"రా అన్నయ్యా…" అంటూ మనిషిని చూడగానే మెరుస్తున్న కళ్లతో ఎఫెక్షన్ కురిపించిన వ్యక్తి శ్రీనివాస్… వయస్సులో నాకంటే చాలా పెద్దే అయినా గొప్ప పిలుపు అది. 15 ఏళ్లకు పైబడిన అటాచ్మెంట్ అతనిదీ నాదీ!
బాపట్ల గడియార స్థంభం దగ్గర రవి పెన్ సెంటర్ అని ఒకటుంటుంది… పెన్లు, కీఛైన్లు, గిఫ్ట్ ఐటెమ్‌లు, బెల్ట్‌లు వంటి రకరకాల వెరైటీ కలెక్షన్‌ని అక్కడి ఇంజనీరింగ్, డిగ్రీ స్టూడెంట్లకు ట్రెండ్‌కి తగ్గట్లు అందించడంలో చాలా టేస్ట్ ఉన్న వ్యక్తి… 🙂
ఫుడ్ హాబిట్స్, ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే శ్రీనివాస్ నన్ను చూడగానే "ఫిట్నెస్ మాత్రం భలే మెయింటైన్ చేస్తున్నావ్ అన్నయ్యా" అంటుంటే కాస్తంత సంతోషమే వేసింది…
ఆ పక్కనే మోడ్రన్ టీ సెంటర్ అని ఒకటుంటుంది… నేను డిగ్రీ చదివేటప్పటి నుండి శ్రీనివాస్తోనూ, ఆ మోడ్రన్ టీ సెంటర్తోనూ, ఆ పక్కనే ఉండే సిగిరెట్ షాప్తోనూ, ఊర్వశీ స్వీట్స్ సత్యంతోనూ, బాపట్లలో చాలా ఫేమన్ అయిన కేశవ్ కూల్ డ్రింక్స్ (బాదంపాలు స్పెషల్), అనిల్ డ్రెసెస్ అనిల్‌తోనూ…. ఇలా చాలానే పరిచయాలు అలా కొనసాగుతూనే ఉన్నాయి…
ఈ మధ్య కాలంలో నేను బాపట్ల వెళ్లి నాలుగేళ్లు అవుతోంది… మొన్న అనుకోకుండా వెళ్లి ఓరోజంతా గడిపినప్పుడు… కాలేజ్ రోజుల్లో ఎలాగైతే ఎంత దూరమైనా షాపులు చూసుకుంటూ నడిచి వెళ్లేవాడినో అలా నడుస్తూ… కొత్తగా వచ్చిన మార్పులు చూస్తూ పాత జ్ఞాపకాల్ని తడుముకుంటూ తిరిగేశాను…
సిగిరెట్ షాప్ ఫ్రెండ్ స్వాతి వంటి నాలుగైదు రకాల పుస్తకాలతో పాటు "కంప్యూటర్ ఎరా" కూడా అమ్ముతుంటే చూసి హాపీ అన్పించింది… మొన్నెప్పుడో ETVలో చూశాడట…. "చాలా సంతోషమేసింది బ్రదర్.." అంటూ అతని ఎక్స్ప్రెషన్ చూస్తే గుండెల్లో అలా ముద్రించుకుపోయింది…. నేను సిగిరెట్లు మానేసి 8 సంవత్సరాలైంది…. అని చెప్తుంటే అస్సలు నమ్మలేకపోయాడు… రకరకాల పొడుగూ, పొట్టీ సిగిరెట్లు అప్పట్లో అతని వద్ద కొనే అరుదైన కస్టమర్లలో నేనూ ఒకడిని కదా 🙂 సిగిరెట్లు మానేశాక యోగా నేర్చుకోవడంతో పాటు కొంతకాలం నేర్పించాను అంటే మరీ ఆశ్చర్యపోయాడు…..
ఇవన్నీ గొప్పగా చెప్పడానికి రాయట్లేదు… మన జ్ఞాపకాలూ, గతాలూ ఎక్కడో పారేసుకుని ఇంకెక్కడో వెర్రి పరుగుతో బ్రతికేస్తున్నాం…. ఆ విషయం తవ్వే ప్రయత్నంలోనే కొన్ని నా వ్యక్తిగత అనుభవాలు ఇవి…
వ్యక్తిగత స్వార్థాలకు తప్పించి పనికిరాని బలహీనమైన రిలేషన్లలో కాదు… బలాన్నీ, నమ్మకాన్నీ, సంతోషాన్నీ చూసుకోవలసింది…. ఒక్కసారి తడిమి చూసుకుంటే మనకు చాలానే బలమైన రిలేషన్లు ఉన్నాయి…. కావలసిందల్లా తీరుబడి చేసుకోవడమే….
చదువుకున్న కాలేజ్ పరిసరాల్లో ఓ కాలేజ్ స్టూడెంట్‌లా చుట్టేసి వస్తే లైఫ్ పట్ల పోయిన ఆశ మళ్లీ పుట్టదూ…..? ఎక్కడెక్కడో సెటిల్ అయిన స్నేహితుల్ని వీలు చేసుకుని వెళ్లి కలిసి కనీసం ఓ పది నిముషాలైనా గడిపితే బంధాలపై నమ్మకం పుట్టుకురాదూ..?
నావరకూ ఇటీవల నేను ఎంత మానసికంగా ఇబ్బందిపడ్డానో… దాని నుండి బయటికి వచ్చే ప్రయత్నంలో…. జీవితం మొత్తాన్నీ ఓసారి అనలైజ్ చేసుకుంటే ఎలా జీవించాలో, ఎలా జీవిస్తున్నానో గమనిస్తూ పోతే… చాలానే స్పష్టతలు వచ్చాయి…
ముఖ్యంగా విచారంలో కొట్టుకుపోయేటప్పుడు జీవితంపై రెట్టింపు సంతోషాన్ని ప్రోదిచేసుకోవడం… దానికి కావలసిన మైండ్‌సెట్‌ని ట్యూన్ చేసుకోవడమూ నా జీవితంలోని ఎన్నో చేదు అనుభవాల ద్వారా అలవాటైపోయింది…. ఆ ఎక్సర్‌సైజ్‌కి మరింత పరిపూర్ణత లభిస్తూ ఉంది… నిజంగా ఈ విషయంలో ధన్యుడిని…!!
– ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
చాలా బాగా రాసారు శ్రీధర్ గారు. గత అనుభవాలను అందరితో పంచుకోవడమే అన్నింటి కన్నా గొప్ప అనుభూతి. ఈ టపా చదువుతుంటే నా కళాశాల రోజులు గుర్తుకు వచ్చాయి. మంచి టపా రాసినందుకు ధన్యవాదాలు.