలో చెప్పినట్లు ప్రతీదీ ఎనర్జీ అన్న ఎరుక ఉంటే నువ్వు వేరు, నేను వేరు అనే భావన పోయి అందరిలో, అన్నింటిలో దైవత్వం చూసే ఏకత్వ భావన వస్తుంది. సరిగ్గా ఈ భావన కొద్దీనే తాము తాగే నీరు చూడడానికి అశుద్ధంగా ఉన్నా అందులో ఉన్న ఎనర్జీని తమ సాధన కొద్దీ పొందిన వైబ్రేషనల్ శక్తితో మార్పిడి చేసుకుని నాణ్యమైన నీటిని, ఆహారాన్నీ సేవించగలుగుతూ ఉంటారు తపో సంపన్నులు. అర్థం చేసుకోవాలే గానీ విశ్వమే ఓ అద్భుతం.
ఒక మనిషి, జంతువు, వస్తువు యొక్క ఎనర్జీ ఎక్స్‌ప్రెషన్‌ని బట్టి అది విశ్వం అనే 2-డి హోలోగ్రామ్‌లో కలిగి ఉండే ఇన్ఫర్మేషన్ మారుతుంది. దాన్ని చూసే వ్యక్తి యాంగిల్ (దృక్పధాన్ని) బట్టి అది ఒక్కొకరికి ఒక్కోలా కనిపిస్తుంది.
– Sridhar Nallamothu