మరో ఆగస్ట్ 15 వచ్చేస్తోంది.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినరోజేమో తెలియదు కానీ పని నుండి మరో సెలవు రోజు జమైనందుకు ఊపిరి పీల్చుకుంటున్నాం. మనలోనూ చాలా దేశభక్తి ఉంది, కానీ ఏం చేస్తాం పొట్టకూటి కోసం పడే తిప్పల్లో ఎక్కడో అడుగుకి చేరుకుపోయింది. ప్రతీ ఏటా ఈ పండుగ వస్తూనే ఉంది.. టెలివిజన్ సెట్లలో, రేడియోల్లో ఉద్వేగభరితమైన సంగీతాన్నీ, జాతీయ గీతాలను ఆస్వాదిస్తూ మన రోమాలు నిక్కబొడుచుకుంటూనే ఉంటున్నాయి. వందేమాతరం అంటూ రెహ్మాన్ గీతంలో ఆసేతు హిమాచలాన్ని వీక్షిస్తూ ఎంత గొప్పదేశమో అని పులకించిపోతున్నాం. కాలం ఆగదు కదా.. కాలెండర్ లో తేదీ మారింది. తేదీతో పాటు ఉత్సాహమూ చప్పబడిపోయింది. మళ్లీ రొటీన్ లైఫ్ మొదలైంది.
రొటీన్ లైఫ్ లీడ్ చేస్తున్నా మనలో చేవ తగ్గలేదు, ఇప్పటికీ దేశం పేరెత్తితే ఉప్పొంగిపోతున్నాం.. ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణం గెలిస్తే పట్టలేని ఆనందం. భారతజట్టు క్రికెట్ లో ప్రపంచ కప్ గెలిస్తే ఎనలేని ఆనందం, దారుణంగా ఓడిపోతే శాపనార్థాలు. రాజకీయల నాయకుల్ని చూసి అసహ్యించుకుంటున్నాం, సోమరిపోతు అధికారుల్నితిట్టుకుంటున్నాం.. పేపర్ బాయ్ నుండి టీవీ సీరియల్ లో క్యారెక్టర్ వరకూ ఎవరినీ వదలకుండా వారు వారు పోషిస్తున్న పాత్రలు, ఉద్యోగ ధర్మాన్నిచీల్చి చెండాడుతున్నాం. ప్రపంచంలో మనంత గొప్ప విమర్శకులు ఉండరు. వ్యవస్థ పాడైపోయినందుకు గంటల తరబడి విశ్లేషణలు చేసి కొండని తవ్వి ఎలుకను పట్టినట్లు "ఈ దేశాన్ని మనం బాగుచెయ్యలేమండీ" అని పెదవి విరిచి పడకేస్తాం.
దేశమంటే, సమాజమంటే అదో బ్రహ్మపదార్థం.. మన చేతిలో ఏదీ ఉండదు అన్నంత నిర్లిప్తత. "నీకు చేతనైంది ఏదైనా ఒక్క మంచి పని చెయ్యరా బాబూ" అంటే.. "మనమొక్కళ్లం మంచిగా ఉంటే అంతా బాగవుతుందా" అన్న బోడి లాజిక్ లు. ఏం ఎందుకు బాగు కాదు? అసలు చేతనైనంత, మనకు వీలుపడినంత సమాజానికో, దేశానికో, పక్కవాడికో మంచి చెయ్యడానికి అంత బద్ధకం ఎందుకు? "ఈ దేశం ఎప్పుడు బాగుపడాలండీ" అంటూ వ్యంగ్యాలు సంధించే బదులు కనీసం దేశాన్ని బాగు చెయ్యకపోయారు మనల్ని మనమైనా బాగుచేసుకోలేమా? ఆఫీస్ కి వెళతాం, "పనిపూర్తయిందా", "ఈ జాబ్ లో ఉంటే వచ్చే ఏడాదికి ఎంత పే వస్తుంది, మరో జాబ్ మారితే బాగుంటుందేమో? వద్దులే అక్కడ వర్క్ ఎక్కువుంటుందేమో".. ఇవే పనికిమాలిన పని తప్పించుకునే ఆలోచనలు. జపాన్ చాలా గొప్పదేశమండీ, చైనా ఎంత డెవలప్ అయ్యిందో చూశారా.. టీవీలో స్టాటిస్టిక్స్ చూసి తామేదే రీసెర్చ్ చేసి కనిపెట్టినట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు. అవి డెవలప్ అయ్యాయి అంటే అక్కడి పౌరులు తమ పని తాము శ్రద్ధగా చేసుకుపోతున్నారు. వారేమీ ఓవర్ టైమ్ చెయ్యడం లేదు. తమకు వచ్చే జీతానికి సరిపడా తాము కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ప్రొడక్టివిటీ వల్ల ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అని, తాము కష్టపడితే దేశానికి సముద్రంలో నీటి బొట్టంత అయినా లాభం చేకూరుతుందన్న కనీస స్పృహ వారికుంది. ప్చ్.. మనం మాత్రం ఎప్పుడు సెలవు వస్తుందా అని చకోర పక్షుల్లా ఎదురుచూస్తుంటాం. స్వంత పనే, కూడు పెడుతున్న పనే శ్రద్ధగా చేయనంత బద్ధకస్తులమైతే మనం దేశం గురించి బాధ్యత ఎక్కడ ఫీల్ కాగలం?
"దేశాన్ని ఉద్దరించాలంటే ఏం చేయాలండీ" అంటూ ప్రశ్నిస్తారు కొంతమంది? ఎంత కన్ ఫ్యూజన్ లో ఇరుక్కున్నాం. చేయాలన్న తపన ఉండాలే కానీ మనం చేసే ప్రతీ పనీ చిత్తశుద్ధితో చేస్తే అది దేశానికి సేవ చేసినట్లు కాదా? ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవడం దగ్గర్నుండి అనాధలకు సేవ చెయ్యడం వరకూ ఎన్ని రకాల సేవలు ఉన్నాయి. అవన్నీ మనమెక్కడ చేస్తాం అంటూ భేషజం అడ్డు వస్తుంది. ఇంకేం దేశాన్ని, నాయకుల్ని, పక్కింటి వాడిని సణుక్కుంటూ దుప్పటి ముసుగేద్దాం. మనకు చేతనైంది అదే కదా! ఒక్క మంచి పనిని చెయ్యకపోగా మంచి పనులకు మాటలతోనైనా మోరల్ సపోర్ట్ ఇచ్చే ఓపెన్ మైండ్ ఉండదే.. ఇంకా సమాజాన్ని విమర్శించే హక్కు మనకెక్కడిది? ఎవరైనా మంచి పని చేస్తే కాళ్లు పట్టి మరీ వెనక్కి లాగి శాడిజం ప్రదర్శించుకుంటాం. నిర్లక్ష్యంగానే పెరిగాం, నిర్లక్ష్యంగానే జీవితం సాగిద్దాం.. ఎవరెట్లా పోతే మనకెందుకు! ఇలాంటి పండుగలొచ్చినప్పుడు నాలుగు స్వీట్లు తిని, FBలోనో, Orkutలోనో, మెయిల్ లోనో ఆవేశపూరితమైన కొటేషన్లని, వాల్ పేపర్లని పంపించుకుని అలా చేయడం వల్ల మనకేదో దేశభక్తి వంటబట్టినట్లు భ్రమపడుతూ, టైమ్ ఉంటే బ్లాక్ లో టిక్కెట్ కొని సినిమాకెళ్లి, రాత్రికి వీలైతే గ్లాసులు గల్లుమనిపించి తొంగుందాం…
మేరా భారత్ మహాన్! స్వాతంత్ర్యభారతం వర్థిల్లాలి…!!
ఇలాంటి మొక్కుబడి దేశభక్తిని చూసి విసిగిపోయి..
