నిన్న ఒక ఫోటో షేర్ చేశాను కదా.. ఒక మనిషి విశ్వాన్ని చూస్తున్నట్లు ఉన్న ఫొటో! దాన్ని నేను నిరంతరం ప్రాక్టీస్ చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. న్యూజెర్సీ, ప్రిన్స్టన్ బయో ఫీడ్‌బ్యాక్ సెంటర్‌కి డైరెక్టర్ గా పనిచేసిన “లెస్ ఫెమి Ph.D” 1970లో ఒక విషయాన్ని కనుగొన్నాడు.
మన ఫోకస్ ని నిన్న రాత్రి నేను చెప్పినట్లు narrow ఫోకస్ నుండి ఓపెన్ ఫోకస్‌గా మార్చుకోవడం ద్వారా మన మెదడులో అప్పటి వరకూ ఉన్న తరంగాలు మారిపోతాయి. అంటే, కాన్షియస్గా, లాజికల్‌గా సమస్య గురించి విపరీతంగా ఆలోచించే 12-35 Hz ఫ్రీక్వెన్సీలో ఉండే బీటా తరంగాల నుండి.. ఇలా మనం మన సమస్యల నుండి మన ఫోకస్‌ని అనంత విశ్వం వైపు మార్చుకోగానే, 8-12 Hz మధ్యలో ఉండే ఆల్ఫా తరంగాలుగా మన బ్రెయిన్ వేవ్స్ మారిపోతాయి.
అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అప్పటివరకు మానసిక ఒత్తిడి, మన సమస్యల మీద పూర్తిగా దృష్టి పెట్టిన వాళ్లం కాస్తా, అనంత విశ్వంలో మనది ఏపాటి సమస్య అన్న దాని మీదకు దృష్టి వెళ్లగానే, చాలా రిలాక్స్డ్గా మారిపోతాం. అప్పటి వరకూ మానసిక ఒత్తిడితో ఉన్న మనిషి క్రియేటివ్‌గా, తనలోని సృజనాత్మకతని వెలికి తీసేలా మారతాడు. ఆ మధ్య నేను న్యూరో ఫీడ్ బ్యాక్ అనే ఓ హెడ్‌సెట్‌ని ఆర్డర్ ఇచ్చాననీ, అది మేలో వస్తుందని చెప్పాను కదా! అది చాలా మందికి అర్థం అయి ఉండకపోవచ్చు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఈ క్షణం మనం ఉన్న మానసిక ఒత్తిడితో కూడిన బ్రెయిన్ వేవ్స్‌ని ఆ హెడ్సెట్ కేవలం 5 నిమిషాల్లో చాలా రిలాక్స్డ్ మైంట్సెట్లోకి తీసుకు వెళుతుంది.
సరే అసలు విషయానికి వస్తే మీ శరీరంలో ఎక్కడో చిన్న నొప్పి ఉంది అనుకోండి. వెంటనే మీ ఫోకస్ మొత్తం ఆ భాగానికి వెళుతుంది. నొప్పిని అనుభూతి చెందుతూ, ఆ అవయువం మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది అనే భావనకు గురవుతారు. వెంటనే మీ థింకింగ్ బ్రెయిన్ (మైండ్ చేత విపరీతంగా ఆలోచనలు చేయించే ప్రదేశం) అయిన నియో కార్టక్స్ దగ్గర న్యూరల్ యాక్టివిటీ పెరిగి, “నేను ప్రమాదంలో ఉన్నాను, నా అవయువం సరిగా పనిచెయ్యడం లేదు” అనే భావన కలుగుతుంది.
ఇలా ఒక మనిషి తాను ప్రమాదంలో ఉన్నాను అనే ఆలోచనకు గురైన వెంటనే లింబిక్ సిస్టమ్ ద్వారా దానికి సమానమైన హార్మోన్ మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. అంటే, మీరు ప్రమాదంలో ఉన్నారు కాబట్టి దానికి సరిసమానమైన, స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజోల్ విడుదల జరుగుతుంది.
మీరు మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు, అంటే కార్టిజోల్ విడుదలైన వెంటనే శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఆకలి వేయదు. ఆహారం తీసుకోవడానికి కూడా నోట్లో లాలాజలం ఊరదు.
ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. మీకు స్టేజ్ మీద అనేక మంది ముందు మాట్లాడటం భయం అనుకోండి. మీరు సరిగా మాట్లాడగలుగుతారో లేదోనని, ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని స్టేజ్ ఫియర్ ఉన్న వారు మానసిక ఒత్తిడికి గురవుతారు కదా! అలా ఒత్తిడికి గురైన వెంటనే, మన శరీరం నుండి రెండువైపులా కిడ్నీల పైన ఉండే అడ్రెనల్ గ్రంధి నుండి ఇంతకు ముందు చెప్పినట్లు కార్టిజోల్ విడుదలై జీర్ణ వ్యవస్థను మందగిస్తుంది. ఎందుకంటే అక్కడ మీ ప్రధానమైన ప్రయారిటీ, మీరు ప్రమాదంలో ఉన్నానని భావిస్తున్నారు కాబట్టి, మీ ఉనికిని కాపాడుకోవడం! అందుకే రక్తప్రసరణ మొత్తం పొట్ట భాగంలో జీర్ణ వ్యవస్థ దగ్గర ఉంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సాధ్యపడదు అన్న ఉద్దేశంలో మీ శరీరం తనకు తాను కలిగిన విజ్ఞత కొద్దీ మీ ఆకలిని తగ్గిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆహారం తీసుకోవడానికి వీల్లేకుండా, ఆకలి కలగకుండా, నోట్లో లాలాజలం ఉత్పత్తి తగ్గిపోయి నోరు తడారిపోయేలా చేస్తుంది.
అలాగే విపరీతమైన మానసిక ఒత్తిడి లో ఉన్న వ్యక్తులు సెక్స్‌లో పాల్గొనడానికి ఆసక్తి చూపించరు. ఇక్కడ కూడా మీ శరీరం తన ప్రయారిటీ అయిన మిమ్మల్ని కాపాడుకోవడం మీద దృష్టి పెడుతుంది. పునరుత్పత్తి వ్యవస్థలు దాని దృష్టిలో సెకండ్ ప్రయారిటీ. దీంతోపాటు ఎంత క్రియేటివ్‌గా, ఎంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తులైనా తమ శక్తిసామర్ధ్యాలను మర్చిపోతారు. కారణం ఇప్పుడు మీ శరీరం ఫోకస్ మొత్తం మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మీద ఉన్నప్పుడు మీ బ్రెయిన్లో లాంగ్వేజ్‌కి సంబంధించిన భాగాలు, లాంగ్ టర్న్ మెమరీ, ఇతర కాగ్నిటివ్ ప్రదేశాల దగ్గర న్యూరల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. స్టేజి మీద నిలబడ్డప్పుడు, మానసిక ఒత్తిడికి గురైనప్పుడు, ఎంత సబ్జెక్టు నాలెడ్జ్ వున్నా కూడా తాము చెప్పదలుచుకున్న విషయాలు ఏ ఎక్స్పర్ట్ కూడా చెప్పలేకపోవడానికి కారణం ఇదే! మళ్లీ అదే వ్యక్తి, ఆ మానసిక ఒత్తిడి నుండి బయట పడ్డాక, స్టేజ్ దిగాక, శరీరంలో కార్టిజోల్ హార్మోన్ ప్రభావం తగ్గిపోయాక, “అయ్యో ఆ పాయింట్ చెప్పలేకపోయానే” అనే భావనకు గురవుతాడు.
అంటే ఇదంతా కూడా మనం ఒక సమస్యలో ఉన్నామని భావించి మన దృష్టి మొత్తాన్నీ, narrow focusలో ఒకే అంశం మీద బలంగా పెట్టడం వల్ల ఏర్పడే ఇబ్బంది! ఇప్పుడు నేను నిన్న రాత్రి షేర్ చేసిన ఫొటోని కొద్దికాలం పాటు మనసులో బలంగా ముద్రించుకు పోయేలా ఉంచుకోవడం ద్వారా కళ్లు మూసుకుని ఆ ఫొటోని గుర్తు తెచ్చుకుంటే మన ఫోకస్ narrow నుండి open focusగా మారిపోతుంది.
ఒక్కటి చెప్పండి.. మీరు నడుస్తుంటే మీ కాలి క్రింద చీమ తన ప్రాణం కాపాడుకోవడానికి ఎంత వత్తిడికి గురవ్వాలి? దానికి థింకింగ్ బ్రెయిన్ లేకపోయినా దాని బాధ, దాని రిస్క్ దానిదే కదా! అలాగే ఆదివారం పూట కోడి కూర తిందామని మీరు మటన్ షాపుకెళ్తే అక్కడ బోన్లో వేలాడదీసిన జీవాల భవిష్యత్ కన్నా మీ భవిష్యత్ ఏపాటి గొప్పది? ఈ అనంత విశ్వంలో నువ్వూ, నేనొక్కడిని మాత్రమే కాదు.. ఆంధ్రా, తెలంగాణ, చంద్రబాబు, జగన్, కెసీఆర్, మోదీ మాత్రమే కాదు.. కమ్మ, కాపు, రెడ్డి మాత్రమే కాదు.. హిందూ, ముస్లిం మాత్రమే కాదు.. తెలుగు, తమిళ్ వాళ్లు మాత్రమే కాదు, ఇండియా ఒక్కటే కాదు, భూమి ఒక్కటే కాదు.. ఇలా మన పరిధిని విస్తరించుకుంటూ పోతే అనంత విశ్వ తత్వం అర్థమవుతుంది.
ఒక మనిషి తన స్వంత శారీరక, మానసిక సమస్యలు చాలవన్నట్లు రోజూ పేపర్లలో, టివిల్లో చూసే అన్ని నెగిటివ్ వార్తలు, రాజకీయ నాయకులు తిట్టుకునే బూతులు చూసి ఆవేశపడిపోవడం, బాధపడిపోవడం చేస్తుంటారు. ఇలా మన ఫోకస్ మొత్తాన్నీ కొన్ని అంశాల్లోకి narrowగా మార్చుకుంటూ వెళ్లడం వల్ల మీ మైండ్ మానసిక ఒత్తిడికి గురై, మీ శరీరంలో కార్టిజోల్ హార్మోన్ విడుదలై ఆకలి వేయకపోవడం దగ్గర నుండి, క్రియేటివ్‌గా లేకపోవడం దగ్గర నుండి, ప్రొడక్టివిటీ తగ్గిపోయి, మీ పనితీరు తగ్గిపోయి కెరీర్లో మెరుగైన స్థానాలకి వెళ్లలేకపోవడం దగ్గర్నుండి ఎన్నో గొప్ప మార్పులకు కేవలం ఇలాంటి కంటెంట్‌ని, యూట్యూబ్ వీడియోలను నిరంతరం కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా మారతారు.
ఈ టివి ఛానెళ్లకి గానీ, ఈ న్యూస్ పేపర్లకి గానీ, యూట్యూబ్ ఛానెళ్లకి గానీ, ఫేస్బుక్లో ఎమోషన్లలో కొట్టుకుపోయే మీరు ఫాలో అయ్యే వ్యక్తులకి గానీ.. మీ మానసిక ఆరోగ్యాన్ని చెడగొట్టే హక్కు లేదు. మీ జీవితం మీది, మీ ఆలోచనలను మెరుగ్గా ఉంచుకోగలిగిన బాధ్యత మీ మీద ఉంది? ఎందుకు ప్రవాహంలో కొట్టుకుపోయి మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని narrow focusతో దెబ్బతీసుకుంటూ శరీరం మొత్తాన్నీ విషతుల్యం చేసుకుంటారు. ఒక్క మాటలో చెబుతాను వినండి.. బయట ఓ విషపు పురుగు ఉంటుంది, రాజకీయాల్లో గానీ, సమాజంలో గానీ! ఆ విషపు పురుగు గురించి, ఆ విషపు పురుగుని భరిస్తున్న సమాజం గురించి భయపడుతున్నంత కాలం, బాధపడుతున్నంత కాలం మీ శరీరాన్ని మీరు విషంగా తయారు చేసుకుంటారు.
అందుకే మీ శారీరక బాధలు, నొప్పుల నుండి గానీ, మీ ఇంట్లో జరిగే గొడవలు, ఆఫీస్ గొడవలు వంటి మీ మానసిక సమస్యల నుండి గానీ, బయట సమాజంలోని పనికిమాలిన విషయాల నుండి గానీ మీ ఇరుకైన ఫోకస్ మొత్తాన్నీ వెంటనే విస్తరించుకుని విశ్వం స్థాయిలోకి ఆలోచన మళ్లించండి. ఆఫ్టరాల్ ఈ విశ్వంలో మనమెంత, మన బాధలు, మన సమస్యలు ఎంత? అలా మార్చుకున్న వెంటనే, ఇంతకుముందు నేను సైంటిఫిక్‌గా చెప్పినట్లు మీ బ్రెయిన్లో బీటా ఫ్రీక్వెన్సీ తరంగాల నుండి చాలా రిలాక్స్డ్గా ఉండే ఆల్ఫా ఫ్రీక్వెన్సీ తరంగాలు మొదలవుతాయి. జీవితం చాలా సంతృప్తిగా ఉంటుంది, ఆ రిలాక్స్డ్ మోడ్‌లో మీరు బాగా పనిచెయ్యగలుగుతారు. జీవితంలో బాగా ఎదగగలుగుతారు. అందర్నీ ప్రేమించగలుగుతారు. మనుషులు మీకు దగ్గరవుతారు. అప్పుడు జీవితం భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా అన్పిస్తుంది.
మరో భాగంతో మళ్ళీ కలుస్తాను.
- Sridhar Nallamothu