సీన్ 1A. స్టూడెంట్ లైఫ్, లేదా కొత్తగా ఉద్యోగం వచ్చింది..
———————————————
ఒకటి రెండు రోజులు సెలవులు ఎలా అయిపోయాయో తెలీదు..
పుట్టినూరునీ.. అయిన వాళ్లని వదిలి గడపదాటి బయటకొచ్చే మొహాల్లో తెలీని దిగులు.. కన్పించినంత మేరా వెనక్కి తిరిగి తిరిగి చూసుకుంటూనే పయనమయ్యాం..
బస్సెక్కాం.. ఆ రెండు రోజులూ ఓ రీలులా కళ్లముందు గుండ్రంగా తిరుగుతున్నాయి.. రేపెళ్లి రొటీన్ పనుల్లో పడితే గానీ ఈ దిగులు తీరదు అని మనకు మనం సర్ధిచెప్పుకుంటున్నాం..
బస్ కదిలింది.. మెల్లగా జ్ఞాపకాలన్నీ మాయమై.. కళ్లు వేగంగా వెనక్కెళ్లిపోతున్న మనుషుల్నీ, భవనాల్నీ, చెట్లనీ… చోద్యంగా చూస్తున్నాయి..
విండో డోర్ మరింత తెరుచుకుంది.. మనస్సూ అంతే తెరుచుకుని స్వేచ్ఛగా ఆలోచనల్లో, ఊహల్లో మునిగి తేలుతోంది..!! 🙂 పెదాల చివర్న చిరునవ్వుతో మెల్లగా నిద్రలోకి జారుకున్నాం. కలల్లో కమ్మని భవిష్యత్ కన్పిస్తోంది.. 🙂
————————————————-
సీన్ 1B: పెళ్లిళ్లయ్యాయి.. బాధ్యతలు పెరిగాయి…
———————————
అదే ట్రావెల్స్ బస్ కదిలింది… సీన్ సేమ్.
గడపదాటుతున్నా పెద్దగా బాధేం లేదు.. వచ్చిన పని అయిపోయింది, వెళ్తున్నాం అన్న యాంత్రికత్వం తప్ప.
బస్కెక్కాం… సర్ధుకోవలసినవన్నీ సర్దేసుకుని.. ఇటూ ఇటూ చూసి.. అంతా కంఫర్టబుల్గా ఉందా లేదా అని confirm చేసుకుని..
తెరిచిన కిటికీలు.. సైసన్సో, డస్ట్ అలర్జీ అనో.. ఒక్క లాగు లాగేసి మూసేశాం… మనస్సూ మూతబడింది..
ఊరొచ్చి ఓ బాధ్యత తీర్చుకున్నాం.. రేపెళ్లి మరిన్ని బాధ్యతలు పూర్తిచెయ్యాలన్న ఫీలింగ్ చాలా భారంగా అన్పించింది.. కలతలతో కళ్లు మూతలు పడి మెల్లగా నిద్రలోకి జారుకున్నాం.. ఈ కాసేపైనా ప్రశాంతంగా పడుకుందామని!
సీన్ 2A: ఫ్రెండ్ పెళ్లి..
——————————————
పెళ్లికొడుకేమో గానీ మనం చాలా గ్రాండ్గా తయారయ్యాం.. పెళ్లి మండపంలోకి అడుగుపెట్టిన క్షణం నుండి తెలీని ఉత్సాహం.. కళ్లెక్కడెక్కడో వెదుకుతున్నాయి.. ఏ కళ్లతోనైనా కలపబడడం కోసం!
ఫుల్ హడావుడి చేసేస్తున్నాం.. తలంబ్రాలప్పుడూ.. ఉంగరాలాటప్పుడూ మన బ్యాచ్, అవతలి బ్యాచ్దే హడావుడంతా…
సీన్ 2B: మన పెళ్లైపోయింది.. 🙂 ముచ్చట్లూ తీరిపోయాయి.. బాధ్యతలూ చాలా నెత్తికెక్కాయి… కొద్దిగా అటూ ఇటూగా సేమ్ సీన్.. ఈసారి కావలసిన బంధువుల పెళ్లి..
కారు దిగాం.. పిల్లాపాపలతో దిగాలా వద్దా అన్నట్లు తటపటాయించి భారంగా కారు దిగాం.. ఎవరు రిసీవ్ చేసుకుంటారా.. మనకు తెలిసిన మొహాలు ఏమైనా కన్పిస్తే బాగుణ్ణు అని కళ్లతో వెదుకులాట మొదలుపెడుతూ.. ఎక్కడో ఎవరో తెలిసిన మొహం కన్పిస్తారు.. వారిని విష్ చేస్తున్నట్లు చేస్తూనే.. ఎటూ కంపెనీ బెర్త్ confirm అయింది కాబట్టి కళ్లని నలు చెరుగులా చుట్టేస్తూ.. కాస్తంత ఫోజుతో నడుచుకుంటూ ఆ కంపెనీ ఇచ్చే తెలిసిన మొహం వద్దకు చేరుకుంటున్నాం.
ఎలాంటి హడావుడీ లేదు.. షూస్ విప్పదీసి అక్షింతలు చల్లేసి.. బఫెట్ ఎక్కడో వెదికేసి.. తినేసి.. వచ్చినంత వేగంగా వెనక్కి మళ్లడం..!!
—————————————————————————————————–
ఇప్పుడు అస్సలు విషయం.. ఈ రెండు సీన్లూ ఎందుకు చెప్పానంటే… మన సెన్సిటివిటీ క్రమేపీ తారురోడ్డులా ఎలా కొట్టుకుపోతోందో గుర్తుచెయ్యడానికి!
కళ్లమ్మట వచ్చే నీళ్లు కాస్తా.. నీళ్లనేవే ఊరనంత ఎండిపోతున్నాయి. కారణం మనుషులూ, మనసులూ, గాయాలూ, పరిస్థితులూ, బాధలూ, కష్టాలూ.. ఇలా బ్రతక్కపోతే కష్టమనే confirmationలూ! ఈరోజు మనసారా ఏడవడానికి సిగ్గు మనకు… మనమేంటి ఏడ్చేది అని! 🙂
ఊహలనేవే రావట్లేదు.. మన ప్రాక్టికాలిటీ ముందు భయపడిపోయి! "పాపంలే అని ఎన్నిసార్లు వస్తే నిర్థాక్షిణ్యంగా తోసిపారేసాడు ఈ మనిషి" అని బాధపడిపోయి!!
క్యారమ్స్, షటిల్, పేకాటా, గల్లీ క్రికెట్టూ.. ఇలా ఆటలన్నీ అటకెక్కాయి.. "జీవితమే ఓ ఆటైపోతే ఇంకా ఈ ఆటలొక్కటే తక్కువ" అనే మన నిష్టూరాలకు జడిచిపోయి!!
మనసులో ఉన్న చిలిపితనం ఆవిరైపోతోంది.. ఆ ఏముంది లైఫ్.. అమ్మాయిలూ, అబ్బాయిలూ, వయస్సూ, సెక్సూ.. ఇంతకుమించి ఏముంది అన్న వైరాగ్యంతో 🙂
జీవితంలోని వివిధ దశల్లో ఎంత వైవిధ్యంగా జీవిస్తున్నాం? పరిస్థితులెలా ఉన్నా మనస్సుని అదుపులో పెట్టుకోగలిగితే అన్ని ఆనందాలూ ఎల్లకాలమూ మనతో ఉండవా? ఎప్పటికీ చిన్నపిల్లాడిలా ఉండలేమా? స్వచ్ఛంగా.. కల్మషం లేకుండా నవ్వుతూ.. ఉడుక్కుంటూ.. ఉడికిస్తూ.. కబుర్లు చెప్తూ.. చిరునవ్వుతో కనుమూయడం సాధ్యం కాదా…?
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply