మనం ప్రపంచం కోసం మనల్ని మనం మలుచుకుంటుంటాం. మనసొప్పని పనుల్ని సైతం ప్రపంచం, పక్క మనుషుల మెప్పు కోసం చాలాసార్లు చేస్తుంటాం. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. కోల్డ్ వార్ అనే పదం మనం తరచూ వింటూనే ఉంటాం. ఇద్దరు మనుషులు మిగతా ప్రపంచానికి చాలా ఆత్మీయులుగా కన్పిస్తుంటారు. కానీ ఎవరికీ తెలియని విధంగా వారిద్దరి మధ్య అగాధమంత శత్రుత్వం అలుముకుని ఉంటుంది. ఒకరికొకరు సాయం చేసుకుంటూనే ఉంటారు.. దాన్ని మనం చూస్తూనే ఉంటాం. "ఆహా.. ఎంత గొప్ప స్నేహం.." అని అబ్బురపడుతుంటాం.
ఇక్కడ నిజానికి వారిద్దరికీ ప్రతీ క్షణం "నేనెందుకు అవతలి వ్యక్తికి సాయం చేయాలి?" అనే ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది, ఆ సంఘర్షణని కప్పిపుచ్చుకుని ఏడవలేక నవ్వుతూ ఒకరినొకరు భరిస్తూ ఉంటారు.
ఈ తరహా మనస్థత్వానికి మూల కారణం.. మన ఉనికి పక్క వ్యక్తీ, ప్రపంచం మన పట్ల కలిగి ఉన్న గుడ్ విల్ పై ఆధారపడి ఉంటుందన్న మన భ్రమ! ఇందులో మనం కూరుకుపోతే మన ఆలోచనలు ఇలా సాగుతుంటాయి.
"- నేను నీకు అనుకూలంగా ఉంటాను.
– నీ కోసం వీలైనంత వరకూ త్యాగాలు చేస్తాను.
– నీ పట్ల కేరింగ్ గా ప్రవర్తిస్తుంటాను.
నేను ఇన్ని చేస్తున్న దానికి ప్రతిఫలంగా నువ్వు నన్ను…
మంచి వ్యక్తిగానూ, తెలివితేటలు కలిగిన వ్యక్తిగానూ, నిజాయితీ కలిగిన వాడిగానూ పరిగణిస్తుండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా నన్ను నువ్వు ఇష్టపడుతుండాలి. ఒకవేళ నీకు నాపై ఇష్టం లేకపోయినా ప్రపంచం కోసమైనా నన్ను గొప్పవాడిగా ఒప్పుకో, ప్రపంచం నాపై సదభిప్రాయం ఏర్పరుచుకోవడానికి నువ్వు పావుగా ఉంటానంటే నీ కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధం" అని మానసికంగా ఎదుటి వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని బ్రతుకుతుంటాం. మన ఆత్మగౌరవం ఇంత బలహీనమైన పునాదులపై నిర్మితమవుతోందని ఏ కోశానా మనకు సందేహం రాదు.
"రాముడు మంచి బాలుడు" తరహా ముద్రని కలిగి ఉండడం మనల్ని మనం ఇరుకు ఛట్రాల మధ్య స్వయంగా ఒరిపిడికి గురిచేయించుకోవడమే. మనల్ని మనం ప్రేమించుకోవడం, మన ఆలోచనలకు, మన చేతలకు స్వేచ్ఛని కల్పించుకోవడం మానేసి మన ప్రతీ చర్యకీ పక్క వ్యక్తిదీ, ప్రపంచానిదీ ఒప్పుకోలుని ఆశించి మంచితనం మూటగట్టుకోవాలనుకోవడం శుద్ధ అమాయకత్వం. మనుషులు మనల్ని ఇష్టపడాలని కోరుకోవడం ఓ వ్యసనం. అది మనల్ని బంధీల్ని చేస్తుంది.
మన ప్రతీ పనికీ, ప్రతీ ఆలోచనకూ ఇతరుల స్పందన ఎలా ఉంటుందన్నది మన నియంత్రణలో లేని విషయం. రాముడు మంచి బాలుడు తరహా భ్రమ నుండి బయటపడడం ద్వారా over smartness ప్రదర్శించి ఇతరుల్ని ఆకట్టుకోవడం మానేస్తాం. దీంతో ఎంతో సమయం ఆదా అవుతుంది, ఇంకెంతగానో మనసు తేలికవుతుంది.
ప్రతీ మనిషినీ సంతోషపెట్టడం అనే భ్రమలో ఇరుక్కుపోవడం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు, అవి ఇతరులను తాత్కాలికంగా నొప్పించేవైనా/ ఇతరులకు భిన్నాభిప్రాయం కలిగినవైనా మనకు మనం తీసుకోవడం కష్టం. మన నిర్ణయాలకు కూడా ఇతరుల మెప్పుదలని కోరుకుంటున్నామంటే ఎంత దిగజారిపోయామో అర్థం చేసుకోవాలి.
ఇక్కడ మరో కోణమూ ఉంది. మనం అందరిలో మంచి వారు అనే పేరు తెచ్చుకోవడం కోసం ఎన్నో నచ్చని పనుల్ని మనసు చంపుకుని చేస్తుంటాం, ఇబ్బందిని పంటిబిగువునా భరిస్తూ నవ్వుని మొహకవళికలపై పులుముకుని తిరుగుతుంటాం. లోపల్లోపల అగ్నిలా జ్వలించే ఆ సంఘర్షణ ఏ బలహీన క్షణమో ఆగ్రహంగా వెళ్లగక్కబడుతుంది. ఒకరి మూలంగా పేరుకుపోయిన ఆవేశం వేరొకరిపై అకారణంగానైనా వ్యక్తమయితేనే తప్ప మనసు కొంతైనా శాంతించదు. ఆ కొద్ది క్షణాల ఆవేశం చాలు.. మనం మూటగట్టుకున్న మంచి పేరుని తుడిచిపెట్టడానికి!
మంచితనం ముసుగుని తొలగించుకుని మనల్ని మనం స్వేచ్ఛగా, సంతోషంగా ఉంచుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. దీనికి కావలసిందల్లా మనుషుల్ని నిరుత్సాహపరచడం మొదలెట్టడమే. యెస్.. మీరు విన్నది సరైన పదమే. ప్రతీ ఒక్కరినీ ఎందుకు సంతృప్తిపరచాలి? దానికోసం మనమెందుకు నలిగిపోవాలి? ఏ క్షణమైతే ఎవరేమనుకుంటే నాకేంటి అని స్వేచ్ఛగా మనకు నచ్చిన పనులు, మనకు సంతోషం కలిగించే పనులు మనం చేయడం మొదలెడతామో ఆ క్షణం మన బాధలు తగ్గిపోతాయి. ఇంతకుముందులా మనం ఉండడం లేదని కొత్తగా కంప్లయింట్లూ వస్తుంటాయి. రానీయండి.. ఇంతకుముందులా ఉండడం కోసం ఎవరికోసమో, ఎందుకోసమో ఎందుకు మనల్ని మనం చంపేసుకోవాలి? మంచివాడు అనుకున్నా, చెడ్డవాడు అనుకున్నా అది ఓ వ్యక్తి యొక్క అసమగ్ర ఆలోచనా దృక్పధం నుండి మనపై ప్రసరించే అపరిపక్వ ముద్రే తప్ప ఆ ముద్రని మోసుకు తిరగవలసిన అవసరం లేదని గ్రహిస్తే మనం మంచితనం కోసం పాకులాడం, మనకు నచ్చిన పనులే చేస్తుంటాం, మనకు నచ్చినట్లే ప్రవర్తిస్తుంటాం. మన హద్దులు మనం మీరకుంటే చాలు, ఏది చేసినా కొన్నాళ్లకు అదే చెల్లుబాటవుతుంది.
– నల్లమోతు శ్రీధర్ (ICWAI, PG Diploma in Psychology)
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
చాలా కష్టమైన పని సార్ అది .. జీవితం అంటే నటన
a2zdreams గారు మీరన్నట్లు నిజంగా కష్టమే. కానీ ప్రతీ క్షణం మనం మన కోసం ఆలోచిస్తున్నామా, ఇతరుల కోసం ఆలోచిస్తున్నామా అన్నది గమనించడం మొదలెడితే కొన్నాళ్లకైనా కొంత స్పష్టత వస్తుంది. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.
sir
my attitude is same to write as above article.I have doubt this attitude it is correct or wrong but when I read your article confirm that thanku sir.
my attitude is same to write as above article.I have doubt this attitude it is correct or wrong but when I read your article confirm that thanku sir.
“మంచివాళ్ళు” అనే ముద్రకోసం బ్రతకాలంటే ఆ జీవితంలో స్వేచ్ఛ ఉండదు. మనశ్శాంతి ఉండదు. అనుక్షణం మనస్సాక్షికి ఇచ్చుకునే సంజాయిషీలు తప్ప మరేమీ మిగలవు.
“రాముడు మంచి బాలుడు” తరహా ముద్రని కలిగి ఉండడం మనల్ని మనం ఇరుకు ఛట్రాల మధ్య స్వయంగా ఒరిపిడికి గురిచేయించుకోవడమే._____అవును నిజం!
“నేనిలా మాట్లాడితే ఇంతవరకూ ఉన్న “మంచి” ఇమేజ్ పోతుందేమో” అన్న భయంతో ఎంత కాలమని మనల్ని మనం మభ్యపెట్టుకోగలం? అందుకే మనసులో ఉన్నదేదైనా సూటిగానే మాట్లాడాలి. అభిప్రాయాలని స్వేచ్ఛగా వ్యక్తీకరించాలి. మన జీవితం వంద శాతం మన చేతుల్లో ఉండాలి. ఈ క్రమంలో మనల్ని ఇష్టపడకపోయే వాళ్ళు (ఎందుకంటే ఎదుటివారిక్కూడా మనం మంచి వాళ్ళుగా నటిస్తూ ఉంటేనే బాగుంటుంది),కొందరు తయారవొచ్చు!
కానీ మనం మాత్రం స్వేచ్ఛగా సంతోషంగా ఉంటాం! అదే ముఖ్యం…….నా వరకు!
మెహర్బానీల కోసం బతకడం చాలా కష్టం!
రమేష్ పంజా గారూ.. మనం ఎవర్నీ ఉద్దేశపూర్వకంగా నొప్పించనంత కాలం.. మన స్వంత అభిప్రాయాలూ, ఆలోచనలూ, చర్యలూ కలిగి ఉండడం, నేనిలాగే ఉంటాను అని ప్రపంచానికి స్పష్టపరచడం తప్పేమీ కాదు. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్.
సుజాత గారు ““నేనిలా మాట్లాడితే ఇంతవరకూ ఉన్న “మంచి” ఇమేజ్ పోతుందేమో” అన్న భయంతో ఎంత కాలమని మనల్ని మనం మభ్యపెట్టుకోగలం? అందుకే మనసులో ఉన్నదేదైనా సూటిగానే మాట్లాడాలి” చాలా బాగా చెప్పారు. మీరెంత నిక్కచ్ఛిగా ఉంటారో నాకు కొంత వరకూ తెలుసు. మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు.