ఓ వాస్తవాన్ని సాధించి చూపించడం కన్నా ఓ భ్రమని ఉత్పత్తి చెయ్యడం చాలా సులభం.
"పేదరికాన్నీ, అవినీతినీ నిర్మూలిస్తాం" అని మనం పుట్టకముందు నుండి మనం పోయిన తర్వాత కూడా రాజకీయ నాయకుల నోళ్ల నుండి అవే స్లోగన్లు విన్పించబడుతున్నా మనం వాటిని నమ్మడం తగ్గిందేమో కానీ తిరస్కరించడం మాత్రం జరగకపోవడానికి కారణం అదే.
అబద్ధాన్నయినా రిపీటెడ్‌గా చెప్పుకుంటూ పోతే అది నిజమైపోతుంది.. తెలీకుండానే
ఎన్నో ఏళ్లుగా స్వంత ఆలోచనలనూ, జీవితాలనూ వదిలేసి.. మీడియా, రాజకీయ నాయకుల గురించి మాత్రమే మాట్లాడుకుంటూ గడుపుతున్న వారు తెలీకుండానే ఓ ఉచ్ఛులో కూరుకుపోయారన్నది కాదనలేని వాస్తవం.
అది ఎలాంటి ఉచ్ఛు అంటే.. కొందరి అబద్ధాలు మనకు నిజమనిపిస్తాయి.. మరికొందరు రాజకీయ నాయకుల, మీడియా వ్యక్తుల అబద్ధాలు మన అపనమ్మకాన్ని బట్టి అబధ్ధాలనిపిస్తాయి.
మనం అనుకునే నిజం ముందు అబద్ధాన్నీ, అబద్ధం ముందు నిజాన్నీ కంపేర్ చేసుకుంటూ, ఖండించుకుంటూ… మనది కాని జీవితాన్ని, మన కోసం కాని ఆలోచనలను మనం చాలా ఏక్టివ్‌గా cultivate చేసుకుంటూ ఉంటాం.
పండుని తొలిచిచూస్తే లోపల డొల్లే మిగులుతుంది.. అలాగే నిజాన్ని తెలుసుకునే లోపు జీవితమే ముగియొచ్చు.. లేదా ఇలాంటి వాటి కోసమా మనం ఇంత సమయం వృధా చేసుకున్నది అన్పించవచ్చు.
"సత్యం" గురించీ, తన గురించీ తెలుసుకోవడానికి జీవితాలను త్యజించిన చరిత్రలు మనకు ఇప్పుడు అవసరం లేదు.. ఇంకా చెప్పాలంటే మన గురించి తెలుసుకోవడం, ఆత్మపరిశీలన చేసుకోవడం అస్సలు రుచించదు. ఎంతసేపూ మన సత్యాన్వేషణలన్నీ లోకాన్ని జల్లెడ పట్టడం వైపే.
లోకం పట్ల మనకున్న క్యూరియాసిటీనీ, మంచో చెడో క్షణాల్లో ఏర్పడే అభిప్రాయాలనూ బలహీనతగా చేసుకునే widespread ఉన్న మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా డైరెక్టర్లు కావచ్చు.. మనల్ని వినోదింపజేస్తున్నారు.. తమ ఆలోచనల్ని మన మీద రుద్దుతున్నారు. మనలో కొంతమందిమి వాటిని ఆస్వాదిస్తున్నాం, కొందరం మొదట తిరస్కరించి.. మన తిరస్కారం ఎక్కడా చెల్లుబాటు కాదని అర్థమయ్యాక ఆ ఆలోచనల్నే బలవంతంగా అంగీకరించేస్తున్నాం.. మొత్తానికి మన జీవితాన్ని మనం జీవించకుండా ప్రతీ ఒక్కరూ చాలా లక్ష్యంబద్ధంగా మనల్ని తమవైన ఆలోచనల్లోకి లాగేసుకుంటున్నారు.
మన ప్రతీ రోజుకీ ఓ మూడ్ ఉంటుంది.. పొద్దున్నే మనం చదివే న్యూస్ పేపర్నో టైటిల్‌ని బట్టి ఆ మూడ్ సెట్ అవుతుంది. ఇవ్వాళ్టి మూడ్.. "రత్నగిరికి తరలిపోతున్న గ్యాస్", రేపు మరొకటి ఉంటుంది. మొత్తానికి మన ఆలోచనలు తెలీకుండానే వేరొకరిచే ట్యూన్ చేయబడుతున్నాయి. లంచ్ టైమ్ లోనో, డిన్నర్ టైమ్ లోనో టివి పెడతాం.. ఆ టాపిక్‌పై స్పెషల్ స్టోరీనో, డిస్కషనో జరుగుతూ ఉంటుంది. ఓ సగటు మనిషిగా ఏ అన్యాయాన్నీ అడ్డుకోలేం అని తెలిసినా.. టివి సెట్ల వైపు చూసి నాలుగు తిట్లు తిట్టుకుని.. అన్యాయాన్ని అడ్డుకున్నట్లు ఫీలై హాయిగా నిద్రపోతాం. ఇక్కడ మాస్‌గా జనాల మూడ్‌ని సెట్ చేయడంలో మీడియా సక్సెస్ అయింది.. ఓ సగటు మనిషిగా ఏది ఎంతవరకూ తీసుకోవాలో.. ఏది మన చేతుల్లో ఉంటుందో తెలుసుకోవడంలో మనం ఫెయిలయ్యాం.
అందుకే మన ఆలోచనలు ఇతరులచే హైజాక్ చెయ్యబడుతున్నాయి. ఇది సోషల్ మీడియాకీ పాకింది. ఎవరో ఏ హీరో గురించో, ఏ సినిమా గురించో, ఏ రాజకీయాల గురించో తిడుతూనో, మంచిగానో పెడతారు. మన అభిప్రాయాలు పుట్టగొడుగుల్లా మొలుచుకుని వస్తాయి. ఎప్పుడెప్పుడు వాలిపోదామా అని రెక్కలు కట్టుకుంటాయి. అవి మనకు అవసరం లేని ఆలోచనలు అని ఫిల్టర్ చేసుకునేటంత ఓపిగ్గా ఉండం. ఏదో ఒకటి వెళ్లగక్కేసి.. నలుగురిలో నారాయణలా మనమూ ఉన్నామన్న అస్థిత్వం మిగుల్చుకోవడమే మన తాపత్రయం.
అందుకే మన బ్రతుకులు అతుకుల బొంతలగానే ఉంటున్నాయి.. మన ఆలోచనలు మనవైపు ప్రసరించకపోవడం చేత! మన మనస్సుల్లో సృష్టించబడే ఆలోచనల్లో కనీసం ఓ 10 శాతమైనా మన గురించినవై ఉంటే మనం ఖచ్చితంగా బాగుపడతాం. లేదంటే హీరో హీరోయిన్ల ఫొటోలూ, రాజకీయ అజెండాలూ, సినిమా కబుర్లూ.. ఇలా మనవి కాని అంశాల గురించి ఉన్న వయస్సునీ, ఓపికనీ కసితీరా వాడేసి.. మన లైఫ్ ఎలా ముగింపుకు చేరిందో అర్థం కాక ముగిసిపోతాం.
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుందని భావిస్తే మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply