మాస్ హిస్టీరియా.. ఓ సోషల్ సైకలాజికల్ డిజార్డర్… చాలాకాలంగా జనాల్ని ఊగిపోయేలా చేస్తోంది..
ఎక్కడో ఏదో సంఘటన జరుగుతుంది.. ఆ సంఘటన నేపధ్యంగా ప్రతీ ఒక్కరి మనస్సులో ఆలోచనలు ముప్పిరిగొంటాయి.. తన స్వంత ఆలోచనకు మీడియా విశ్లేషణలూ, పక్కోడి ఆలోచనా, Facebook వంటి సోషల్ సైట్లలో హాహాకారాలూ అన్నీ తోడైపోతాయి.
భయం కమ్ముకుంటుంది.. బ్రతుకుపై బెంగ మొదలవుతుంది.. లేని మానవత్వం గుర్తొస్తుంది.. అక్షరాల్లో ఒలికిపోతుంది.. అందరం కాసేపు మదర్ థెరిస్సా ప్రతినిధులమైపోతాం.. తుఫానప్పుడు చెట్లన్నీ మొదళ్లతో సహా ఊగిపోతాయో మనుషులంతా నిలువెల్లా ఆవేదనతోనూ, ఉద్వేగంతోనూ ఊగిపోతుంటారు.
అంతలో ఆ సంఘటన పాతబడిపోతుంది.. కొన్ని గంటలు మళ్లీ ప్రశాంతంగా గడుస్తాయి. ఊపిరి పీల్చుకునేటంతలోనే ఎక్కడో, ఎవరికో మరేదో జరిగిపోతుంది… ఏ ప్రకృతి విపత్తో మళ్లీ అందరి ఆలోచనల్నీ హైజాక్ చేస్తుంది.
కొన్నేళ్ల నుండి మీ ఆలోచనలు క్షుణ్ణంగా గమనించండి.. ఎంత panicగా తయారవుతున్నారో?
—————————-
మానవత్వం ఉందని నిరూపించుకోవడానికి ఇంకేం మిగల్లేదా.. ఇలాంటి సొసైటీలోని ప్రతీ దానికీ ఓవర్‌గా రెస్పాండ్ అయి ఊగిపోవడం తప్పించి? మనం రెస్పాండ్ అవకపోతే మనుషులం కానట్లా? ఎంత ఎమోషనలైజ్ అయితే అంత గొప్ప అనే తీరు ఎంత హిస్టీరిక్ స్థితికి తీసుకెళ్తోందో అర్థమవుతోందా?
సమాజం పట్ల బాధ్యత ఉండాలి. బాధ్యతంటే సొసైటీలో జరిగే ప్రతీ దాని గురించీ బాధపడిపోవడం కాదు. అందరూ ఏడ్చే వాళ్లే. ఏడ్వడం వల్ల సమస్య తీరిపోతుందా? సొసైటీకి బాధపడే వాళ్లూ, ఏడ్చేవాళ్లు ఎందుకు..? చక్కగా ప్రవర్తించే వారూ, చక్కదిద్దే వారూ కావాలి గానీ?
అయినా ఏడ్చీ ఏడ్చీ చిరాకు రావట్లేదా.. ఎన్నాళ్లని ఏడుస్తారు.. లేని భయాలన్నీ ఊహించేసుకుని? నవ్వడం అంటూ ఒకటుందని తెలీదా?
—————————-
ప్రతీరోజూ ఏదో ఇష్యూ… ఎవరూ ప్రశాంతంగా పనులు చేసుకోరు.. ఆ ఇష్యూ గురించే ఆలోచించడం. దానివల్ల కొన్ని కోట్ల గంటల man hours నష్టం జరుగుతుంటుంది. ఒక్కో man hour ఎంత విలువైనదో ఓ కాస్ట్ అకౌంటెంట్‌గా నాకు తెలుసు. కానీ మనం చేయాల్సిన పనులూ, సొసైటీకి అందించాల్సిన ప్రొడక్టివిటీ పక్కన పడేసి.. గుంపులో గోవిందల్లా టైమ్‌పాస్ చేసేస్తుంటాం.. మానవత్వం పేరుతో!! ఇక్కడ నేను మాట్లాడే మాటల్లో కఠినమైన వాస్తవం ఉంది తప్పించి.. ఎవరి పట్లా ద్వేషం లేదు గమనించగలరు.
—————-
అన్నింటికన్నా ముఖ్యంగా జనాలు ముడుచుకుపోతున్నారు… లోపల్లోపలికి.. భయాల మధ్య, అభద్రతల మధ్యా!! అన్నీ తమకే జరిగిపోతాయేమో అనేసుకుంటున్నారు.. ఈ మాస్ హిస్టీరియా మూలంగా! రుజువు కావాలంటే.. చిరునవ్వులతో విప్పార్చుకోవాల్సిన ఆ పెదాల చుట్టూ చూడండి.. ఎన్ని ముడతలు చేరిపోతున్నాయో.. హాయిగా వెలిగిపోవాల్సిన ఆ కళ్ల చుట్టూ ఎన్ని నల్లటి వలయాలు కమ్మేసుకుంటున్నాయో!!
బ్రతుకంటే వాస్తవంలో బ్రతికాల్సింది. భ్రమల్లోనో, భయాల్లోనో దాన్ని ముగించేస్తే పిచ్చాసుపత్రిలో ఉన్న పేషెంట్‌కీ మనకూ తేడానే లేదు… అక్కడ గోడలుంటాయి.. ఇక్కడ ఉండవంతే!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply