చాలా రిపీటెడ్‌గా ప్రతీ ఒక్కళ్లచే చీదరించుకోబడేది.. సిస్టమ్.. అదే "వ్యవస్థ"!
మనిషి తన వ్యక్తిగత విజయాలకు గర్వంగా తలెత్తుకుని తిరుగుతాడు… గొప్పగా చెప్పుకుంటాడు… మరో వైపు తన వైఫల్యాలూ, అనుకూలించని బాహ్య పరిస్థితులూ వంటివన్నీ వ్యవస్థా, సమాజంలో ఉన్న లోపాల వల్ల తటస్థించాయని నిందిస్తుంటాడు…
ప్రతీ అసంతృప్తీ చల్చారవలసిందే.. అలా చల్లారాలంటే ఎవర్నో ఒకర్ని తిడితే కొంత కడుపు మంట చల్లారుతుంది… ఎవర్ని తిడితే ఎవరూరుకుంటారు.. అస్సలే ఈ మధ్య ప్రతీ చిన్న విషయానికీ కొత్తగా మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి కదా… సో సిస్టమ్ మొత్తాన్నీ ఏకిపారేయడం మొదలెడతాం…
భారతీయతో, హిందూత్వమో, ఒక పొలిటికల్ పార్టీనో, ఓ ప్రాంతామో, మరొకటో, మరొకటో మాత్రమే మనకు "ప్రశాంతత" సాధించిపెట్టగలవని మన నమ్మకం….
మన బ్రెయిన్ ఈ సామాజిక పరిస్థితులన్నింటినీ నిరంతరం మోనిటర్ చేస్తూనే ఉంటుంది… ఎక్కడైనా హిందూ మతానికో, భారత దేశానికో, లేదా మనకు నచ్చిన పార్టీకో, ప్రాంతానికో, మనిషికో, సినిమాకో, హీరోకో… అవమానం జరిగితే తట్టుకోలేం…
మనకు నచ్చనిది ఏదైనా జరిగితే ఉన్న ఫళాన సిస్టమ్‌పై ఎక్కడ లేని అసహ్యమూ కలుగుతుంది… "ఈ దరిద్రపు గొట్టు దేశంలో కాబట్టి ఇలా తగలడింది.." అని ఏదో పేద్ద అన్యాయం జరిగిపోయినట్లు ఫీలైపోతాం….
సొసైటీ అన్న తర్వాత మనలాంటి కొద్ది మంది మనుషుల అరచేతుల్లో రిమోట్ కంట్రోల్లా పనిచేయడం కుదరని పని!
అంతేకాదు.. సొసైటీ ఒక వ్యక్తి ఇష్టాఇష్టాలకు నచ్చినట్లు ఎప్పుడూ ముందుకు సాగదు… అనేక మంది వ్యక్తుల, ఆలోచనల, కాలమాన పరిస్థితుల ప్రాతిపదికన సొసైటీ నెమ్మదిగా మార్పులు సంతరించుకుంటూ ఉంటుంది.. అలాగే సిస్టమ్‌లోనూ మనకు నచ్చని మార్పులెన్నో వస్తుంటాయి…
ఇక్కడ సిస్టమ్‌లో లోపాల్ని ప్రశ్నించడం ఆపమని కాదు నా ఉద్దేశం….
మనిషి అవసరానికి మించి సమాజాన్నీ, సిస్టమ్‌నీ తన ఎస్కేపిజానికి బండబూతులు తిట్టేస్తున్నాడు… యెస్ ఇది నిజం!
మనం మెరుగ్గా బ్రతకలేకపోతున్నామంటే.. మెరుగ్గా బ్రతకడం మనకు చేతకాకపోయి ఉండొచ్చు కదా… దానికి సిస్టమ్ బాధ్యత ఎలా వహిస్తుంది?
"మన ఫెయిల్యూర్స్కీ, జీవన ప్రమాణాలకూ సిస్టమ్, సమాజం బాధ్యత వహించాల్సిందే.." అని డిమాండ్ చేస్తే సహజంగానే వేలమంది మన వెనుక నిలబడి మనల్ని సపోర్ట్ చేస్తారు… కారణం వారికి ఓ అజెండానో, మరో రాజకీయ ఆసరానో, మరో టైమ్‌పాస్ ఇష్యూనో కావాలి కాబట్టి!
మనిషి తన కాళ్లపై తాను నిలబడడం మర్చిపోయాడు… తనని తాను నమ్ముకోవడం మర్చిపోయాడు… ఎవరో వచ్చి భుజాన ఎత్తుకుంటే చిన్న పిల్లాడిలా నవ్వాలనుకుంటున్నాడు…
ప్రభుత్వాల నుండీ, రాజకీయ నాయకుల నుండీ, సమాజం నుండీ కావలసినంతా దోచుకోవాలనుకుంటున్నాడు…. యెస్… నిజంగానే చెప్తున్నా…. రాజకీయ నాయకులూ, ప్రభుత్వాలూ దోచుకుంటున్నాయి అంటే కారణం… మనమూ రకరకాల బెనిఫిట్స్ కావాలని ప్రభుత్వాలనూ, ఓట్ల కోసం వచ్చే నాయకుల్నీ బేరం ఆడుతున్నాం కాబట్టే!
ప్రజాస్వామ్యంలో సోషల్ వెల్ఫేర్ (సామాజిక సంక్షేమం) అనేది ఓ చిన్న వింగ్ మాత్రమే… బ్రతకలేని మనుషుల్ని బ్రతికించడానికీ, సమాజానికి కొద్దిశాతం భద్రత కల్పించడానికీ మాత్రమే ఇది ఉద్దేశించబడింది… కానీ మనం డెఫినిషన్లు మార్చి పారేశాం… అన్నీ ప్రభుత్వాలే చూసుకోవాలి… ఏం తేడా వచ్చినా మనం ఊరుకోం… అందుకే వందమంది వంద హామీలతో వస్తున్నారు..
అసలు విషయానికి వస్తే… సిస్టమ్ అనేది చీదరించుకోబడడానికి కారణం… ఇలా మనం అన్నింటికీ సిస్టమ్‌పై ఆధారపడే పరాన్న జీవులుగా బ్రతకడం మొదలెట్టడం!
"నా జీవితంలో ప్రభుత్వం వల్లా, సిస్టమ్ వల్లా ఏ సాయం పొందకుండా నా కాళ్లపై నేను చాలా గౌరవప్రదంగా బ్రతకగలిగాను…" అని ఏ పౌరుడైనా అనుకోగలిగితే ఇలా ప్రతీ చిన్న దానికీ సిస్టమ్‌ని ఆడిపోసుకునే ఎస్కేపిజం తలెత్తదు.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply