చాలామంది భావించినట్లు మన శరీరంలోని ఎనర్జీ సెంటర్స్ అయిన చక్రాస్ గురించి తెలుసుకోవడం రాకెట్ సైన్స్ ఏమీ కాదు. కొద్దిగా శ్రద్ధ పెడితే చాలా సులభంగా అర్థమయ్యే విషయం ఇది. అందుకే మీకు అర్థమయ్యేలా వివరిస్తాను.
“ఈ క్షణం మీ ఆలోచన ఏ విషయాల మీద ఉంది” అన్న దాన్ని బట్టి మీ శరీరంలోని సంబంధిత మూలాధార చక్ర గానీ, స్వాధిష్టాన చక్ర గానీ, మణిపూరక గానీ, అనాహత గానీ.. ఇలా వివిధ ప్రదేశాల్లో ఎనర్జీ ప్రభావితమవుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన మనసులో ఉన్నది బయటకి స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోతే, అతని విశుద్ధ చక్ర (థ్రోట్ చక్ర)లో ఎనర్జీ బ్లాక్ ఉన్నది అన్నది అర్థం చేసుకోవాలి. లేదా మరో విషయం జరుగుతుంది.. తన ఎక్స్‌ప్రెషన్‌ని నియంత్రించుకోవడం ద్వారా అతను థ్రోట్ చక్రలో ఎనర్జీ బ్లాక్ ఏర్పరుచుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలి.
“విశ్వమనేదే లేదు.. విశ్వమంతా ఒకటి అనేది ఏంటి.. అసలు దానికి లాజిక్ ఏమైనా ఉందా” అని భావించే వ్యక్తికి 7వ చక్ర అయిన సహస్రార చక్రలో ఎనర్జీ బ్లాక్ అవుతుంది. అతను నిరంతరం ఇంద్రియాల ద్వారా కనిపించే విషయాలు మాత్రమే నమ్ముతూ ఉంటాడు. ఇంద్రియాల ఆవల కళ్లకు కన్పించని, చెవులకు విన్పించని విషయాల పట్ల నమ్మకం ఉండదు, దాంతో యూనివర్శ్‌తో కనెక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చెయ్యడు కాబట్టి ఆ ఎనర్జీ బ్యాలెన్స్‌లో ఉండదు.
శరీరంలోని ప్రతీ చక్రకి భౌతికంగా కనిపించే కొన్ని అవయవాలు, వాటికి సంబంధించిన టిష్యూలు, రసాయనాలు, హార్మోన్లు, నెర్వస్ టిష్యూ లాంటివి అనుసంధానించబడి ఉంటాయి. ఉదాహరణకి ఎవరికైనా సెక్స్ భావనలు కలిగిన వెంటనే శరీరంలోని రూట్ చక్రలో (మూలాధార చక్ర) ఎక్కువ ఎనర్జీ కేంద్రీకృతమవుతుంది. తర్వాత విషయం అర్థం చేసుకో పోయేముందు మీరు ఓ కొత్త విషయం తెలుసుకోవాలి. మనం భావించినట్లు కేవలం మనస్సు (మైండ్) అనేది ఒక్కటే ఉండదు. శరీరంలోని వివిధ ప్రాంతాల్లో సంబంధిత నాడీ వ్యవస్థలకు సంబంధించిన ఆదేశాలు స్వీకరిస్తూ కొన్ని చిన్న చిన్న మైండ్స్ ఉంటాయి. అవి ఆయా ఆర్గాన్లని ప్రభావితం చేస్తుంటాయి. మన సబ్ కాన్షియస్ మైండ్‌లో కలిగే ఆలోచనలను బట్టి ఆ చిన్న చిన్న మైండ్స్ అటానమిక్ నెర్వస్ సిస్టమ్ ద్వారా మన ప్రమేయం లేకుండానే ప్రభావితం చెందుతూ ఉంటాయి.
మళ్ళీ అసలు విషయానికి వద్దాం. మన మైండ్‌లో సెక్స్ కోరికలు కలిగిన వెంటనే, బ్రెయిన్లో ఉండే పిట్యుటరీ గ్లాండ్ ద్వారా కొన్ని ఆదేశాలు అటానమిక్ నెర్వస్ సిస్టమ్ ద్వారా రూట్ చక్రలో ఉండే మినీ మైండ్‌కి చేరుకుని, ఆ మినీ మైండ్ సంభోగం చెయ్యడానికి అనువుగా ఉండే విధంగా గ్రంధుల ద్వారా రసాయనాలను, హార్మోన్లని శరీరం ఉత్పత్తి చేస్తుంది. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అయిన జననాంగాలు యాక్టివేట్ చెయ్యబడతాయి. దాంతో శరీరం మొత్తం మనిషి మానసిక స్థితి పూర్తిగా సెక్స్ కోసం పరితపించే విధంగా కెమికల్స్ విడుదలవుతాయి. రూట్ చక్ర సృజనాత్మకతను (అంటే క్రియేటివిటీ) కూడా సంబంధించినది. రూట్ చక్ర బ్యాలెన్స్‌గా లేని వారు క్రియేటివ్ రంగాల్లో రాణించలేరు. క్రియేటివిటీ ద్వారానే సృష్టి సాధ్యపడుతుంది అన్న విషయం తెలుసు కదా! ఉదా.కి అందరికీ అర్థమయ్యేలా రాసే సృజనాత్మకత నాకు లేకపోతే ఈ ఆర్టికల్ అనే సృష్టి జరగదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సంభోగ సమయంలో మగా, ఆడకి రూట్ చక్రలో పెద్ద మొత్తంలో ఎనర్జీ పోగుపడుతుంది కాబట్టి మగవాళ్లలో వీర్యమూ, ఆడవాళ్లలో ఎగ్ రిలీజ్ అనేవి ఈ రూట్ చక్ర ఎనర్జీ కారణంగానే ఓ సృష్టి చేయగలిగినంత శక్తివంతంగా ఎనర్జీ పోగుపడి పిండాన్ని సృష్టి చెయ్యడానికి కావలసిన ఏర్పాట్లు జరుగుతాయి. “నేను జీవితంలో సురక్షితంగా ఉన్నాను” అనే సంతృప్తి కలిగి ఉన్న వారికి కూడా రూట్ చక్ర ఎనర్జీ బ్యాలెన్స్‌లో ఉంటుంది. ఎవరైనా నాకేమీ లేదు అనే భావనలో ఉంటారో వారికి రూట్ చక్ర ఎనర్జీలో బ్లాక్ ఉన్నట్లు లెక్క. రూట్ చక్ర ప్రధానంగా సెక్స్ ఆర్గాన్లకి, పెరీనియం, పెల్విక్, ప్రోస్టేట్, బ్లాడర్, లోయర్ బౌల్, యానస్ ప్రదేశాలకు సంబంధించినది. లోయర్ బౌల్ మూమెంట్స్ తక్కువగా ఉండి కాన్టిసిపేషన్తో బాధపడే వారు కూడా ఈ చక్ర ఎనర్జీ సరిగా లేదని అర్థం చేసుకోవాలి. ఇలాంటివేమీ మన యోగా క్లాసెస్‌లో చెప్పరు. ప్రతీ ఎనర్జీ సెంటర్ వెనుక అనేక రహస్యాలు ఉన్నాయి.
రూట్ చక్ర పైన ఉండే రెండో చక్ర స్వాధిష్టాన చక్ర అంటారు. ఇది మన శరీరంలోని నాభికి అతి కొద్దిగా క్రింది భాగంలో ఉంటుంది. ఇది ఓవరీస్ని, యుటరస్, కోలన్, పాంక్రియాస్, లోయర్ బ్యాక్‌లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడం, వృధాని సపరేట్ చెయ్యడం, ఆహారాన్ని ఎనర్జీ గా మార్చే మెటబాలిక్ క్రియలకు సంబంధించినది. జీర్ణం సక్రమంగా కావడానికి కావలసిన డైజెస్టివ్ ఎంజైమ్స్, ద్రావకాలకు కూడా ఈ ఎనర్జీ సెంటర్లో ఉండే ఎనర్జీ కారణం అవుతుంది. మానసిక స్థాయిలో చూస్తే.. మనుషులతో కలవడం, ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు కలిగి ఉండటం, ఇతరులకు సపోర్ట్‌గా నిలవడం వంటివి ఈ స్వాధిష్టాన చక్ర ఎనర్జీని బట్టి ఆధారపడి ఉంటాయి. ఎవరితో కలవలేని వారు, ఇతరులు తమని జడ్జ్ చేస్తారేమోనని ముభావంగా ఉండే వారు ఈ స్వాధిష్టాన చక్రలో ఎనర్జీని బ్లాక్ చేసుకుంటూ ఉన్నట్లు లెక్క.
మరింత వివరంగా మరో ఆర్టికల్ లో రాస్తాను. నిన్నటి ఆర్టికల్‌లో చెప్పినట్లే దీనిని ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. కానీ ఒక రచయితన తన అనుభవసారాన్ని కష్టపడి రాసినప్పుడు అతని పేరు ఉంచి షేర్ చేసే సంస్కారం మాత్రం కలిగి ఉండండి. ఇతరుల విషయాలను చోరీ చెయ్యడం రూట్ చక్ర ఎనర్జీ బ్లాక్ క్రిందకు వస్తుంది.
- Sridhar Nallamothu