రాము అని ఓ కుర్రాడు ఉన్నాడు.. ఓరోజు నన్ను కలిశాడు. మాటల మధ్యలో “నువ్వేం కావాలనుకుంటున్నావు” అని అడిగాను.
నా వైపు చూస్తూ నవ్వుతూ సిగ్గుపడుతున్నాడు గానీ ఏమీ బదులివ్వలేకపోయాడు. అయినా నేను సమాధానం కోసం వెయిట్ చేస్తుండే సరికి.. నేను వదిలిపెట్టను అని అర్థమై..
“ఆ ఏముంది సర్, ఏ లోటూ లేకుండా జీవితం గడిస్తే చాలు. ఇప్పుడున్న కష్టాలు తొలగిపోతే చాలు” అని సమాధానం ఇచ్చాడు.
రాములాగే మనలో తొంభై శాతం మంది ఉంటారు. సడన్‌గా “నువ్వేమవ్వాలనుకుంటున్నావు” అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరు. కారణం వారికే క్లారిటీ లేదు.
నేను విజయవాడ నుండి తెనాలికి మారాక ICWAI చదువుకుంటున్నప్పుడు తెనాలి బస్టాండ్‌కి వెళ్లేవాడిని. ఏ ఊరెళ్లాలో క్లారిటీ ఉండేది కాదు. అప్పట్లో పిల్లల్ని చదివిస్తూ మా పెద్దక్క చెరుకుపల్లి దగ్గర కావూరులో ఉండేది. బాపట్ల పక్కన మా జమ్ములపాలెం అనే ఊళ్లో మా పెద్దమ్మ ఉండేది.
సో బస్టాండ్‌కి వెళ్లాక ఏ బస్ ముందు వస్తే దాంట్లో ఎక్కేసి వెళ్లేవాడిని. క్లారిటీ లేని వాళ్ల జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి.
ఈ క్రింది రెండు వాక్యాలు గుర్తు పెట్టుకోండి.
“లైఫ్‌ని ఓ లక్ష్యం వైపు మీరు లీడ్ చేస్తున్నారా?”
లేక
“లైఫ్ మిమ్మల్ని లీడ్ చేస్తోందా?”
మనం ఏ లక్ష్యం పెట్టుకోకపోతే లైఫ్ మనల్ని లీడ్ చేస్తూ ఉంటుంది. లైఫ్ అంటే మన మైండ్. మన మైండ్‌కి క్లారిటీ లేకపోతే “నీకెందుకు నువ్వు హాపీగా మూడు పూట్లా అన్నం తిని పడుకో, నీ లైఫ్ నేను నడిపిస్తుంటాగా” అని కర్రపెత్తనం తీసుకుంటుంది.
సో మైండ్‌కి పెత్తనం అప్పగిస్తే అది ఆటో పైలైట్ మోడ్‌లో కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని మనల్ని అటు వైపు నడిపిస్తుంది. అవేంటంటే..
- మీ పాత జ్ఞాపకాలు, గాయాలు, అవమానాలు
- భవిష్యత్ పట్ల మీకున్న భయాలు
- మీ ఎమోషన్స్, మీలో మీరు మాట్లాడుకునే సెల్ఫ్ టాక్.
సో గతంలో మీకు ఎవరో అన్యాయం చేశారు అనుకోండి. అది పాత జ్ఞాపకం కదా! మీ మైండ్‌కి పెత్తనం ఇస్తే ఇక అది ఇలా చెబుతూ ఉంటుంది. “ఈ మనుషులంతా స్వార్థపరులు, మోసం చేస్తారు, ఎవరితో కలవకు” అని మిమ్మల్ని గైడ్ చేసి, లీడ్ చేసి, మీరు ఇతరుల్ని నమ్మకుండా చేస్తుంది. సో ఇక ఇతరుల్ని కవలకపోతే, నమ్మకపోతే మనుషులతో కూడిన ఎదుగుదల ఎక్కడ సాధ్యపడుతుంది?
“నువ్వెందుకు ఇతరులతో కలవవు?” అని మీ వాలకం చూసిన బయట ఎవరైనా అడిగారు అనుకోండి. “జనాలంతా దొంగలు, మనల్ని దోచుకోవడం తప్పించి రిలేషన్ కి వేల్యూ ఇవ్వరు” అని మీ మైండ్ తన ఆటోపైలైట్ ప్రవర్తనని సమర్థించుకోవడానికి సృష్టించిన ఓ లాజిక్‌ని మీకు అందిస్తుంది. దాన్నే పైకి మాటలతో సమాధానం చెబుతారు.
అంటే మైండ్‌కి పెత్తనం వదిలేస్తే అది గతం తాలూకూ ఎమోషనల్ స్ట్రెస్‌ని నిరంతరం క్యారీ చేస్తూ మీలో పాజిటివ్ ఆలోచనలు లేకుండా చేస్తుంది.
అలాగే “ఈ పని నా వల్లేం అవుతుంది” అని మీకు మీరు ఎప్పుడూ చెప్పుకునే సెల్ఫ్ టాక్ని ఆధారంగా తీసుకుని.. “హాయిగా రెండు ముద్దలు బువ్వ తిని బబ్జోమ్మా” అని మిమ్మల్ని బుజ్జగించి ఎందుకూ పనికి రాని వాళ్లుగా చేస్తుంది.
అందుకే మైండ్‌కీ, జీవితానికీ పెత్తనం ఇవ్వకూడదు. మనకు మనం పెత్తనం తీసుకోవాలి. నా ఎనర్జీ మొత్తం ఫలానా లక్ష్యం సాధించడానికి వినియోగించాలనుకుంటున్నాను అని బలంగా నిర్ణయించుకోవాలి.
నిర్ణయించుకున్న వెంటనే సరిపోదు.. దానికంటూ మీ బలాలేంటి, బలహీనతలేంటి, ఎంత టైమ్ పెట్టుకుంటున్నారు, ఏరోజుకి ఎంత పని చేస్తున్నారు ఇలా ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకుంటూ వెళ్లాలి.
ఉదా.కి.. మీరు హైదరాబాద్ నుండి విజయవాడ బయల్దేరారు అనుకోండి. విజయవాడలో ఉన్న మీ బంధువు మధ్యలో కాల్ చేసి “ఎంత వరకూ వచ్చావు” అని అడిగితే..
ఇప్పుడే ఇబ్రహీంపట్నం దాటాను బాబాయి, మరో గంటలో అక్కడ ఉంటాను” అని క్లారిటీతో చెప్పేదానికీ, “ఏమో తెలీదు బాబాయ్, నాతో పెట్టుకోకుండా మీరు తినేయండి” అని చెప్పే దానికీ చాలా వ్యత్యాసం ఉంటుంది కదా!
ఇలా ప్రతీ విషయంలో క్లారిటీ ఉండాలి. మన పనులకు ఓ ప్రణాళిక ఉండాలి, అవి ఎలా సాగుతున్నాయో ట్రాక్ చేసుకోగలగాలి.
- Sridhar Nallamothu