నమ్మితే భగవంతుడి సృష్టో, నమ్మకపోతే సైన్స్ ప్రకారం పునరుత్పత్తి సిద్ధాంతమో కానీ తండోపతండాలుగా మనుషులు భూమ్మీదకు చేరారు.
ఎవరూ ఎవరికీ హాని చేసుకోకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వెళ్లే జీవన విధానమే "హ్యూమానిటీ".
విడివిడిగా చూస్తే ఒక్కో మనిషీ ఆటమ్ బాంబు లాంటి వాళ్లు! తమ మాటలతో, చేతలతో భారీ విధ్వంసం సృష్టించగలరు. దానికితోడు తెలివితేటలకూ
తెలివితేటలూ, అపరిమితమైన స్వేచ్ఛా కలిస్తే ఇక మనుషుల్ని ఎవరూ ఆపలేరు. సరిగ్గా ఇక్కడే హ్యూమానిటీ అనే కాన్సెప్ట్ వేళ్లూనుకుంది.
ఆదిమానవుడు పక్కన మనిషికి గాయం చేసేవాడు తన అవసరం కోసం. ఆ గాయం ఎంత బాధిస్తుందో అతనికి అనవసరం.
కొన్నాళ్లు పోగా పోగా.. గాయం చేసేవాడు గాయపడే వాడి కళ్లల్లోకి చూస్తే ఏదో తెలీని బాధ కన్పించేదీ, ఆ ఫీలింగ్ గాయం చేసే వాడినీ గుండెల్లో మెలేయడం మొదలెట్టింది. దాంతో తాను చేస్తున్నది తప్పని అర్థమవుతూ వచ్చింది.
పొరబాటునో, గ్రహపాటునో ఈ భూమ్మీదకు ఒక్కచోటకు వచ్చి ఊడిపడ్డ మనుషుల్ని ఒకర్నొకరు గాయపరుచుకోకుండా.. కలిసికట్టుగా సహజీవనం చేసేలా "మానవత్వం" అనే కాన్సెప్ట్ తయారైంది.
ప్రపంచంలో విసిరేసినట్లు అక్కడక్కడా నివసించే సమూహాలు అక్కడక్కడ స్థానిక సమాజాలుగా మారిపోయాయి. మనం ఇండియన్స్గానూ, తెలుగు వాళ్లగానూ ఎలాగో సౌతాఫ్రికా వాళ్లు అలాగన్నమాట 🙂
ఏ సమాజమైనా హెల్తీగా ఉండాలంటే అందులోని మనుషులు తిన్నగా ఉండాలి. మనలాంటి మనుషుల్ని సమాజం కోసం తిన్నగా ప్రవర్తించేలా చేయడం కోసం కొన్ని కట్టుబాట్లు సృష్టించబడ్డాయి, ఆ కట్టుబాట్లు దాటితే సంఘ బహిష్కరణ చేయబడతామనే భయాలూ సృష్టించబడ్డాయి.
అలాగే ప్రేమలూ, పెళ్లిళ్లూ, కుటుంబాలూ, అక్కా చెల్లీ, తమ్ముడూ, అన్నా, వదినా.. వంటి బంధుత్వాల వంటి కాంప్లికేటెడ్ సోషల్ ఆర్కిటెక్చర్ కూడా నిర్మించబడింది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు బ్రతికి ఉన్న మనం పుట్టకముందే మనం కొన్ని వందల సంవత్సరాలుగా ఆచరించబడుతున్న ఓ సిస్టమ్‌లోకి ఇరికించబడి పుట్టాం.
మనుషులైనా, సమాజమైనా, సిస్టమైనా.. మనల్ని మనం ఇబ్బందిపెట్టుకోకూడదని నిర్మించడినవే!
అందుకే సాటి మనిషిని కొడితే… "ఇది ఎంత అమానుషం" అని ఓ వంద గొంతులు కూడి వచ్చి మన మీద దండెత్తుతాయి.
