మనం ఈ క్షణం జీవిస్తున్నామంటే.. జీవించాలన్న ఆశ చాలా బలంగా ఉంది అంటే.. ఏదో సాధించాలనుకుంటున్నాం అంటే.. ఇంకేవేవో కోరికలు ఉన్నాయనుకుంటే.. మనల్ని మోటివేట్ చేసే బేసిక్ అవసరాలు చాలానే ఉంటాయి..
"నువ్వు ఈ పని ఎందుకు చేస్తున్నావు" అని అడిగితే చాలామంది "నాకు చేయాలన్పించింది.. చేస్తున్నా.. స్పెసిఫిక్ రీజన్స్ ఏముంటాయి.." అంటూ భుజాలెగరేస్తారు.. వాస్తవానికి మనం చేసే ప్రతీ పనీ, మనల్ని మోటివేట్ చేసే ప్రతీ అంశం ఈ క్రింది అవసరాల mixtureగా రూపం సంతరించుకుంటుంది.
1. భౌతికపరమైన అవసరాలు ఇవి:
గాలి, నీరు, ఆహారం, సెక్స్, నిద్ర, అంతర్గత అవయువాలు, జీవక్రియలు అన్నీ సక్రమంగా పనిచేసే పరిస్థితులు, శారీరక, మానసిక దారుఢ్యం
పైన చెప్పిన ప్రతీ అవసరమూ చాలా ముఖ్యమైనది. కానీ మన లైఫ్ స్టైల్లో ఆ అవసరాల్లో నిద్ర, ఫుడ్ వంటి కొన్నింటిని చాలావరకూ ignore చేస్తుంటాము. తీర్చబడలేని ఏ శారీరక అవసరమైనా అటు మన శరీరంపైనా ఇటు మన ఆలోచనా విధానంపైనా ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.
ఉదా.కు… నిద్ర సరిపోకపోతే చాలా చిరాకుగా ఉంటుంది ఎవరికైనా. ఇలాంటి విషయాలు రాయాలంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉండాలి. కానీ నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నానంటే నిద్ర అనే నా అవసరాన్ని మెడిటేషన్ తీరుస్తోంది. సో నాకు ప్రశాంతత లభిస్తోంది. అలాగే ఫుడ్ లేని వ్యక్తీ, శరీరంలో మెటబాలిక్ రేట్ అపసవ్యంగా ఉన్న వ్యక్తులూ ఎప్పుడూ అసహనంగానే ఉంటారు.
తీరడానికి అవకాశం లేని భౌతికపరమైన అవసరాల్ని వేరే మానసికమైన అవసరాలతో substitute చేసుకుంటూ మనం లైఫ్ లీడ్ చేస్తాం. ఉదా.కు.. సెక్సువల్ డిజైర్ ఉండీ.. బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేస్తున్న వ్యక్తి తన భౌతికమైన కోరికల్ని తాత్కాలికంగా కెరీర్ లక్ష్యాల వైపు దృష్టి మళ్లించడం ద్వారానో, మరో విధంగానో సంతృప్తిపరుచుకుంటారు.
2. భద్రతాపరమైన అవసరాలు
పైన చెప్పుకున్న అత్యవసరాలు తీరిన వ్యక్తి తర్వాత ఆలోచించేది.. పై అత్యవసరాల్ని భవిష్యత్‌లోనూ సాధించి పెట్టే సేఫ్టీ అవసరాల మీద. మనకెలాంటి ఆపదా రాదు అనే భరోసా, ఆర్థిక పరమైన భరోసా, ఆరోగ్యపరమైన భరోసా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా తట్టుకురాగలగుతాం అనే నిశ్చింతా ప్రతీ మనిషికీ కావాలి. వీటిలో చాలా అవసరాలు తీరక మనలో చాలామంది అస్థిమితంగా ఉంటూ ఉంటారు. ఉదా.కు.. ఆర్థికపరమైన భరోసా లేని వ్యక్తి చాలా స్ట్రగుల్ అవుతుంటాడు… ఆర్థికపరమైన భరోసా అయినా, వ్యక్తిగతమైన నిశ్చింత అయినా వీటికి ఓ హద్దు ఉండదు. సో లైఫ్ ఈజీగా, హాపీగా గడుస్తుందనుకున్నా కొంతమంది మరింత డబ్బు సంపాదించడానికి ఉవ్విళూరుతుంటారు. కొందరు ఏది ఎంతవరకూ అవసరమో సరిగ్గా జడ్జ్ చేసుకోగలుగుతారు.
ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే.. శారీరక అవసరాలకు భిన్నంగా ఈ 2వ పాయింట్లో చెప్పుకున్న సేప్టీ అవసరాలకు ఓ స్పెషల్ నేచర్ ఉంది. అదేంటంటే.. ఈ అవసరాలు లైఫ్‌లో ఒక స్థాయిలో తీరని వ్యక్తి లైఫ్‌లో మరో దశలో ఇవే అవసరాలు తీరే అవకాశం దొరికినప్పుడు panicగా అవసరానికి మించి వీటిని తీర్చుకుంటాడు. ఉదా.కు.. ఒకప్పుడు డబ్బు లేక బాధపడిన వ్యక్తి విపరీతంగా డబ్బు సంపాదించడం, ఆరోగ్యం బాగాలేని వ్యక్తి ప్రతీ చిన్న విషయానికీ చాలా కేర్ తీసుకోవడం, యాక్సిడెంట్ అయిన వ్యక్తి రోడ్ మీద చాలా కేర్ తీసుకోవడం ఇలా..
3. ప్రేమ, దగ్గరితనం
"నాకు నేనే" అనుకోవడంలో కన్నా "నేను ఫలానా వారి కోసం బ్రతుకుతున్నాను" అనే ఫీలింగ్ ప్రతీ మనిషికీ చాలా అవసరం. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు "ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి" అంటారు.. ప్రేమించిన అమ్మాయి మాట్లాడకపోతే "ఇంక బ్రతికేం లాభం" అని ఫిక్సయిపోతారు :), ఫ్రెండ్ మాట్లాడకపోతే ఇక లైఫ్‌లో ఎవరితో స్నేహం చెయ్యకూడదు అన్పించినా.. "ఫ్రెండ్స్ ఎవరూ లేని ఈ లైఫ్ వృధా" అని మనస్సులో నిస్సారంగా బాధపడిపోతుంటారు.
ఇక్కడ కేవలం వ్యక్తులతోనే కాదు మనం అటాచ్మెంట్ పెంచుకునేది. గ్రూపులతోనూ మనం అటాచ్‌మెంచ్ పెంచుకుంటాం. అనేకమంది మనుషులు చేసే కలెక్టివ్ పనులతోనూ అటాచ్ అవుతాం.
ఇక్కడ ఓ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను.. అందరూ కోల్పోయిన ఓ వ్యక్తి అనాధలకు సేవ చేయాలనుకోవడం చాలా కామన్ నేచర్ కదా…?
అలాగే ఎందుకు ఆలోచిస్తారు అంటే.. మనుషులు దూరమైనా.. మనుషులపై నమ్మకాలు పోయినా.. మనం బ్రతకడానికి అవసరం అయిన "ప్రేమ, దగ్గరితనం" కూడా కోల్పోతాం కాబట్టి.. మనం వీలైనంత త్వరగా మన అవసరాల్ని తీర్చుకోవాలి. అలా తీర్చుకోవడానికి ఇలాంటి అనాధాశ్రమాలూ, సోషల్ సర్వీస్ ఏక్టివిటీల వంటి గ్రూపులకు మానసికంగా దగ్గరవుతాం.
"ఫేస్బుక్ లాంటి వెబ్ సైట్లో ఓ 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు" అనే ఓ ఆలోచన కూడా మనల్ని సెక్యూర్డ్‌గా ఉంచుతుంది. చివరకు మనం ఒంటరిగా ఉన్నాం అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మనకు అన్ కండిషనల్‌గా వచ్చే ఒక్క like అయినా చాలా జీవం పోస్తుంది. అందుకే ఫేస్బుక్ లాంటివి ఎంతగా మానసిక రోగుల్ని తయారు చేస్తున్నా.. ఆ రోగులకు మందుగా కూడా పనిచేస్తుంటుంది ఒక్కోసారి. అది వేరే టాపిక్ అనుకోండి.. ఎప్పుడైనా మాట్లాడతాను.
మిగతా అవసరాల గురించీ, ఈ అవసరాలన్నీ కలిపి మనల్ని ఏ దిశకు తీసుకు వెళ్తాయన్నదీ ఇంకో updateలో వివరిస్తాను.
ధన్యవాదాలు
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply