అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా ।
సర్వార్థాన్విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ।। 32 ।।
వివరణ: చీకటితో ఆవృత్తమై, అధర్మమునే ధర్మము అనుకుంటూ, అసత్యమును సత్యము అని భావిస్తూ ఉండే బుద్ధి తమోగుణ బుద్ధి.
ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తమో గుణ బుద్ధి గురించి వివరిస్తున్నారు. ఇంతకుముందు శ్లోకంలో మనం తెలుసుకున్న “రజో గుణ బుద్ధి”లో ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకోవడంలో గందరగోళం మాత్రమే ఉంటే.. ఈ తమోగుణ బుద్ధి కలిగిన వ్యక్తి, అలాంటి గందరగోళం కూడా ఏమీ లేకుండా ఏకంగా “అసత్యాన్నే సత్యమనీ, అధర్మాన్నే ధర్మమని” బలంగా నమ్ముతూ ఉంటారు.
బద్ధకం, ఎప్పుడూ నిద్రపోవడం, అజ్ఞానమూ, నిర్లక్ష్యమూ, అతిగా ఆహారం తీసుకోవడం ఈ తమో గుణ లక్షణాలు. జీర్ణం కావడానికి అధిక సమయం తీసుకునే ఆహార పదార్థాలను ఈ తమో గుణ లక్షణం కలిగి ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఇష్టపడటం వల్ల, వారి శరీరంలో రక్తప్రసరణ ఉదర భాగంలో ఆహారాన్ని జీర్ణం చేయటానికి మాత్రమే అధిక శాతం ఖర్చు చేయబడుతూ, మెదడుకు రక్త సరఫరా మరియు ఆక్సిజన్ తగినంత మోతాదులో లభించదు.
దీనివల్ల వారు ప్రపంచాన్ని చూసే దృష్టి సవ్యంగా ఉండదు. తమ సొంత బుద్ధితో ఏది మంచి ఏది చెడు అన్నది నిర్ణయించుకునే మానసిక శక్తి బ్రెయిన్ యాక్టివ్‌గా లేకపోవడం వల్ల కోల్పోయి.. ఈ తమో గుణ బుద్ధి కలిగిన వ్యక్తులు టివిలు, వార్తా పత్రికలు, యూట్యూబ్, సమాజంలో మేధావులుగా చలామణి అయ్యే వారు, అధికారంలో ఉన్నవారు చెప్పే విషయాలనే నిజాలుగా నమ్ముతూ ఉంటారు.
ఒకవేళ అదృష్టం బాగుండి వారు నమ్మే వ్యక్తులు సవ్యమైన దృష్టి కలిగినవారు అయితే ఈ తమోగుణ బుద్ధి కలిగిన వ్యక్తులకు మేలు జరుగుతుంది. అయితే ఒక మనిషిని ప్రశాంతంగా ఉండేలా చేయడం కన్నా వారి భావోద్వేగాలను రెచ్చగొట్టడం చాలా సులభం కాబట్టి.. సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తులు తమ స్వప్రయోజనాల కోసం చెడు మంచి అన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తే, ఈ తమో గుణ బుద్ధి కలిగిన వ్యక్తులు కూడా గొర్రెల మందలా ఆ చెడుని మంచిగానే నమ్ముతుంటారు.
ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం అని తెలుసుకోవడానికి చాలా మానసిక శక్తి, నిరంతరం మానసిక సంఘర్షణకు గురి కావాల్సి ఉంటుంది. దానికి తమో గుణ బుద్ధి కలిగిన వ్యక్తులు తీసుకునే సులభంగా జీర్ణం కాని మాంసాహారం, అతి నిద్ర, నిర్లక్ష్యం వంటి లక్షణాలు ప్రతిబంధకంగా మారుతూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తులకు అధునాతనంగా అందుబాటులోకి వచ్చిన “మెండి” వంటి బ్రెయిన్ ట్రైనింగ్ డివైజ్లతో బ్రెయిన్లోని న్యూరల్ యాక్టివిటీ స్కాన్ చేసినా, అతి స్వల్ప మొత్తంలో మాత్రమే న్యూరల్ యాక్టివిటీ నమోదు అవుతుంది. (గమనిక: వ్యాసకర్త ఇలాంటి అధునాతన బ్రెయిన్ ట్రైనింగ్ డివైజ్‌తో స్వయంగా ప్రయోగాలు చేసి ఉన్నారు)
బ్రెయిన్లో న్యూరల్ యాక్టివిటీ సరిగా లేకపోతే, మైండ్ ఆటో-పైలెట్ మోడ్‌లో పని చేస్తూ ఉంటుంది. అంటే పెద్దగా కష్టపడకుండానే బయట ప్రపంచం నుండి మళ్లీ మళ్లీ చెప్పబడి బలంగా నమ్మించబడిన అసత్యాలను సత్యాలుగానూ, అధర్మాలను ధర్మాలుగానూ నమ్ముతూ ఉంటుంది.
