ఆ మధ్య ఒక ఫేస్బుక్ మిత్రుడు “మీరు మెడిటేషన్ ప్రాక్టీసెస్ చేస్తుంటారు కదా సర్, ఫలానా గురువు ఆన్లైన్లో క్లాసులు తీసుకుంటున్నారు, ఈ లింకులో ఓసారి చూడండి” అని ఓ యూట్యూబ్ లింక్ ఇచ్చారు.
సరేనని ఓ పావుగంట చూశాను. “కళ్లు మూసుకుని ఓం నమశ్శివాయ.. అనుకుని కొన్ని సెకన్స్ గ్యాప్ ఇచ్చి, మళ్లీ ఓం నమశ్శివాయ” అని అనుకుంటూ వెళ్లమని ఆ గురువు చెబుతున్నారు. ఆయన్ని తప్పుపట్టడానికి ఇది రాయట్లేదు. స్పిరిట్యువల్ ప్రాక్టీసెస్‌లో ఏర్పడే కొన్ని అడ్డంకుల గురించి లోతుగా వివరించడానికి రాస్తున్నాను.
ఆయన చెప్పిన ప్రాక్టీస్ ద్వారా ఓసారి “ఓం నమశ్శివాయ” అనుకున్న దానికి.. మరో సారి అనుకున్న దానికి మధ్యలో ఉన్న శూన్య స్థితి (ఖాళీగా ఉండే స్థితి) మీద దృష్టి పెట్టమన్నారు. సరిగ్గా ఈ సైలెన్స్ అత్యంత ముఖ్యమైనది. మైండ్ చేసే మాయ నుండి no mind స్టేట్‌కి వెళ్లడానికి ఈ సైలైన్స్ ఉపయోగపడుతుంది. ప్రాణాయామలో కూడా పూరక, కుంభక, రేచక, శూన్యక అనే నాలుగు క్రియల్లో చివరిదైన శూన్యక కూడా ఇలా స్టిల్నెస్ని సాధించడానికి ఉద్దేశించబడింది.
ఇప్పుడు అసలు విషయం చెబుతాను. కొంతమందికి నిజమైన స్పిరిట్యువాలిటీ లోతులు సులభంగా తెలుస్తాయి. మరికొంతమంది గురువుల లాంటి వారిని గుడ్డిగా అనుసరిస్తారు. ఇలా గుడ్డిగా అనుసరించే వారితోనే సమస్య.
పైన ఉదాహరణే తీసుకుంటే.. రెండు ఓం నమశ్ళివాయకి మధ్య స్థిమితంగా ఉండే ఖాళీ సమయం అత్యంత ముఖ్యమైనదని ఆ గురువుకి తెలుసు. కానీ శిష్యుడికి ఆ ప్రాధాన్యత లోతుగా వివరించి చెప్పకపోవడం వల్ల.. మెడిటేషన్ చేసేటప్పుడు శిష్యుడు “ఓం నమశ్శివాయ” అనుకుంటూ శివుడు తనకి ప్రత్యక్షమవుతున్నాడనో, శివుడి రూపాన్నో, ఫొటోనో ఊహించుకుంటూ మెడిటేషన్ చేస్తాడు. అంటే no mind స్థితికి వెళ్లాల్సిన శిష్యుడు కాస్తా మైండ్‌లో శివుడుని ప్రతిష్టించుకుని ధ్యానం ద్వారా శివుడు తనకి సాష్కాత్కరిస్తున్నాడని ఊహించుకుంటూ కొనసాగుతాడు.
ఇలా నిరాకారమైన, ఆలోచనా రహితమైన స్థితికి వెళ్లాల్సిన ప్రాక్టీస్ కాస్తా ఓ కండిషనింగ్‌లో ఇరుక్కుపోతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం లేని వ్యక్తులకి ఇలా శివుడు రూపమో, విష్ణువు రూపమో, శ్వాస మీద ధ్యాసో ఇంకోటో ఓ ఆధారంగా ఇవ్వడం చూడడానికి అర్థవంతంగా కన్పిస్తుంది గానీ.. కొన్నాళ్లకి ఆ లూప్ నుండి బయట పడలేక తాము చేస్తున్నది కరెక్టే అనే భ్రమలో మెడిటేషన్ అనే ఓ కండిషన్డ్ ప్రాసెస్‌లో తమ ఊహల్లో అలాగే కళ్లు మూసుకుని కూర్చుని మెడిటేషన్ చేస్తుంటారు. దీంతో జ్ఞానేంద్రియాలను అధిగమించడం, మైండ్‌ని అధిగమించి సోల్‌ని చేరుకోవడం సాధ్యపడదు.
మరో ఉదాహరణ చెబుతాను. ఓ ఇంట్లో ఓ వ్రతం జరుగుతోంది. పురోహితుడు “అమ్మా రెండు కొబ్బరి కాయలు తీసుకు వచ్చి దంపతులు ఇద్దరూ కొట్టండమ్మా” అంటూ ఆదేశిస్తున్నాడు. కొబ్బరికాయలు కొట్టడం, స్వామి ఫొటోని తదేకంగా చూస్తూ ఆయన కరుణిస్తున్నాడు ఊహించుకోవడంలోనే స్వామిలో ఈ పైపై ఆర్భాటాలన్నీ విసిరేసి లీనమయ్యే భక్తి యోగా మాయమవుతోంది. We always love the process. ఏ ప్రాసెస్ అయినా ఓ కండిషనింగ్ మాత్రమే. ఎవరో ఏదో చెబితే చేసేది. నేను చెప్పినా మీరు చేస్తున్నది. బట్ విశ్వాన్ని చేరుకోవాలంటే మైండ్‌తో చేసే ఏ ప్రాసెస్‌తో సాధ్యపడదు.
మెడిటేషన్ చేస్తే అహం కాలి బూడిద అయిపోవాలి. అంటే మళ్లీ ఈ వాక్యాన్ని ఊహించుకుంటూ మెడిటేషన్ చెయ్యకండి. అది మళ్లీ కండిషనింగ్, ప్రోగ్రామింగ్ అవుతుంది. నేను, దేవుడు వేరు వేరు, దేవుడు నన్ను కరుణిస్తాడు, నా కోరికలు తీరుస్తాడు అనే మానసిక స్థితిలో పూజలు చేసినా, మెడిటేషన్ చేసినా “నేను వేరు” అనే ఓ అహాన్ని కలిగి ఉండడమే కదా. నువ్వు వేరు దేవుడు వేరు అయినప్పుడు నా కోరికలు తీర్చు స్వామి అని చేతులు చాచి అభ్యర్థించుకోవడం.. అవి నెరవేరకపోతే నిరుత్సాహపడి దేవుడిని తిట్టుకోవడం.. ఇలా వేరు వేరు అనే సపరేషన్ భావన వల్ల నువ్వు దేవుడు అనే రెండు ఐడెంటిటీలకు మధ్య ఏర్పడే సంఘర్షణ ఉంటుంది కదా! ఆ సంఘర్షణ ఎవరు సృష్టిస్తున్నారు? ఎవరంటే నీ మైండ్! మెడిటేషన్ ద్వారా నువ్వు చూసేవీ, వినేవీ, నీ మైండ్ తో చేసే శివుడు, రాముడు, కృష్ణుడు వంటి భ్రమలూ, ఊహలూ, రూపాలూ అన్నీ అధిగమించి దేవుడూ నేనూ ఒకటే అనే అందులో స్వేచ్ఛగా మెర్జ్ అయ్యే స్థితికి (ఇది మైండ్‌తో ఊహించుకుని సాధించగలిగేది కాదు.. మైండ్ స్థానంలో నీ వైబ్రేషన్ పెంచుకుని సాధించాలి) అప్పుడు దేవుడు వేరు నువ్వు వేరు.. ఈ విశ్వం వేరు నువ్వు వేరు అనే భావన కాకుండా అంతా ఒకటే అని అర్థమవుతుంది.
ఇంత లోతుగా స్పిరిట్యువల్ ప్రాక్టీసెస్ సాగాలి.
- Sridhar Nallamothu