చెవులు రిక్కించి వినడమూ… కావాలని ఒక వ్యక్తి మాట్లాడే దాని మీదే మైండ్నంతా ఫోకస్ చేసి వినడమూ.. ఎదుటి వ్యక్తి ఇగోని శాటిస్ఫై చెయ్యడానికి ఇష్టం లేకపోయినా వింటున్నట్లు నటించడమూ ఇవన్నీ బ్రెయిన్‌ని చాలా strain చేస్తాయి. అస్సలు ఎలాంటి ప్రయత్నం చెయ్యకపోతే చాలు.. ప్రశాంతంగా ఉంటే చాలు మీరు కోరుకున్నవే కాదు.. మీరు concentrate చెయ్యడం ద్వారా వినలేని తక్కువ ఫ్రీక్వెన్సీ శబ్ధాలు కూడా విన్పిస్తాయి. ప్రతీ క్షణం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుంటే చాలు!
ఎంత ఎక్కువ వినగలిగితే.. ఎంత ప్రశాంతంగా వినగలిగిన పరిపక్వత ఉంటే అంత ఎక్కువ నిశ్శబ్ధాన్ని ఇష్టపడతాం.. ఎగిరెగిరి పడడం కన్నా… హడావుడి చేసి అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలని తపన పడడం కన్నా సైలెన్స్‌లోనే జీవితం చాలా అర్థమవుతుంది. అలాగే బయటి ప్రపంచంలో జరిగే హాహాకారాలూ, జనాల భయాలూ, పిరికితనాలూ, బలహీనతలూ మన నిశ్శబ్ధాన్ని ఛేధించుకుని రాలేవు. మన ప్రశాంతతని ఏమాత్రం కదిలించలేవు.
మాట్లాడడం కన్నా మౌనమే చాలా శక్తివంతమైనది. ఏదో మాట్లాడాలనుకుని మాట్లాడడం చేతకాక మౌనంగా ఉండడం కాదు మౌనమంటే…! అన్నీ అర్థమయీ, అన్నిటి పట్లా అవగాహన కలిగి ఉండీ… కళ్ల ముందు జరిగేదంతా ప్రేక్షకుల్లా చూస్తూ అంతకన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీని మనస్సులో కలిగి ఉండి మౌనం దాల్చడం అత్యంత శక్తివంతమైనది. అలాంటి మౌనాన్ని అలవాటు చేసుకుందాం.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply