వ్యవస్థలూ, విలువల పతనం మన జీవితాల్ని ఎంత దారుణంగా ప్రభావితం చెయ్యబోతున్నాయో అర్థం చేసుకోలేని అమాయకత్వం మనది!
ఎవరికి వాళ్లం చాలా సేఫ్ జోన్లో ఉన్నామనుకుంటున్నాం… సమస్యలు మనల్ని ముంచెత్తనంత వరకూ ఆ ధీమా సహజంగానే అందరికీ ఉంటుంది..
పదేళ్ల క్రితం వరకూ మనుషుల్లో బాధ్యతా, చిత్తశుద్ధీ ఎంతో కొంత ఉండేవి.. కష్టాన్ని నమ్ముకునే వాళ్లు… వచ్చిన డబ్బు కాస్తయినా చాలా సంతృప్తిగా ఉండే వాళ్లు. కానీ గత దశాబ్దకాలంగా డబ్బు యావా, విలువల పతనం చాలా ఎక్కువైంది.
చిన్న ఉదాహరణే తీసుకుంటే, ఆటో మీటర్ తప్పుగా ఉందని అనుమానం వస్తే RTAకి కంప్లయింట్ చేస్తామని ఆటో నెంబర్ నోట్ చేసుకుంటుంటే.. ఆటోవాళ్లు భయపడేవాళ్లు.. ఇప్పుడు అలాంటి భయాలు ఆటో వాళ్లకు కాదు కదా, కష్టపడి సంపాదించుకుని మాత్రమే బ్రతకాల్సిన ఏ మనిషికీ లేవు.
అందిన కాడికి ఎదుటి మనిషి నుండి దోచుకోవడమే.
ఈరోజు మనలో చాలామందిమి ప్రభుత్వాల్ని ఎడాపెడా తిట్టేస్తున్నాం… కానీ మనకు కూడుపెట్టే జాబ్ సిన్సియర్‌గా చేస్తున్నామో లేదో ఒక్కసారి క్వశ్చన్ మాత్రం చేసుకోం. మనం బాధ్యతగా ఉండకపోవడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతున్నా మనకు చీమకుట్టినట్లు ఉండదు… కానీ దేశం
మాత్రం చాలా బాగుండాలి అన్న అక్రోశాలు.
————————————————-
ఎవరి పని వాళ్లు సిన్సియర్‌గా చెయ్యడానికే.. సిస్టమ్స్, ఆర్గనైజేషన్స్, అధికార వికేంద్రీకరణా, కంప్లయింట్ సిస్టమ్, టెర్మినేషన్ వంటివి మనం పెట్టుకున్నాం..
కానీ ఈరోజు మనలో జవాబుదారీతనం లోపిస్తోంది… “నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేసేది.. నాకిష్టమైతే పనిచేస్తాను లేకపోతే లేదు.. ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో” అనే నిర్లక్ష్యం నరనరానా వంటబడుతోంది.
———————
చాలా తక్కువ కష్టపడాలి.. చాలా ఎక్కువ సంపాదించాలి!
కష్టం అనేది సంపాదనకు మాత్రమే అన్న ఓ బలమైన అభిప్రాయంలో సమాజం మొత్తాన్నీ మౌల్డ్ చేస్తున్నాం. సో సంపాదన మీద మాత్రమే దృష్టి ఉన్న వాడు ఆటోమేటిక్‌గా పని మీద శ్రద్ధ తగ్గిస్తాడు.
————————
భారతదేశం కర్మభూమి… పనులు చెయ్యడంలోనే ఆనందం వెదుక్కునే భూమి కాస్తా పనులు ఎగవెయ్యడం వైపూ, బద్ధకంగా రోజులు గడిపేయడం వైపూ అడుగులు వేస్తోంది. ఉత్పాదకతను తగ్గుతోంది, నాలెడ్జ్ పట్ల ఆసక్తి తగ్గుతోందీ, జవాబుదారీ తనం తగ్గుతోందీ, మనిషికీ మనిషికీ మధ్య ఉన్న
సున్నితమైన కమ్యూనికేషనూ, జవాబుదారీతనమూ మిస్ అవుతోంది.
——————————–
ఈరోజు ఆర్థిక వ్యవస్థ పతనాన్ని జోకులేసుకుని మరీ చెప్పుకుంటున్నాం…. కానీ మున్ముందు రోజుల్లో అన్ని సిస్టమ్స్, వేల్యూస్ ఫెయిల్యూర్ వల్ల ఏర్పడే ఉపద్రవాల్ని ఎదుర్కొనేటప్పుడు కనీసం జోక్లేసుకునే ఫీల్ కూడా మనస్సులో పుట్టనంత సమస్యల్లో కూరుకుపోతాం.
దేశాన్నీ, సమాజాన్నీ బాగు చెయ్యాలంటే… మనం గొప్ప గొప్పగా మాట్లాడితే సరిపోదు.. మానవ సేవే మాధవ సేవ అని నమ్మే భూమిలో మనకు మనం అలాంటి విలువలు పాటిస్తూ ఎంతో కొంత బ్రతకాల్సిందే.
ఈరోజు విలువలతో ఎవరు బ్రతకగలం.. అని ఓ వెర్రి నిట్టూర్పుతో సరిపెట్టడం మనకు అలవాటైంది… ఏరోజు ఉంటామో పోతామో తెలీని బ్రతుకుల్లో కూడా ఉన్న కొన్నాళ్లూ విలువలు పాటించలేని మేధావులం, ఆదర్శమూర్తులం అయినందుకు సిగ్గుపడాలి!
– నల్లమోతు శ్రీధర్
డబ్బుకు విలువ పెరిగి విలువలు (మానవతావిలువలు) తగ్గుతున్నమాట నిజం. ప్రస్తుత జనరేషన్ తీరును చక్కగా వివరించారు. మనం విలువలతో బ్రతకడమే కాదు వాటికోసం పోరాడాలి. మొత్తం వ్యవస్థలో డబ్బు మాయను చేధించే చైతన్యం నింపడం ద్వారా సామూహికంగా సంఘ్టితంగా సమాజమార్పుకు కృషి చేయాలి