యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ ।
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ।। 22 ।।
సంపూర్ణ సృష్టి అంతా ఈ భిన్నభిన్న భాగములే అన్న విషయంలో పూర్తిగా మనిషిని తనమునకలై పోయేట్టు చేసి, తర్కబద్ధముగా లేకుండా మరియు సత్య దూరముగా ఉండే జ్ఞానము, తామసిక జ్ఞానము అని చెప్పబడుతుంది.
వివరణ:
భగవానుడు గత రెండు శ్లోకాల్లో సత్త్వ గుణ జ్ఞానం, రజో గుణ జ్ఞానం గురించి చెప్పారు కదా! ఈ శ్లోకంలో తామసిక జ్ఞానం గురించి ప్రస్తావించారు. రజో గుణ జ్ఞానం మాదిరిగానే ఈ తామసిక జ్ఞానం కలిగిన వారు కూడా సృష్టిలోని ప్రతీ జీవీ వేర్వేరు అన్న భ్రమలోనే ఉంటారు. అయితే “అన్నీ వేర్వేరు” అనే భావన మరింత తీవ్రంగా, మూర్ఖంగా వీరికి ఉంటుంది.
“మనుషులంతా స్వార్థపరులే” అని కొంతమంది తమ తోటి జీవుల పట్ల తిరస్కార దృక్పధాన్ని కలిగి ఉంటారు. “మనుషులంతా అంటే ఎవరు? ఆ సమూహంలో తాను లేడా?” అన్న ప్రశ్న వారికి తట్టదు. ఒకవేళ తట్టినా “ఈ ప్రపంచంలో తాము మాత్రమే నిస్వార్థపరులం” అనే భావనలో ఉంటారు.
మీరో, నేనో సరిగ్గా ఇలాంటి “మనుషులంతా స్వార్థపరులే” అనే అభిప్రాయాన్ని కలిగి ఉన్నామనుకోండి. అప్పటి నుండి సంఘర్షణ మొదలవుతుంది. యుద్ధ భూమిలో “మనుషులంతా” అనే సమూహం ఓ వైపు, మీరు ఓ వైపు.. నిరంతరం పెద్ద సమూహం నుండి వారి స్వార్థానికి మిమ్మల్ని మీరు రక్షించుకునే మానసిక యుద్ధం చేస్తుంటారు. ఒక మనిషి కనిపించగానే “ఇతని మాటల్లో స్వార్థముందా, ప్రేమ ఉందా? ఇతని బుట్టలో పడి నన్ను నేను పోగొట్టుకోకూడదు, చచ్చినా అతనికి ఏ పనీ చేసి పెట్టకూడదు” వంటి జడ్జ్‌మెంటల్ స్వభావాన్ని మీ మైండ్ కలిగి ఉంటుంది.
సృష్టిలోని ప్రతీ జీవి పట్లా అన్ కండిషనల్ లవ్, దగ్గరకు తీసుకునే తత్వంతో ఉండే సత్త్వ గుణ జ్ఞానం కలిగిన వ్యక్తుల చుట్టూ ఆ మేరకు వారి “ఆరా” వారి శరీరం చుట్టూ విశ్వం మొత్తాన్నీ వారి వైపు ఆకర్షిస్తూ ఉంటే.. “అందరూ స్వార్థపరులే” అనే భావనతో ఉన్న తమోగుణ జ్ఞానులు తమ చుట్టూ ఉన్న “ఆరా” శక్తిని తమ శరీరంలోని అడుగు భాగంలో ఉండే ఎమోషనల్ సెంటర్ అయిన స్వాధిష్టాన చక్ర వద్దకు లాక్కుని, బయట వారి చుట్టూ ఆభరణంగా ఇతరుల్ని దగ్గరకు చేర్చడానికి ఉపయోగపడవలసిన ఎనర్జీ మొత్తం ఇతరుల నుండి తనని తాను కాపాడుకునే సర్వైవల్ సెంటర్ వద్ద ఎనర్జీ బ్లాక్‌గా పోగుపడి అతని చుట్టూ ఉన్న ఆకర్షణా వలయం కుదించుకుపోతుంది.
ఇప్పుడు ఆ వ్యక్తి చూడడానికి ఇంత ఎత్తున, దిట్టంగా కనిపిస్తూ ఉండొచ్చు. అతను అయస్కాంత శక్తి కోల్పోయిన ఓ ఇనుప ముక్క లాంటి శరీరం మాత్రమే. ఏ వ్యక్తయితే “వాళ్లు వేరు, వీళ్లు వేరు.. నా అభిప్రాయాలు వేరు, వాళ్ల అభిప్రాయాలు వేరు, వాళ్లతో గొడవపడి నా అభిప్రాయాలు, నా వాదన నెగ్గించుకోవాలి” అని కేవలం మైండ్ నిరంతరం రమించే మేధస్సు మీద దృష్టి పెట్టి దాన్ని ఆస్వాదిస్తుంటారో.. ఆ వ్యక్తి తన సోల్ (ఆత్మ) స్థాయిలో వైబ్రేషన్ కోల్పోయి కేవలం చూడడానికి ఓ ఆకారంగా భౌతిక రూపంగా బయట ప్రపంచానికి కనిపిస్తుంటారు గానీ ఆ వ్యక్తి సమక్షంలో ఎవరికీ ఉండబుద్ధి కాదు. కారణం వారి శరీరం చుట్టూ ఉండే ఎలక్ట్రో మాగ్నటిక్ ఎనర్జీ అయిన “ఆరా” క్షీణించిపోయి ఆ ఎనర్జీ అతని భావోద్వేగాల వైపు మళ్లిపోవడం వల్ల! కొందరి సమక్షంలో చాలా బాగుంటుంది, అసలు వారిని వదిలి వెళ్లబుద్ధి కాదు, అదే మరికొందరి నుండి ఎప్పుడెప్పుడు పారిపోదామా అని అన్పించడానికి కూడా కారణం.. వారు కృష్ణ భగవానుడు చెప్పిన ఈ తమో గుణ జ్ఞానులు అవడం వల్ల! నిరంతరం మిగతా విశ్వం నుండి వాళ్లకి వాళ్లు మానసికంగా దూరం జరుగుతూ ఉండడం వల్ల!
ఇక్కడొక అద్భుతమైన విషయం చెప్పుకోవాలి. దీన్ని జీవితాంతం గుర్తుంచుకోండి. మన నుండి వెలువడే ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలే విశ్వాన్ని మనకు దగ్గర చేయాలా, దూరం చేయాలా నిర్ణయిస్తాయి. మరి మనిషిలో ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాలు ఎలా తయారవుతాయి అన్నది చెబుతాను.
మన మైండ్‌లో ఎప్పటికప్పుడు మనం కలిగి ఉండే ఆలోచనలు “ఎలక్ట్రిక్” స్వభావానికి చెందినవి.
ఆ ఆలోచనలకు తగ్గట్లు మన శరీరంలో ఏర్పడే ఫీలింగ్స్, ఎమోషన్స్ (భయమూ, ద్వేషమూ, కోపమూ, ఒంటరితనం, ఆందోళన, అపరాధ భావం వంటివన్నీ) “మాగ్నటిక్” స్వభావానికి చెందినవి.
అంటే మన మైండ్‌లో చేసే ఆలోచనలు, వాటి వల్ల మన శరీరంలో ఎమోషన్స్ రూపంలో ఏర్పడే ప్రతిచర్యలు రెండూ కలిసి ఆ క్షణం యొక్క మన “ఎలక్ట్రో మాగ్నటిక్” తరంగం అన్నమాట. ఈ తరంగం ఉత్పత్తి అయిన వెంటనే మన శరీరం రేడియో స్టేషన్లా ఆ తరంగాన్ని విశ్వంలోకి ప్రసారం చేస్తుంది. విశ్వం తరచూ మన నుండి వచ్చే ఇలాంటి తరంగాల సముదాయం ఎలా ఉందో తన ఇంటెలిజెన్స్‌తో గమనిస్తూ, మనం వెదజల్లే భావనకు తగ్గ పరిస్థితులు, సమస్యలు, వ్యక్తులు, సంతోషాలు, సౌకర్యాలూ వంటివన్నీ మ్యాచ్ చేస్తూ ఉంటుంది. అంటే మనకేం కావాలో అన్న ఎనర్జీ కొంత మన మైండ్‌లో మేనిఫెస్ట్ అయితే మిగతా విశ్వం పూర్తి చేస్తుంది అన్నమాట. “నా వల్ల ఏ పనీ అవదు” అని కుంగిపోతూ తన ఆలోచన + నిరుత్సాహం అనే భావోద్వేగం ద్వారా ఎలక్ట్రో మాగ్నటిక్ తరంగాన్ని మన శరీరం అనే రేడియో స్టేషన్ నుండి విశ్వంలోకి వెదజల్లగానే “ఏదీ అనుకూలించని” సరిసమానమైన వైబ్రేషన్స్ మనకు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో మానిఫెస్ట్ అవుతుంటాయి. అంటే ఆలోచన, భావోద్వేగం రూపంలో మనం చేసే కర్మలు, వాటి ఫలాలను అందిస్తాయన్నమాట.
ఒక రచయితగా దీన్ని నిరంతరం నేను సాధన చేస్తుంటాను. ఈ క్షణం నా ఆలోచన, నా భావోద్వేగం ఎలా ఉందో గుర్తించి అవి సర్వైవల్ ఎనర్జీ సెంటర్స్ అయిన రూట్ చక్ర, స్వాధిష్టాన చక్ర, మణిపూరక చక్రకి చెందిన ఎనర్జీలు అయి ఉన్నట్లయితే వాటి నుండి విశ్వం, సకల జీవ జాతుల మధ్య నాకు అనిర్వచనీయమైన ప్రేమ కలిగి ఉన్న భావనకూ, భావోద్వేగానికి నన్ను నేను మార్చుకుంటూ ఉంటాను. కృష్ణ భగవానుడు చెప్పినట్లు “మనకు ఇప్పుడున్నది తామసిక జ్ఞానం” అని గుర్తించి బాధపడితే లాభం లేదు. మన ఆలోచనలు గమనించుకుంటూ, మన భావోద్వేగాలు గుర్తిస్తూ మన దృక్పధాన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవడం వల్ల మనం మెల్లగా విశ్వానికి దగ్గరవుతాం. అప్పుడు విశ్వం అంతా ఒక్కటే.. అన్ని జీవుల్లో దైవత్వం ఉంది అన్నది మెల్లగా అర్థమవుతుంది.
అజ్ఞానం ఊబి లాంటిది. బలంగా లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. ఉదయాన్నే ఈ భగవద్గీత శ్లోకాలు చదవగానే “చాలా బాగున్నాయి” అనిపిస్తాయి. కానీ మన బ్రెయిన్ ఉదయాన్నే నెమ్మదిగా ఉండే ఆల్ఫా తరంగాల నుండి బ్రేక్‌ఫాస్ట్ చేసి, రోజంతా పనుల్లోకి వెళ్లిపోయే కొద్దీ ఇవేమీ గుర్తు లేకుండా మనకు అలవాటు అయినట్లు అందరినీ ద్వేషిస్తూ ప్రవర్తించడం మొదలవుతుంది. అందుకే జ్ఞానం మనలో భాగం కావాలంటే ప్రతీ క్షణం కాన్షియస్గా మన ఆలోచనలను, భావోద్వేగాలను పరిశీలించుకుంటూ మనల్ని మనం సంస్కరించుకోవాలి. “ఈ ఆలోచన నా మైండ్ చేస్తోందా, నా సోల్ చేస్తోందా” అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటే.. మైండ్ మాత్రమే ఇగోని పెంచుతుంది, సంఘర్షణని పెంచుతుంది, మనశ్శాంతిని దూరం చేస్తుంది కాబట్టి.. మైండ్ లెవల్ థింకింగ్‌ని దూరం పెట్టి చాలా సహజసిద్ధంగా అందరితో చాలా ప్రేమగా కొనసాగవచ్చు.
- Sridhar Nallamothu