ఇంతకు ముందు రాసినట్లు మనం చేసే ఆలోచనలను బట్టి మన శరీరంలోని కణాల స్థాయిలో ఒకదానితో మరొకటి బయోఫొటాన్స్ అనే కాంతి రూపంలో ఇచ్చిపుచ్చుకునే ఎనర్జీ మరియు సమాచారాన్ని బట్టి బయట మన శరీరం చుట్టూ లైట్ ఫీల్డ్ ఏర్పడుతుంది. దీనిని auraగా భావిస్తూ ఉంటాం.
ఇక్కడ ప్రధానంగా ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇంతకు ముందే చెప్పిన క్వాంటమ్ ఫిజిక్స్‌కి చెందిన వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ ప్రకారం మీరు ఒక మనిషి యొక్క, ఒక వస్తువు యొక్క, వివిధ ప్రదేశాల యొక్క భౌతిక రూపాన్ని చూసినంత కాలం ఆ మనిషి యొక్క వైబ్రేషన్, ఎనర్జీ ఫీల్డ్ మనకు తెలియకుండా పోతుంది. కారణం ఒకదాని మీద మన దృష్టి ఉన్నంతకాలం రెండోది మాయమవుతుంది. ఒక క్షణానికి ఒకటి మాత్రమే కన్పిస్తుంది.
చిన్న ఉదాహరణ చెబుతాను.. Nallamothu Sridhar అనే నేను మీ ముందు నిలబడ్డాను అనుకోండి. మీ దృష్టి అంతా నేను ఎలాంటి డ్రెస్ వేసుకున్నాను, ఎలా నవ్వుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నాను వంటి భౌతికమైన అంశాలమీద ఉన్నంత కాలం నేను మీతో కలిగిఉన్న అన్‌కండిషనల్ ప్రేమ మీకు అర్థం కాకుండా పోతుంది. ఎవరైతే భౌతిక విషయాలను పక్కన పెట్టి తాము కూడా unconditional లవ్ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఎదుటి వ్యక్తి మాట్లాడకపోయినా కూడా ఆ వ్యక్తి వైబ్రేషన్ అర్థమవుతుంది.
అంటే జ్ఞానేంద్రియాలు అయిన కళ్లు, చెవులు, ముక్కు వంటి వాటి ద్వారా మాత్రమే మనం ప్రపంచాన్ని అర్థం చేసుకున్నంత కాలం అవతలి వ్యక్తిలోని దైవిక గుణాలు అర్థం కావు. కారణం అవి మన సెన్సరీ ఆర్గాన్ అయి కళ్లకి ప్రత్యక్షంగా కనపడవు కాబట్టి! అంతెందుకు, ఇది చదివేటప్పుడు కూడా మీ కళ్లు అక్షరాల వెంట పరిగెడుతూ, ఆ సమాచారం ఆప్టిక్ నెర్వ్ ద్వారా మీ బ్రెయిన్‌లోకి చేరవేయబడి, మొదట టెంపోరల్ కార్టెక్ట్ నుండి ఆ సమాచారం ఫ్రాంటల్ లోబ్కి బదీలీ చెయ్యబడి అక్కడ ఫ్రాంటల్ లోబ్‌లో ఎడమవైపున ఉండే “బ్రోకా” అనే ప్రదేశం ద్వారా నేను రాసిన అక్షరాలు, అప్పటికే మీకు తెలుగు భాష మీద ఉన్న అవగాహన కొద్దీ డీకోడ్ చెయ్యబడి మీకు అర్థమవుతాయి. దానికి ప్రతిస్పందనగా మళ్లీ మీరు అదే భాషలోనో, మీకు తెలిసిన ఇతర భాషలోనో మాట్లాడడమూ జరుగుతుంది.
ఇంత వివరంగా ఎందుకు చెప్పానంటే కన్ను అనే ఓ జ్ఞానేంద్రియాన్ని నమ్ముకుని, అది సేకరించిన సమాచారాన్ని చదివి అర్థం చేసుకున్నంత మాత్రాన మీ ఆలోచనా దృక్పధం ఆ భౌతికమైన స్థాయిలోనే ఉంటుంది. అంటే “ఆయనేదో రాశాడు, నాకు ఆల్రెడీ ఇది తెలుసు అనో, ఇది తెలియదు చాలా బాగుంది” అనో మైండ్ స్థాయి ఆలోచనలు మాత్రమే మీకు కలుగుతాయి.
ఏ వ్యక్తి అయితే జ్ఞానేంద్రియాలకు ఆవల ఉన్న వైబ్రేషన్‌ని అర్థం చేసుకోవడం మొదలు పెడతాడో ఆ వ్యక్తి భౌతికమైన దేహం స్థాయిలో కుదించుకుపోయిన ఓ సామాన్య మనిషి స్థాయి నుండి మహాత్ముడిగా, దైవంగా మారడం మొదలుపెడతాడు. అంటే ఎక్కడ నేను రాసింది మీ కళ్ల ద్వారా చదివి అర్థం చేసుకోవటం స్థాయిలోనే భౌతిక రూపంలోనే మీ ఆలోచన ఉంటే వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ ప్రకారం నా వైబ్రేషన్ మీకు అర్థం కాదు. “జ్ఞానం ఇతరుల జీవితాల్ని వెలిగించాలన్న” నా ఆర్తి, మీ అందరి పట్ల నేను కలిగి ఉన్న అన్ కండిషనల్ లవ్ అర్థమయ్యే పరిస్థితి ఉండదు.
నా ఆర్తి అర్థం కాకపోగా, “అన్ కండిషనల్ లవ్” అని నేను రాసిన పదాన్ని చదివిన వెంటనే ఆ సెన్సరీ డేటా ఆధారంగా మీ మైండ్ మళ్లీ దాన్ని విశ్లేషించడం మొదలుపెడుతుంది. అంటే వైబ్రేషన్ తో అర్థం చేసుకోవలసిన నా ప్రేమని మీ లాజికల్ మైండ్ తో విశ్లేషించడం మొదలుపెడతారు. మీ మైండ్ వెంటనే ఛార్జ్ తీసుకుని, నా పట్ల మీకున్న అభిప్రాయాలను ఒకదాని తర్వాత మరొకటి బ్రెయిన్ లాంగ్ టర్మ్ మెమరీ డేటాబేస్ నుండి వెలికి తీసుకు రావడం మొదలుపెడుతుంది. Airtel, Reliance Jio వంటి సంస్థల్లో మీరు కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే వారు మీ మొబైల్ నెంబర్ని తమ డేటాబేస్‌లో సెర్చ్ క్వెరీగా రన్ చేసి, మీ ప్రొఫైల్‌ని అప్పటికప్పుడు ఎలా చూస్తారో మీ మైండ్ సృష్టించిన “Nallamothu Sridharని విశ్లేషిద్దాం” అనే ఆలోచనకి ప్రతిస్పందనగా మీ బ్రెయిన్ అనే డేటాబేస్‌లో వెదుకులాట మొదలవుతుంది.
వెంటనే గతంలో నేను మాట్లాడినవి, రాసినవీ, నా లోపాలు అని మీరు భావించిన జ్ఞాపకాలూ అన్నీ గుర్తు రావడం మొదలవుతాయి. ఇప్పుడు వాటిని ఆధారంగా చేసుకుని నన్ను జడ్జ్ చెయ్యడం మొదలెడతారు. మీరు జడ్జ్ చెయ్యడం మొదలుపెట్టాక మీరు జడ్జ్‌గానూ, నేను జడ్జ్ చెయ్యబడేవాడిగానూ రెండు పాత్రలు మొదలవుతాయి. అంటే మనిద్దరికీ మధ్య సపరేషన్ మొదలవుతుంది. దీంతో మనిద్దరిలో ఉన్న దేవుడి మాయమై మన ఇగోల మధ్య సంఘర్షణ మొదలవుతుంది.
అంటే ఇక్కడ మనం భౌతిక విషయాలైన కళ్లు, చెవులు, స్పర్శ, ముక్కు అనే జ్ఞానేంద్రియాల ఇన్పుట్ మీద ఆధారపడి, అవి సేకరించిన సమాాచారంతో విశ్లేషణలు చేసి దైవ స్వరూపమైన తోటి మానవుడికి దూరంగా జరుగుతూ ఉంటాం.
మీలో దేవుడిని చూసినంత కాలం మీరు నాకు దైవ స్వరూపంగానే కన్పిస్తారు. అసలు మీరు వేరు నేను వేరు అనే భావనే ఏర్పడదు. ఇద్దరం ఒకటే అనే భావన మెల్లగా అర్థమవుతుంది. దాంతో మన వైబ్రేషన్ పెరుగుతుంది. మనం భౌతికమైన మాంసపు ముద్ద స్థాయి నుండి మన చుట్టూ aura రూపంలో ఉన్న వైబ్రేషన్‌తో దేవుడిగా మారతాం. చాలాసార్లు చెప్పినట్లే రమణ మహర్షి గానీ, షిర్డీ సాయి గానీ వాళ్లు మన కళ్ళెదుట ఓ మామూలు మనిషిగా ఉన్న మానవ దేహం స్థాయి నుండి దైవంగా ఎలా మారారంటే వారు జీవించి ఉండగానే వారి అన్ కండిషనల్ లవ్, వైబ్రేషన్ ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేయగలిగింది. వారిని దైవంగా భావించిన వారు వారి దగ్గర అహం వదిలేసి సరెండర్ అయ్యేవారు. దాంతో వారి దైవిక లక్షణాలు ఎదుటి వ్యక్తిలోకి చొరబడేవి. వారి భక్తులు కూడా దైవ స్వరూపులు అయ్యే వారు! అలాగే Nallamothu Sridharనో, ఇంకో వ్యక్తినో వైబ్రేషన్‌తో అనుభూతి చెందటం మొదలుపెడితే అప్పుడు ఇప్పటికే నా కాన్షియస్‌నెస్‌లో ఉన్న దైవిక గుణాలు (నేను అనేది లేదు, కానీ అందరికీ అర్థం కావడం కోసం నేను అని రాయక తప్పదు, రిఫరెన్స్ పాయింట్‌గా) మీలో ఉన్న దేవుడితో కలిసిపోతాయి. మీరూ నేను ఒకరికొకరు చేతిలో ఉన్న ఇగో, ద్వేషం, వంటి అస్త్రాలన్నీ వదిలేసి ఒకరితో ఒకరు ఇద్దరి కాన్షియస్నెస్లు కలిసిపోతాయి.
రేడియోకి ఓ ఫ్రీక్వెన్సీని స్వీకరించే సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫ్రీక్వెన్సీ ఎలా రిసీవ్ అవుతుందో నా దైవిక లక్షణాలు స్వీకరించే రిసీవింగ్ మోడ్ మీలో లేకపోతే నేను మీ లాజికల్ మైండ్ అయిన ఫ్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ చేత విశ్లేషించబడే ఓ పదార్థంగానే, ఓ సాధారణ వ్యక్తిత్వంగానే కన్పిస్తాను. మనస్తత్వ శాస్త్రం మనుషుల స్వభావాన్ని అర్థమయ్యేలా మాత్రమే చేస్తుంది. ఆ మనిషి వైబ్రేషన్‌ని ఏ మనస్తత్వ శాస్త్రమూ అర్థం చేసుకోలేదు. కోన్ని cues ఆధారంగా, ఇతను ఈ మాట మాట్లాడాడు కాబట్టి ఇతని ప్రవర్తన ఇదీ, ఇతని టెండెన్సీ ఇది అని ప్రీ-డిఫైన్డ్ అనాలసిస్‌లు చేస్తుంది.
అలాగే ఇంతకుముందు ఆర్టికల్ లో చెప్పినట్లు మెడికల్ సైన్స్ ఒక మనిషి భౌతిక రూపాన్ని మాత్రమే డీల్ చేస్తుంది. అలాంటప్పుడు మీలో ఉన్న దేవుడూ, నాలో ఉన్న దేవుడూ మనకు మనం ఎప్పటికి అర్థం అవుతాం? పూజలు, ప్రార్థనలు చేస్తూ దేవుళ్లని మన కాన్షియస్నెస్కి ఆవల ఓ రూపంలో బంధించి బ్రతకడం తప్పించి మనలో ఉన్న దేవుడు ఎప్పుడు మేల్కొంటాడు.
మీరూ ఫిజికల్ బాడీ, మైండ్ లెవల్ థింకింగ్ స్థాయి నుండి ఎదిగి నాలోనూ, మన చుట్టు పక్కల ప్రతీ మనిషీ, ప్రతీ జీవిలోనూ ఉండే దైవిక గుణాలను అనుభూతి చెంది, మీరూ, నేనూ దేవుళ్లుగా వైబ్రేట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మరో ఆర్టికల్ లో మళ్ళీ కలుస్తాను.
- Sridhar Nallamothu