గుళ్లో దీపాలూ, గుడిగంటలూ, అల్లంత దూరం నుండి పలకరించే అగరొత్తులూ… గుడంతా సందడిగా ఉంది….
ఖరీదైన పట్టు వస్త్రాల ఆర్భాటాలూ సహజనైజం కొద్దీ నలుదిక్కులా సిరిని కొలతేసే చూపులతో చూసేస్తూ… మధ్యలో భగవత్ స్వరూపానికి కళ్లనూ… కష్టంగానైనా మనస్సునూ మళ్లించే ప్రయత్నం చేస్తున్నాయి..
ఎలాగైతేనేమి… మంత్రోచ్ఛారణలను అనుసరిస్తూ కళ్లూ, అంతఃదృష్టీ, మనస్సూ… మూర్తి స్వరూపంపై లగ్నమైంది…
భగవంతుడు వెన్నంటే ఉన్నాడన్న భరోసా… మనస్సుని తేలిక చేసేసింది… అన్నింటికీ మించి ఇప్పుడు అనుభవిస్తున్న భోగభాగ్యాలకు ఏ ఢోకా లేదన్న ధీమా… లేదా ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు గట్టెక్కుతాయన్న కొండంత భరోసా…. మెల్లగా కళ్లు మసకబారుతున్నాయి… మనస్సు దిటవు చెందుతోంది….
కొబ్బరి సగం చిప్ప తీసేసుకుని… గుడి ఆవరణలో కూర్చుని ముక్కలు తింటూ…. "ఎంత ప్రశాంతత…" అని మురిసిపోతూ… మెల్లగా మళ్లీ గందరగోళంలోకి వెనుదిరగడమవుతుంది…. 🙂
గుడి దాటేటప్పుడు… గోడలపై "మానవసేవే మాధవ సేవ" లైన్‌ని చదివేసి.. ఆ పక్కనే భిక్షమొత్తుకునే వాళ్లకు ఓ నాణెం ఇచ్చేసి ముందుకు కదలడంలో మరో చిన్న సంతృప్తి…. 🙂
——————————————————————————————————————-
గుడీ, పూజలూ, అభిషేకాలూ, పాపభీతీ, కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఉన్నంత వరకూ మనుష్య జాతి ఉనికిని పెద్దగా ప్రమాదం లేదు.. ఒక్క గుడి అనే కాదు… ఛర్చి, మసీదులనూ పవిత్ర భక్తితో నమ్మే జనాభా ఉన్నంత కాలమూ మనిషి నిర్భయంగా బ్రతికేయొచ్చు…
పురాణాలూ, ఇతిహాసాలూ, చరిత్రలూ, కధలూ, కల్పనలూ.. ఎన్ని ఉన్నా…. ఏ మతం ఎంత గొప్పదైనా… బేసిక్‌గా "మతం" అనేది మనుషుల్ని కలిపి ఉంచేది…. సత్కర్మలకు ప్రేరేపిస్తూ… మంచి ఆలోచనలతో మనుషుల్ని ప్రశాంతంగా ఉండనీయడానికి సృష్టించబడింది…
మతాలను మనుషులు సుదీర్ఘకాలం నమ్మలేరు కాబట్టి… మతాలూ, వాటి నీతి సూత్రాలూ ఏదో ఒక రూపంలో సామాన్యుడు కూడా తరాల తరబడి అనుసరించడం కోసం పండగలు, వ్రతాలూ, మాస పారాయణాలూ… ఇలా మంచి గుణాలను బట్టీ పెట్టించే అనేక ఏర్పాట్లు చేయబడ్డాయి….
ఈరోజు టివి ఛానెళ్లు…. మూఢ నమ్మకాలు అని చాలా వాటిని కొట్టి పారేస్తున్నాయి…. కావచ్చు… చాలావరకూ మనం నమ్మేవి మూఢ నమ్మకాలు కావచ్చు…. కానీ ఇలా కొట్టిపారేసే వాళ్లం… విస్మరిస్తున్న ఓ నగ్నసత్యం మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావాన్ని చూపించకపోదు… ఆ సత్యం ఏమిటంటే…. మూఢ నమ్మకాల వల్ల కావచ్చు, ఇంకోటి ఇంకోటి వల్ల కావచ్చు.. పాప భీతి వల్ల కావచ్చు… ఎన్నో నమ్మకాల వల్లనే కొన్ని యుగాల పాటు మనుష్య జాతి గతి తప్పకుండా మనుగడ సాగిస్తూ వస్తోంది…..
ఇవన్నీ మూఢ నమ్మకాలు అని తేల్చేసే మేధావి వర్గం…. మనుషుల్లో మానవత్వాన్ని పెంచే చర్యలు తీసుకోపోతే…. మనుషుల్లో ద్వేషం తప్ప ఇంకోటి లేదు అనే విధంగా నెగిటివ్ వార్తా కధనాలతో సంచలనాలతో తమ స్వార్థం తాము చూసుకుంటూ పోతే…. మనుష్య జాతి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.
నేను నా పక్క వ్యక్తి తల నరకకుండా కాపాడుతున్నది…. నేను నమ్ముతున్న కర్మసిద్ధాంతమే….!
అలాగే నేను నా పక్క వ్యక్తికి అన్యాయం చేయకుండా ఆగిపోతున్నది… ఎంతో కొంత నాకు ఇలాంటిదే ఏదో అన్యాయం భవిష్యత్‌లో ఎదురవుతుందేమో అన్న భయమే….