ఉదాహరణకు, “తోటి వ్యక్తికి అన్యాయం చెయ్యకూడదు” అనే ధర్మాన్నే తీసుకుంటే..
ఈ మధ్యకాలంలో ఒక మాట ఎక్కువగా వింటున్నాం. “నువ్వు ఎవరికైనా అన్యాయం చేయి, నువ్వు బ్రతకాలంతే, పక్కోడికి అన్యాయం చేసి బ్రతికేవాడే చాలా సంతోషంగా బతుకుతున్నాడు” అనే మాట విపరీతంగా సమాజంలో చెలామణిలో ఉంది.
వాస్తవానికి “తోటి వ్యక్తికి అన్యాయం చెయ్యకూడదు” అనేది కూడా ధర్మ శాస్త్రంలో చెప్పబడి ఎన్నో తరాల పాటు చలామణిలో ఉన్న నైతిక విలువ.
లాజికల్ మైండ్ తో ఆలోచిస్తే ఆ ధర్మం కూడా మళ్లీ మళ్లీ చెప్పబడి సమాజం మీద కండిషన్ చేయబడింది. ఇప్పుడు కొత్తగా చెలామణిలోకి వచ్చిన ఔపక్కోడికి అన్యాయం చేసి బ్రతికేవాడే చాలా సంతోషంగా బతుకుతున్నాడు” అనే మాట కూడా అలాగే ఎక్కువమంది మనసులను కండిషన్ చేస్తోంది.
ఇప్పుడు ఈ రెండిటిలో ఏది వాస్తవం అన్నది సత్త్వ గుణ బుద్ధి కలిగిన వ్యక్తి మాత్రమే తెలుసుకోగలుగుతాడు. రజో, తమో గుణ బుద్ధి కలిగిన వ్యక్తులు తమ భావోద్వేగాలు తగ్గట్లు, ఆలోచించే శక్తి లేకా సమాజం చేత చెప్పబడే దాంతో కొట్టుకుపోతుంటారు.
“తోటి వ్యక్తికి అన్యాయం చెయ్యకూడదు” అనే ధర్మ శాస్త్ర నైతిక విలువను పరిశీలిస్తే ఏదో గాలివాటంగా అది చెప్పబడింది కాదు. విశ్వం మొత్తం ఒక హార్మొనీలో నడుస్తూ ఉంటుంది. తోటి మనిషి హృదయాలను వికపింపజేసేలా వారి బ్రతుకు వారిని స్వేచ్ఛగా బ్రతికేలా చెయ్యగలిగినప్పుడు వారు తాము ఈ భూమ్మీదకు వచ్చిన కర్మలను పూర్తి చేసుకుని వారి ఆత్మలు ముక్తికి చేరుకుంటాయి. కానీ ఒక వ్యక్తి తన స్వార్థం కొద్దీ ఇతరులకి అన్యాయం చేశాడే అనుకుంటే, ఆ అన్యాయాన్ని తట్టుకోలేక, అప్పటి వరకు స్వేచ్ఛగా ఉన్న ఆ రెండో వ్యక్తి కుంచించుకుపోయి, తన పూర్వజన్మ కర్మ ఫలాలను అనుభవించి వెళ్లాల్సిన వాడు కాస్తా ఈ జన్మలో మరికొన్ని దుష్కర్మలకు పాల్పడతాడు. ఇప్పుడు ఈ హార్మొనీని దెబ్బతీసిన కర్మ ఫలం ఇలా ఇతరులకు అన్యాయం చేసిన వ్యక్తిని వెంటాడుతూనే ఉంటుంది.
ఇది కర్మ సిద్ధాంతం మాత్రమే కాదు.. అంతకంటే బలంగా టైమ్, స్పేస్ పరిధులను దాటి ఒక ఆత్మ వివిధ రూపాలుగా మారి తన వైబ్రేషన్‌ని, దాని ఫలితాలను క్యారీ చేసే క్వాంటమ్ ఫిజిక్స్‌లోని క్వాంటమ్ మేనిఫెస్టేషన్ గురించి లోతుగా తెలుసుకున్న తర్వాత భగవద్గీత మరింత స్పష్టంగా అర్థమవుతుంది.
సత్యాన్ని, ధర్మాన్ని స్వయంగా తెలుసుకోలేని తమో గుణ బుద్ధీ, అవే సత్యం, ధర్మాలను కేవలం తన భావోద్వేగాల చేత ప్రేరేపితం చెయ్యబడి అస్పష్టంగా మాత్రమే గ్రహించగలిగే రజో గుణ బుద్ధి కన్నా ఉన్నది ఉన్నట్లు ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా చూసే సత్వ్త గుణ బుద్ధి అత్యుత్తమమైనది.
– Sridhar Nallamothu