అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికోఽలసః ।
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ।। 28 ।।
క్రమశిక్షణారాహిత్యంతో ఉన్నవారు, తుచ్చులు, మూర్ఖులు, ధూర్తులు, నీచులు, బద్దకస్తులు, నిరాశతో ఉండేవారు మరియు నిర్లక్ష్యంతో కాలయాపన చేసేవారిని – తమోగుణ కర్తలు అనవచ్చు.
వివరణ:
ఈ శ్లోకంలో భగవానుడు తమో గుణం కలిగిన కర్తలు (మనుషుల) గురించి చెబుతున్నారు. క్రమశిక్షణ లేని వారు తమో గుణానికి చెందిన వారవుతారు. డిసిప్లెయిన్ అత్యంత ముఖ్యమైనది. విశ్వాన్ని చూస్తే అనేక విషయాల్లో డిసిప్లెయిన్ కనిపిస్తుంది. సూర్యోదయం గానీ, సూర్యాస్తమయం గానీ, లేదా జూన్ మొదటి వారంలో మన ప్రాంతంలో రుతుపవనాలు గానీ, చలికాలం, ఎండాకాలం ఇలా ప్రకృతిలో ప్రతీదీ ఓ క్రమపద్ధతిలో తమ ధర్మాలు తాము నిర్వర్తిస్తున్నాయి. వాటికి తగ్గట్లే మన బయలాజికల్ క్లాక్ (జీవ గడియారం) కూడా పనిచేస్తోంది. ఇప్పుడంటే రాత్రిళ్లు పదీ, పదకొండు, పన్నెండు గంటలకు పడుకుంటున్నాం గానీ మన పాత తరాలన్నీ ఆరు గంటల లోపే డిన్నర్ ముగించుకుని చీకటితో పాటే నిద్రకు ఉపక్రమించి వేకువనే బ్రహ్మ ముహూర్తాన లేచే అలవాటు కలిగి ఉండే వారు. ఆ అలవాటుకి తగ్గట్లే బ్రెయిన్లోని సెరటోనిన్, మెలటోనిన్ విడుదల అవుతూ కంటి నిండా నిద్ర, పగలంతా చురుకుగా ఉండే స్వభావం కలిగి ఉండే వారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాక, ఇళ్లల్లో తెల్లటి కాంతితో కూడిన LED లైట్లు వచ్చాక ఆ స్క్రీన్ల నుండి వెదజల్లబడే తెల్లటి కాంతిలో బ్లూ టింట్ ఉండి, రాత్రి సమయం కూడా పగలేమో అనే భావనలో మన బ్రెయిన్ ఉండిపోయి బ్రెయిన్లోని పీనియల్ గ్లాండ్ తగినంత మెలటోనిన్ని ఉత్పత్తి చెయ్యలేకపోవడం వల్ల చాలామంది రాత్రి ఎంత సమయం అయినా నిద్ర రాని పరిస్థితికి గురవుతున్నారు. దీంతో పగలంతా నీరసంగా, నిస్సత్తువుగా గడుపుతుంటారు. ప్రకృతికి తగ్గట్లే మనిషి శారీరక, మానసిక నిర్మాణం ఓ డిసిప్లెయిన్లో ఉన్నప్పటికీ మన అలవాట్లు, జీవన శైలి వల్ల మనం చేతులారా కొనితెచ్చుకున్న సమస్యలు ఇవి. ఇలా డిసిప్లెయిన్ పోగొట్టుకున్న వారిలో తెల్లారి లేవలేకపోవడం, చురుకుగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం, బద్ధకం వంటివి వెంటాడుతూ ఉంటాయి.
ఒక మంచి కర్మని కొనసాగించాలన్నా, చెడు కర్మలకు దూరంగా ఉండాలన్నా కూడా డిసిప్లెయిన్ ముఖ్యం. శారీరక, మానసిక ఆరోగ్యాలకు, కుటుంబానికీ, సమాజానికీ, ఆధ్యాత్మికతకు ఉపకరించేవి మంచి కర్మలు. వీటిని అలవాట్లుగా మార్చుకుంటే జీవితంలో ఓ భాగం అవుతాయి. ఉదా.కి.. రోజూ తెల్లారే లేచి మెడిటేషన్ చెయ్యడం అనే అలవాటు చేసుకుంటే ఆధ్యాత్మికంగా అది ఉపయోగపడి మనిషి తన సోల్కి చేరుకోవడానికి ఉపకరిస్తుంది. ఇలా ఓ మంచి అలవాటు చేసుకోవాలంటే క్రమం తప్పని క్రమశిక్షణని మనం కలిగి ఉండాలి. ఇలా కొన్ని రోజుల పాటు ఒకటే మంచి పనిని మనం మిస్ అవకుండా చేస్తుంటే మన బ్రెయిన్లో కొత్త న్యూరల్ పాత్వేస్ సృష్టించబడి వివిధ న్యూరాన్లకి మధ్య నెట్వర్క్ బలోపేతం అయి ఆ మంచి అలవాటు ఎప్పటికీ వదిలిపెట్టలేనంతగా మన జీవితంలో భాగమవుతుంది.
అదే బద్ధకం, తాగుడు, జూదం లాంటి తామసిక స్వభావాన్ని పెంచే ఇతర అలవాట్లని వదులుకోవాలన్నా వాటికి సంబంధించిన వాతావరణానికి (తాగమని ప్రోత్సహించే మనుషులు, సాయంత్రం అయితే తాగాలనిపిస్తే మంచి పుష్టిగా ఉండే ఆహారం పెందలాడే తీసుకుని కడుపు నిండుగా ఉండగా ఆ కోరికను అధిగమించడం) దూరంగా ఉండడం ద్వారా ఆ అలవాటు చుట్టూ బ్రెయిన్లో ఏర్పడిన న్యూరల్ నెట్వర్క్కి బలహీనం చేసి దాన్ని అధిగమించవచ్చు.
అలాగే విచక్షణ కోల్పోయి దిగజారి ప్రవర్తించడం “నీచ స్వభావం” అవుతుంది. ఇలాంటి నీచ స్వభావం కలిగిన వారు తమో గుణ కర్తల క్రిందికి వస్తారు. ప్రతీ వ్యక్తికీ సంస్కారం, పద్ధతులు, ఉన్నతమైన దృక్పధం ఉండాలి. ప్రతీ సోల్ ఎప్పటికప్పుడు తనని తాను హైయ్యర్ వేవ్లెంగ్త్ వైపు ప్రయాణించేలా పరిపక్వత సాధిస్తూ ఉండాలి. అయితే కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం, పేరు, డబ్బు, మనుషులు ఇతర భౌతికమైన విషయాల కోసం మానసికంగా అదఃపాతాళానికి చేరుకుంటుంటే అది నీచత్వం క్రింద లెక్క. కృష్ణ భగవానుడు చెప్పిన సత్త్వ, రజో గుణాలు రెండింటి కన్నా ఈ తమో గుణ స్వభావం అత్యంత దారుణమైనది. దీని నుండి బయట పడితేనే జీవుడు భగవంతుడికి, విశ్వానికి, తోటి జీవులకు దగ్గరవుతాడు.
– Sridhar Nallamothu