ఇక్కడ నా సంగతి అని కాదు.. జస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పాను…
కర్మసిద్ధాంతం ఓ మూఢ నమ్మకం అని తేల్చేసిన రోజున ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకునే పక్క వ్యక్తికి అన్యాయం చేయకుండా ఆగిపోతున్న మనిషి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం మొదలెడతాడు… కొద్దిగా కోపానికే కత్తి తీసి నరికేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
మనుషుల నమ్మకాలను కొట్టి పారేసినంత సులభం కాదు… వారి మధ్య రిలేషన్లని బలోపేతం చేయడం!!
సమాజం మొత్తాన్నీ ఆప్యాయంగా, ఆత్మీయంగా కలిసి ఉండేలా కట్టిపారేసే ఓ ప్రత్యామ్నాయ పాజిటివ్ ఆలోచనల వ్యవస్థని చూపించలేనంత కాలమూ మత విశ్వాసాలనూ, మూఢ నమ్మకాలనూ.. వగైరా వగైరాలను ఖండించే అర్హత లేదు… కారణం పండితుడైనా, పామరుడైనా అలాంటి ఏదో ఒక నమ్మకం కొద్దీనే పక్క మనిషికి హాని చేయకుండా తన బ్రతుకు తాను బ్రతుకుతున్నది…..
అవన్నీ వట్టిదే కావచ్చు… కానీ ఓ హార్మోనీలో సాగుతున్న సమాజాన్ని చైతన్యం చేస్తున్న పేరుతో… వారి మధ్య హార్మోనీ కుదిలే పాజిటివ్ ఎనర్జీని అస్సలు చూపించకుండా, మాట్లాడకుండా…. ఉన్న నమ్మకాలనూ, హార్మోనీనీ పోగొట్టడం సమాజానికి పూడ్చలేని అన్యాయమే చేసినట్లవుతుంది…
………………………………………….
ఐతే మనుషుల్లో ఒక్క పెట్టున మెచ్యూరిటీ అన్నా రావాలి… ఆ మెచ్యూరిటీలో కూడా మతం నిజం కాదని నమ్ముతూ కూడా తోటి మనిషిని ప్రేమించే, సాయపడే స్వభావాన్ని కలిగి ఉండాలి… లేదా మనుషులు అమాయకత్వంలోనైనా మంచితో కూడిన నమ్మకాలను నమ్ముతూ పోవాలి… అప్పుడే మంచి సమాజం నిలదొక్కుకోగలుగుతుంది…
గమనిక: ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
బాగా వ్రాసారండి. కాని టపా యొక్క హెడ్డింగ్ సరిగా లేదనిపిస్తోంది. “మూఢ నమ్మకాలు” బదులు “నమ్మకాలు” అనడం సబబేమో. ఎందుకంటే నమ్మకాలు మూఢo ఐనప్పుడు కొట్టిపారేయడం కరెక్టే అవుతుంది.
పొరపాటు పడుతున్నాను. కర్మ సిధ్ధాంతం “ఇప్పుడు మీరు చేయబోయే పాపాలకు తరువాతి జన్మలో ఫలితాన్ననుభవించాల్సుంటుంది” అని చెప్పడంకన్నా “మీరు ఎప్పుడో చేసిన పాపాలకు ఇప్పుడు అనుభవిస్తున్నారు” అని చెప్పి వారిమీద జరుగుతున్న దోపిడీని rationalize చెయ్యడానికి ఉద్దేశ్యించింది. ఇది కష్టపడి పరిస్థితులను మార్చుకోగలగడం అన్న ప్రత్యామ్నాయాన్ని నాశనం చేయడానికి, పరిస్థితులతో రాజీపడడానికి ఉద్దేశ్యించబడిన సిధ్ధాంతం. నేరాలను ఆపుతున్నాది కర్మ సిధ్ధాంతంకాదు. చట్టమూ, అది విధించే శిక్షలుమాత్రమే. చట్టం పూర్తిగా విఫలమయిననాడు ఏ కర్మ సిధ్ధాంతమూ మనలను రక్షించలేదు.
మతం నిజంగా శాంతిని బోధించేదే ఐతే మరి ఈ బాంబులెందుకు పేలాయంటారు? బాబరీ ఎందుకు కూలిందంటారు? క్రూసేడులెందుకు జరిగాయంటారు? క్రైస్తవుడికి, మహమ్మదీయులంటే ద్వేషం. మహమ్మదీయులకి హిందువులంటే ద్వేషం. హిందువులకి క్రైస్తవులూ, మహమ్మదీయులంటే ద్వేషం. మతం విస్తృతి గుళ్ళలో జరిగే శాంతియుత కార్యక్రమాలకే పరిమితంచేసిచూస్తున్నారు. మతాలు తమను అనుసరించేవారికి మాత్రమే శాంతిని, సౌభ్రాతృత్వాన్నీ promise చేస్తాయి. తమ పాలక వ్యవస్థలను స్థాపించాలన్న అంతిమలక్ష్యంతో అవి పనిచేస్తాయి. అలా ఇవి పొరుగు వ్యవస్థలతో విభేదించి చివరకు మేలుకన్నా కీడే ఎక్కువ తలపెడతాయి. తలపెట్టాయి.
మత గ్రంధాల్లో ఉన్నంత perverted lives మనం జీవించడంలేదు. మన నైతిక విలువలకు మతాలు మూలంకాదు. నిజానికి వాటి మూలాలు మతాలకన్నా పాతవి.
శ్రీధర్ గారు, బాగా చెప్పారు. మూఢ నమ్మకాలు అనటం కంటే విశ్వాసాలు అనటం సబబెమో.
Apple garu,
కర్మ సిధ్ధాంతం కష్టపడే స్వభావాన్ని పెంపొందిచదు అనేది కరెక్ట్ కాదనుకొంటాను. దాన్ని విశ్వసించటం వల్ల వారికి ఏదొ చెడు జరుగుతుంది అని అనుకొవద్దు.