చేతి నిండా డబ్బుండీ.. చూడాల్సిన వయస్సెంతో ఉండీ.. ఏ ఆసక్తీ లేని శూన్యత ఆవరించుకున్న తరాన్ని ఎప్పుడైనా ఊహించారా? మల్టీనేషనల్ కంపెనీల్లో లక్షల ప్యాకేజీల్లో పనిచేస్తున్న యువతరం 30 ఏళ్లు నిండకుండానే అనుభవించాల్సిన విలాసాలన్నీ అనుభవించేసి కార్లూ, బంగ్లాలూ, పబ్బులూ, ఫ్రెండ్స్ వేటిల్లోనూ కిక్ కన్పించక నిస్పృహకు లోనవుతున్న ఉదంతాలు నావరకూ నేను చాలానే చూశాను.
"జీవితం అంటే గెలవడమే" అన్న లక్ష్యం నరనరానా ఇంకిపోయిన పెంపకాలు మనవి. "నువ్వేమైనా చెయ్యి.. డబ్బు మాత్రం బాగా సంపాదించు.. మనాళ్లందరిలో గర్వంగా చెప్పుకునేలా పేరు తెచ్చుకో చాలు" అని చిన్నప్పటి నుండి బ్రెయిన్ వాష్ లు చేయబడ్డ నేపధ్యం మనది. పెద్దలదీ, పిల్లలదీ డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యం కావడంతో అస్సలు సమాజాన్ని గమనించే తీరుబడీ ఎవరికీ దొరక్కుండా పోయింది. చెడ్డీతో బళ్లోకి అడుగుపెట్టిన క్షణం నుండి మరో చెడ్డీగాడికి తండ్రయ్యే వరకూ చేతులారా సంపాదించే యావే. అప్పటికి అలుపొచ్చేసినా.. మళ్లీ ఆ పుట్టిన నలుసు కోసం గానుగెద్దులా వెనుకేయక తప్పదు.
ఇంత ఇరుకైన ప్రపంచంలో మనస్సుకు స్వాంతనే కరువవుతోంది. ఒకప్పుడు 50-60 ఏళ్ల వయస్సు వాళ్లకూ కొద్దో గొప్పో మనవళ్లతో ఆడుకోవాలనీ సరదాలూ, ఓపికలూ ఉండేవి. ఇప్పుడు కడుపు నిండా తినడానికీ, కంటి నిండా నిద్రపోవడానికి కూడా దిక్కే లేదు. దీంతో అలసిన మనస్సూ, తనువూ.. ఎవరెస్ట్ శిఖరాన నిలబడి శూన్యంలోకి చూసే దృష్టీ జీవితం పట్ల వైరాగ్యాన్నే పెంచేస్తున్నాయి తప్ప ఎలాంటి ఆశల్నీ చిగురించలేకపోతున్నాయి.
మన జీవితం ప్రపంచంతో పెనవేసుకుపోయినప్పుడు ప్రతీ క్షణం వినూత్నంగానే ఉంటూ ఉండేది. కానీ ఇప్పుడు మనం ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకుంటున్నాం. యావత్ ప్రపంచాన్ని వెనక్కి నెట్టేసి మనం ఒక్కళ్లమే ఆకాశమంత ఎత్తులో నిలబడి మిగతా ప్రపంచాన్ని ఊరించాలనుకుంటున్నాం. కానీ పాపం.. అప్పటికే ప్రపంచం మనల్ని వెలివేసి ఒంటరిని చేసేసి పోయిందన్న గ్రహింపు కూడా దక్కడం లేదు. బంధువులూ, స్నేహితులూ, పెద్దమ్మలూ, పెదనాన్నలూ, అన్నలూ, చెల్లెళ్లూ.. అర్థరాత్రయినా తెగని కబుర్ల ప్రవాహమూ ఇవన్నీ ఎక్కడికెళ్లిపోయాయో గుర్తుతెచ్చుకోండి? సెల్ ఫోన్లూ, లాప్ టాప్ లూ, ఫేస్ బుక్కులే ఇప్పుడు మనదైన ప్రపంచం. నిజంగా మన వాళ్లెవరినైనా నేరుగా కలిస్తే నాలుగు ముక్కలు నవ్వుకుంటూ మాట్లాడుకోగలిగే కలివిడీ కోల్పోయాం ఎప్పుడో! ఎంత త్వరగా ఎదుట నిలబడ్డ మనిషిని తప్పించుకుని ఏ సెల్ ఫోన్ లాంటి యంత్రాన్నో, కంప్యూటర్ లాంటి భూతాన్నో కరుచుకుపోవాలన్న తాపత్రయం.
మన జీవితాల్లో ఇన్ని మార్పులు వచ్చాయి కాబట్టే నిజమైన జీవితాన్నీ, నిజమైన మనుషుల్నీ, ప్రకృతినీ ఆస్వాదించలేకపోతున్నాం. 30 ఏళ్లకే జీవితమంటే మొహమెత్తుతోంది. 60-70 ఏళ్ల వయస్సు వచ్చినా మన కళ్లల్లో వెలుగు మాయమవ్వదని మనకు ఏ కోశానైనా నమ్మకముందా? పాతతరాన్ని ఎప్పుడైనా కదిలించి చూడండి.. వాళ్లల్లో వయస్సు మీద పడినా, కాలూ చేయీ ఆడకున్నా.. చాలా రోజుల తర్వాత మనం కన్పిస్తే "ఎలా ఉన్నావయ్యా.. తినట్లేదా ఏమిటి బాగా చిక్కిపోయావు" అంటూ ఉత్సాహంగా పలకరిస్తుంటారు. కనీసం ఆ మాత్రమైనా మనం ఇంత చిన్న వయస్సుల్లో ఎవర్నైనా పలకరించగలుగుతున్నామా?
ఆ మాత్రం ఉత్సాహం మిగిలి లేనప్పుడు జీవితం నిస్సారంగా కాక మరెలా ఉంటుంది? డబ్బు యావని పక్కనబెట్టి జీవితం పట్ల ఇతర ఆశల్ని చిగురింపజేసుకోవలసిందీ మనమే, ప్రతీ క్షణాన్నీ ఆస్వాదించడానికి మార్గాలు అన్వేషించవలసిందీ మనమే.
chala bagundhi,everyone must read this artical,keep sharing sridher garu,
Regards:
Your Raghuram.
it’s a bitter truth….. one is loosing self respect on themselves……. be strong in maintaining relations through affection, not through electronic goods…