పెళ్లి ఊరేగింపు ముందు దిక్కులు పిక్కటిల్లేలా ఆర్కెస్ట్రా.. ఆ శబ్ధంలో ఒళ్లంతా మరిచిపోయి ఊగిపోయే జనాలు..!
అర్థరాత్రి రోడ్ మీద కంట్రోల్ లేని స్పీడ్తో బైక్ డ్రైవింగ్.. అదీ చేతులు విడిచేసి.. గొంతు పోయేలా అరుపులు..
సినిమా థియేటర్లో హీరో పంచ్ డైలాగులకి మైమరిచిపోయి ఒకటే ఈలలు..
సిట్యుయేషన్ ఏదైనా అన్నింటికీ కారణం అడ్రెనలైన్ హార్మోన్… ఏదో ఎగ్జయిట్మెంట్, ఏదో ఎంజాయ్ చేసేయాలన్న తపన.. మనస్సులో తెలీని అసంతృప్తిని అధిగమించి ఏదొకటి చేసేయాలనే కోరిక.
నిన్ను నువ్వు మర్చిపోవాలి.. అదే నీకు కావాలి. అది తన్మయత్వం అవ్వనీయి.. ఇంకోటి అవ్వనీయి.. నీకు నువ్వు గుర్తు రాకూడదు. నీ బాధలు, నీ భయాలు, నీ చదువు, నీ ఉద్యోగం, నీ ఇన్సెక్యూరిటీ, నీ ఆర్థిక సమస్యలు ఏమీ కాసేపు గుర్తు రాకూడదు.
చుట్టూ ఉన్న మామూలు శబ్ధం రియాలిటీ అయితే, ఆ శబ్ధాన్ని డామినేట్ చేసేలా భారీ శబ్ధంతో పాటలు వినాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి.. అప్పుడు రియాలిటీ కనుమరుగైపోయి ఎగ్జయిట్మెంట్ వస్తుంది. వినాయక చవితి వస్తోంది కదా గమనించండి. ఊరేగింపులో పెద్ద శబ్ధంతో మైక్ ముందు డ్యాన్స్ వేసిన జనాలు ఒక్కసారిగా మైక్ ఆగిపోతే డ్యాన్స్ ఆపేస్తారు. రియాలిటీని మర్చిపోవడానికి రియాలిటీ కన్నా ఎక్కువ శబ్ధం కావాలన్నది దీని ద్వారా అర్థమయ్యే ఉంటుంది.
చుట్టూ ఉండే మనుషులు చిన్నగా కనిపిస్తుంటే, థియేటర్లో భారీ స్క్రీన్ మీద మనుషుల్ని పెద్ద పెద్దగా చూసి రియాలిటీని డామినేట్ చేసుకోవాలి. అప్పుడు ఎంజాయ్మెంట్ వస్తుంది.
నీ ఎగ్జయిట్మెంట్లో రియాలిటీ అంతా కొట్టుకుపోవాలి.. వాస్తవాన్ని మర్చిపోవాలనే ఓ బలమైన కోరిక నుండి పుట్టుకొస్తున్నవే ఇవన్నీ. నిన్ను నువ్వు ఇష్టపడడం మానేసినప్పుడే నీ మీద నీకు మళ్లీ కాన్ఫిడెన్స్ పెరగడానికి నీకు ఓ పండగ కావాలి.. ఓ సెలబ్రేషన్ కావాలి.. ఓ ఆశ కావాలి.. ఓ తోడు కావాలి.. ఓ జోష్ కావాలి.. అప్పుడే నీకు బతకడానికి ఓ కారణం దొరుకుతుంది.
భజనల్లో, ప్రార్థనల్లో నువ్వనుకుంటున్నది భక్తీ కాదు.. నువ్వు చేతులు విడిచేసి చేసే డ్రైవింగ్ ఎంజాయ్మెంటూ కాదు.. నువ్వు థియేటర్లో వేసే ఈలలు నీ అభిమానమూ కాదు. జస్ట్ రియాలిటీ నుండి నీ ఎస్కేపిజమంతే.
- Sridhar Nallamothu