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా మేగజైన్
PS: చివరిగా ఇది పూర్తిగా నా వ్యక్తిగతమైన ఆవేదన. ఇందులో లాజిక్ లూ, లా పాయింట్లూ, భిన్నమైన అభిప్రాయాలూ, వాదనలూ చేయదలిస్తే వాటిని లాగీ పీకేటంత సమయం నా పనుల వత్తిడిలో నాకు లేదు. సో నేను అలాంటివి ఎంటర్ టైన్ చేయను.
నమస్కారం శ్రీధర్ గారు, .మీ వ్యాసం, మన దేశ పరిస్తితిని చూస్తూ బాద పడుతూ రాసినది అనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. కాని ఇదంతా తెలిసుకొవల్సిన మన దేశ యువత ఎందుకు నిర్లిప్తంగా ఉందొ అర్దం కావడం లెదు. దేశం లో,రాష్ట్రం లో ఉన్న యువత 55% పైనే ఉంది. అందులొ కనీసం 35% ఐనా నిద్రావస్తలో ఉందని నేను బావిస్తున్నాను. మీలాంటి సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు, మన భారతదేశ(కనీసం మన రాష్ట్ర )యువత కొరకు ఒక వేదిక(రాజకీయాల కొరకు కాదు సుమా!) ఏర్పాటు చేస్తె మన దేశాన్ని భావితరలకు మిగిల్చిన వారము అవుతాము అని నా భావన.
తప్పుగా మాట్లాదినట్లైతే మన్నించగలరు .
రామ్ రెడ్డి గారూ.. యువత నిర్లిప్తంగా లేదు. స్టీరియో ఫోనిక్ చదువులూ, EAMCETలూ, సాఫ్ట్ వేర్ జాబ్లూ, డబ్బు సంపాదనా ప్రధాన లక్ష్యాలుగా నూరిపోస్తూ పెద్దలే యువతని కనీస సామాజిక బాధ్యత అన్నదే లేకుండా వారి వ్యక్తిత్వాలనే ఎదగనీయట్లేదు.
యువతకు దేశంపై ఇప్పటికీ మమకారం ఉంది. కానీ రాజకీయనాయకుల చుట్టూ, వారి అవినీతి చుట్టూ మీడియా తిరుగుతూ యువతకు వ్యవస్థపై నమ్మకం పోయేలా చేస్తున్నాయి. వ్యవస్థపై ఎంత నమ్మకం పోగొట్టుకుంటున్నారూ అంటే.. అసలు కొద్దిగానైనా బాధ్యతగా ఉండడం వేస్టనీ, ఎవరమూ ఏమీ వ్యవస్థలో మార్పు తీసుకురాలేమనీ ఎవరి పరిధిలో వారి జీవితాల్ని వారు సామాజిక బాధ్యతలకు దూరంగా జీవిస్తున్నారు.
“మీలాంటి సంఘంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు ఓ వేదిక ఏర్పాటు చేస్తే” అని సూచించారు మీరు! కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ కి ఉన్న 24,000 మంది పాఠకుల్లో, వివిధ మార్గాల ద్వారా నా ఆలోచనలు నిరంతరం అందిపుచ్చుకునే ఇతర మిత్రుల్లో బాధ్యతాయుతమైన ఆలోచనలు పెంపొందించడానికి వీలైనంత చేస్తున్నాను. ఓ పూర్తి స్థాయి వేదిక ఏర్పాటు చేయాలంటే ఇవే ఆలోచనలు కలిగిన వ్యక్తులూ, ఇతర వనరులూ అవసరం అవుతాయి. కొంతమందితోనైనా మనందరం కలిసి ఓ వర్చ్ వల్ వేదిక ప్రారంభించుకుని మెల్లగా దాన్ని విస్తృతపరుచుకుంటూ వెళ్లవచ్చు.