పోలీసులు ఉద్యమకారులపై లాఠీఛార్జ్ చేస్తున్నా, ఇళ్లల్లో మొగుళ్లు పెళ్లాల్ని కొడుతున్నా.. అది తప్పు అని మనకు అన్పించడానికి కారణం.. మనం హ్యూమానిటీ అనే సిద్ధాంతాన్ని కొన్ని వందల సంవత్సరాలుగా నరనరానా వంటబట్టించుకున్నాం.
కేవలం భౌతిక దాడులే కాదు.. నన్ను భౌతికంగా ఏమీ చెయ్యలేక మీరు మానసికంగా దాడి చేసినా.. "మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు.. ఇది మానవత్వమేమా?" అని నేను ప్రశ్నించగలుగుతున్నాను. మీరు అపరాధభావంతో తలొంచుకోగలుగుతున్నారు.
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. మనుషుల చచ్చేలోపు ప్రతీ ఒక్కరూ కంఫర్టబుల్‌గా, సౌఖ్యంగా, ఒకర్నొకరు గాయపరుచుకోకుండా బ్రతకడ కోసం "మానవత్వం" అనే పదం పుట్టించబడింది.
మనిషి తెలివితేటలు రానురానూ ఎక్కువైపోతున్నాయి.. అలాగే ఆదిమానవుడి నాటి పశుత్వం మెల్లగా తిరిగి ఆవహిస్తోంది.
వ్యంగ్యంగా మాట్లాడడం, మానసికంగా ఇతరుల్ని గాయపరచడం, కులాలు, ప్రాంతాలూ, వృత్తులూ, ఆడా, మగా వంటి ఎన్నో అంశాల ఆధారంగా సాటి మానవుల్ని రాక్షసత్వంతో తూలనాడి, శారీరకంగానూ, మానసికంగానూ గాయపరిచి.. వినోదించడం మెల్లగా ఎక్కువవుతోంది.
మన తోటి మనుషుల్ని గాయపరుద్దాం.. మన వ్యంగ్యాలతో, మన చురుకైన మాటలతో, చేతులతో, కత్తి లాంటి లాజిక్‌లతో.. ఫర్లేదు.. ఎవరూ అడ్డుకునే సాహసం చెయ్యట్లేదు ఇవ్వాళా రేపు!! కానీ రేపు అవే గాయాలు మనకు తగులుతాయి.. అడ్డుకోవడానికీ, మనల్ని రక్షించడానికీ ఏ మనుషులూ, సమాజమూ రాదు.
మరి సిద్ధమా మనం చేసే గాయాలకు మనం బాధ్యత వహించడానికి?
హ్యూమన్ బీయింగ్స్ గురించి నాలుగు మాటలు చెప్పుకున్నంత మాత్రాన హ్యూమానిటీ అయిపోదు.. వందల ఏళ్లుగా మనుషుల్ని ఓచోట రక్షిస్తూ వస్తున్న హ్యూమానిటీ అనే సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరిస్తూ ఇతరుల్నీ గౌరవిస్తూ, ఇతరుల్నీ హర్షిస్తూ, ప్రేమిస్తూ.. బ్రతుకుతుంటేనే మనం హ్యూమానిటీ కలిగిన వాళ్లం అవుతాం తప్ప అందర్నీ ద్వేషిస్తూ "నేను వీర హ్యూమనిస్ట్నండీ బాబూ నమ్మండి" అంటే మన పైశాచిక చేతల ఫలితాలు మనల్ని ఒంటరుల్ని చేయకుండా ఊరుకోవు.
గమనిక: హ్యూమానిటీపై చాలామంది అస్సలు ఆలోచించని ఓ కోణాన్ని దీనిలో ప్రస్తావించాను. చాలామందికి ఈ ఆలోచన అవసరం. అందుకే దీన్ని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చేయడం ద్వారా అస్సలు మనమేమిటో, మన తరం ఎటువెళ్తోందో కాస్త గ్రహింపుకి వస్తుంది.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply