ఉనికిని దాచుకుని అజ్ఞాతంగా బ్రతికేవారు మనకు తరచూ తారసపడుతుంటారు. వాస్తవానికి మన మొహానికి ఎలాంటి ముసుగూ వేసుకోవలసిన పనిలేదు. అయినా ముసుగు వేసుకోజూస్తున్నామంటే మనలో సమాజం పట్లనో, మనుషుల పట్లనో, మనకు ఎదురవుతున్న పరిస్థితుల పట్లనో ప్రత్యక్షంగా ప్రకటింపజేసుకోలేని అకారణమైన ద్వేషం అలుముకుని ఉన్నట్లు గ్రహించాలి. ముసుగులు ధరించుకోవడానికి ఇంటర్నెట్ లాంటి ఊహాజనిత ప్రపంచం ఎల్లలు లేని స్వేచ్ఛని కల్పించడంతో ఛాట్ రూములూ, డిస్కషన్ బోర్డులూ, బ్లాగులూ, సోషల్ నెట్ వర్కింగ్ సైట్లూ.. ఎక్కడ చూసినా వాస్తవ రూపమేమిటో తెలియని నీలి నీడల జాడలే కన్పిస్తున్నాయి.
మనిషి మనస్సు నిర్మలంగా ఉన్నంతకాలం ఎలాంటి ముసుగులూ అవసరం లేదు. ఏ ఈర్షాసూయో, మరే అసంతృప్తో నేరుగా వ్యక్తపరచి చులకన కాలేని భయం వెంటాడినప్పుడే అజ్ఞాతంలోకి వెళ్లిపోయి పంజా విప్పుతుంటారు. ఇక్కడ అన్నింటికన్నా ప్రధానంగా దృష్టి పెట్టవలసిన విషయం.. తమ అక్కసుని వెళ్లగక్కేశామని అజ్ఞాతంగా బ్రతికేవారు క్షణకాలం ఊపిరి పీల్చుకుంటారు కానీ స్థిమితపడనివ్వని అపరాధభావం మరుక్షణం వెంటాడడం మొదలెడుతుంది. ఎక్కడో కొందరు ఆ అపరాధ భావాల సున్నితత్వమూ పోగొట్టుకుని రాళ్లలా బ్రతుకుతుంటారనుకోండి. విశ్లేషించి చూస్తే అలా ఓ గాయాన్ని చేసి నిమ్మళంగా ఉండగలగడం మానసికంగా మనం కోలుకోలేని పతనావస్థకు చేరుకున్నామనడానికి నిదర్శనం.
ప్రతీ మనిషీ సమాజంలో ఓ ముద్రని నిలుపుకుంటూ జీవితాన్ని కొనసాగించ ప్రయత్నిస్తుంటారు. ఆ ముద్రకి విభిన్నమైన ఆలోచనలు ప్రతీ మనిషిలోనూ ఎప్పుడోసారి పొడచూపుతూనే ఉంటాయి. వాటిని ఉన్నవి ఉన్నట్లుగా వ్యక్తపరిస్తే తమపై ఉన్న మంచి ముద్ర ఎక్కడ తుడిచిపెట్టుకుపోతుందోనన్న సంశయంతో.. "అజ్ఞాతంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది?" అనే ఆలోచన క్షణకాలం తళుక్కుమంటుంది. ఆ ఆలోచనని ఎంత త్వరగా తుంచేస్తే అంత మంచిది. లేదంటే అది మనల్ని కలుషితం చేయడంతో పాటు మనచేత మనసుకి నచ్చని బుద్ధి మాత్రమే ప్రేరేపించే పైత్యపు ఛేష్టలను ఎన్నింటినో చేయిస్తుంటుంది. దీంతో మనిషిగా అధఃపాతాళానికి కూరుకుపోతాం.
హాయిగా దర్జాగా మనసుని ప్రతీ క్షణం నిర్మలంగా ఉంచుకుంటూ మన నిజమైన ఉనికిని ప్రతీచోటా వ్యక్తపరుస్తూ బ్రతకడం ఎంత సుఖమో కదా! ఇలా బ్రతకాలంటే చిన్న సూత్రం అలవర్చుకుంటే చాలు.. "ఎవరి జీవితం వారిది, ఇతరుల్ని వేలెత్తి చూపే హక్కు మనకు లేదు, అలాగే ప్రపంచం వైపు చూస్తూ మొరగడం వృధా ప్రయాసే, మన పనేదో మనం చిత్తశుద్ధిగా చేసుకుంటూ అందులో ఆనందాన్ని వెదుక్కుంటూ పోతే నెగిటివ్ వైబ్రేషన్స్ మనకు దరిచేరవు" అన్న ప్రజ్ఞని సంతరించుకుంటే సరిపోతుంది. ఇక ఎవరూ ఎక్కడా అజ్ఞాతంగా ఉండడానికి ఇష్టపడరు. ఎక్కడైనా దర్జాగా ఉనికిని చాటుకోగలుగుతారు.
– నల్లమోతు శ్రీధర్
“హాయిగా దర్జాగా మనసుని ప్రతీ క్షణం నిర్మలంగా ఉంచుకుంటూ మన నిజమైన ఉనికిని ప్రతీచోటా వ్యక్తపరుస్తూ బ్రతకడం ఎంత సుఖమో కదా”
Well Said Sreedhar gaaroo.
చాలా చక్కగా చెప్పారండి!
శివరామప్రసాద్ కప్పగంతు గారు.. 🙂 ధన్యవాదాలండీ.
పద్మార్పిత గారు నమస్కారం, ధన్యవాదాలండీ.
చాలా బాగా చెప్పారు…. దీనిని నా ఫేస్ బుక్ లో పోస్టు చేసుకుంటాను…శ్రీధర్ గారు…