Reply ఇచినందుకు ధన్యవాధాలు.నేను మీ మాటలను అంగీకరిస్తాను, కాని నేను యెక్కువగా బాద పడేది, మన యువశక్తి కి సరి ఐన మార్గదర్శనం చెసేవారు కరువు అయ్యారు అని. మన యువత చదువుతున్న చదువు వారికి ఎ విదంగా ఉపయొగ పదుతున్నదో, ఆ చదువు వారిని ఎం నేర్చుకోమని చెప్తుందొ తెలుసుకోకుండా మార్కుల కోసం % కోసం చదువుతున్నారు, నేను మార్కులు % దండగ అనడం లేదు. ఆ % సాదించే యువత కు కొద్దిగా లోకం కూడా తెలిస్తే ఆ % విలువ అని నా అభిప్రాయం.కనుక ఈనాడు యువతలొ మీ మాగజైన్ కు ఉన్న పాపులారిటిని ఉపయోగించి, ఒక సర్వే చెసి వారి అభిప్రాయాలు సేకరిస్తే మనం వాటి ప్రకారం ముందుకు పోవచ్చు.
Hi Sir, I am a benificiary of your generous offering of collage software.Thank You for that again. I am also one of the people who tries to escape the work and excpects more time at the same time.
The reason is we are set in wrong blocks, like a square block placed in a round slot and vice versa. The reason , Money,status,shortterm happiness. The reason, Lack of Passion of our own interest.
Now we are in such a pathetic condition,that we don’t know what we like most.
We can see people like rajamouli,chirangeevi field working 18 hrs a day or 20 hrs a day with out even feeling of restlessness ,because they are passoniate and hence total responsible for it.
Or
Metro Sridharan Sir,working 70 hrs a week at the age of 65,and reviewing the project work from the bed ,on the day he went on for bypass surgery.
The teamwork is indirect reason for escaping the responsibility.Like Google encourages its people,for 15% on individual projects.
Its passion,
we are coming to this field, just it gives 20K-30K for first two years and good raise thereafter and onsite, marriage,car,flat,international school…thats it ,, it is the end of the life… Boys of that category will only be respected and will be eligible for marriage.
We are so scared of loosing that salary, that we are going after peanuts though we have the caliber to earn gold and diamonds.
Art,Research,Scince,business,innovation these are the major casualities of our attitude.
God Bless us and God Bless India.
Sorry for typing in english,i am not fully accoustomed with google translate yet..
రాజేష్ గారూ.. మీరు ఎంత నిజాయితీతో మీ కామెంట్ రాశారో.. ఆ ఒక్క ఎలిమెంట్ నాకు చాలా సంతోషమనిపించింది. అలాగే రాజమౌళి, చిరంజీవి, మెట్రో రైల్ శ్రీధరన్ వంటి పనిరాక్షసుల ఉదాహరణలూ, వారి పాషన్.. అన్నింటికీ మించి “The reason is we are set in wrong blocks, like a square block placed in a round slot and vice versa” అనే ముఖ్యమైన రీజన్.. నేను రాసిన వ్యాసం కన్నా మీ కామెంట్ ని చాలా ఆస్వాదించాను.
I am also one of the people who tries to escape the work and excpects more time at the same time. ఈ ఒక్క లైన్ నేను ఎవ్వరి నుండీ ఇంత నిజాయితీగా ఊహించలేదు. మన బాధ్యతల గురించి ప్రస్తావించినప్పుడు ఎదురుదాడిగా వాదనలకూ, అనవసరపు విశ్లేషణలకూ దిగి మనసులో ఉన్న గిల్ట్ ఫీలింగ్ ని కప్పిపుచ్చుకునే వారినే చూశాను చాలావరకూ. మీ నిజాయితీ నాకు చాలా నచ్చింది. మనం సరైన ట్రాక్ లో లేమన్న ఒక్క గమనింపు చాలు.. అదే మనల్ని బాధ్యతాయుతంగా మారుస్తుంది. ధన్యవాదాలు సర్.