నిజం కన్నా అబద్ధం విపరీతంగా భయపెడుతుంది..
మనం భయాలన్నీ అబద్ధాలే. రేపెప్పుడో “ఇలా జరుగుతుందేమోనని” శంకించి విపరీతంగా ఆలోచించేసి.. ఏదీ జరగకుండానే జరిగిన దానికన్నా ఘోరంగా మానసిక చిత్రవధను అనుభవించే భయాలన్నమాట.
భయం అంటువ్యాధి లాంటిది.. ఒకళ్లు భయపడడంతో ఆగిపోరు. మనల్నీ భయపెడతారు. సంపాదన గురించి భయాలు, కెరీర్ గురించి భయాలు, ఫ్యామిలీ లైఫ్ గురించి భయాలు, ఆరోగ్యం గురించి భయాలు, జీవితం గురించి భయాలు.. టివిల్లోనో, పేపర్లలోనో, Facebookల్లోనో కధనాలు కధనాలుగా మోసుకొచ్చి ప్రశాంతంగా ఉన్న మనస్సుని కలిచివేసే భయాలే.
ఒక సంఘటన ఒకరికి జరిగినంత మాత్రాన ఆ సంఘటన, ఆ పరిస్థితి మనకు ఎదురవుతుందనుకోవడం ఖచ్చితంగా భయమే. కానీ మనం అమాయకత్వం కొద్దీ బుర్ర నిండా ఇలాంటి భయాలే మోసుకు తిరుగుతున్నాం.
———————
ఒక భయం పూర్తయిపోయి.. మరో భయం పట్టుకోబోవడానికి మధ్యన మనం ఊపిరి పీల్చుకుంటున్న కొన్ని క్షణాలే మనకు “సంతోషం” అంటే ఏమిటో అనుభవిస్తున్నది. రకరకాల ఇన్సెక్యూరిటీల మధ్య జీవితం హరించుకుపోతోంది. ఆలోచించొద్దన్నా.. విపరీతంగా ఆలోచించేస్తున్నారు.. బట్టతలలు వచ్చేలా… సగం లైఫ్‌లోనే వృధ్యాప్యం ముంచుకొచ్చేటంత వేగంగా, దీర్ఘంగా ఆలోచించేస్తున్నారు.
మనకు తెలుసు… ఏ క్షణమైనా నాలుగు ముద్దలు నోట్లోకెళ్లగలవని! మనకు తెలుసు ఇంకా 20, 30, 40, 50నో ఏళ్లు మాత్రమే బ్రతుకుతామని. ఆ కొద్దేళ్లు మన జీవితానికి ఎలాంటి ఢోకా లేదని! అయినా దేన్నో గుర్తుతెచ్చుకుని ఒళ్లు జలదరించుకోవాలి.. కలవరపడాలి.. కలత చెందాలి.. ఏ విషాదంలోనో, విచారంలోనో మునిగి తేలాలి.
మన స్వంత భయాలే కాదు. సొసైటీలోని భయాలూ నెత్తినేసుకుని తిరగాలి. సొసైటీలో జరిగే దుర్ఘటనలపై భయపడడమూ, బాధపడడమూ చెయ్యకపోతే సామాజిక బాధ్యత లేనట్లు అనేసుకుంటాం. మనకు మానవత్వం ఉందని నిరూపించుకోవడానికీ.. సామాజిక బాధ్యత ఉందని నిరూపించుకోవడానికీ.. టివిలు అదే పనిగా చూస్తూ… కాలిపోయిన శరీరాల్ని చూసి.. “అబ్బా..” అనుకుంటూ ఎమోషనలైజ్ అవ్వాలి. అప్పుడే మనకు సంతృప్తి. ఆ ఎమోషన్ల ద్వారా మనలో మనకు తెలీకుండానే పేరుకుపోతున్న అభద్రత మనకు అర్థం కాదు. నిన్న GAIL గ్యాస్ పైప్లైనూ, మొన్న బియాస్ విద్యార్థుల గల్లంతూ, అటుమొన్న నిర్భయ, వరదలు, తుఫాన్లు ఎన్నో.. జీవితం పట్ల భయాన్ని ప్రేరేపించేవి.
మొన్న బియాస్ దుర్ఘటన సమయంలో తెలిసిన ఒకరు నాలుగు రోజులు అదే పనిగా టివి చూస్తూ.. తెలీకుండానే ఆ నెగిటివ్ ఎమోషన్లనీ, బాధనీ పెంచేసుకుని… హార్ట్ అటాక్ వచ్చిందేమోనన్నంత భయపడేలా panic attackకి గురయ్యారు. ఇలాంటి వాటికి ఎంతమంది లోనవుతున్నారో ఎవ్వరికీ పట్టదు.
—————————
లైఫ్ చాలా ప్రశాంతమైన నది లాంటిది. దాంట్లో మనమే చిన్నవీ, పెద్దవీ రాళ్లు విసిరేసి.. అల్లకల్లోలం చేసేసి.. జీవితం చాలా దారుణంగా తయారైపోయిందని బాధపడిపోతున్నాం. మనస్సుని నిర్మలంగా ఉంచుకుంటే, ఏ భయాల్నీ మనస్సు జోలికి రానివ్వకుండా ఉంటే జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో మీరే చవిచూడండి.
భవిష్యత్ ఎలా ఉంటుందోనన్న భయంలోనే మీ వర్తమానం అంధకారం అవుతోందన్నది ఫస్ట్ గ్రహించండి. ఈరోజు, ఈ క్షణం మీరు ప్రశాంతంగా లేరంటే.. రేపు ఎన్ని ఫైనాన్షియల్ ప్లానింగులు చేసుకున్నా, కెరీర్, హెల్త్, లైఫ్ గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లైఫ్ అప్పటికీ సంతోషంగా ఉండదు. ఫస్ట్ ఈ క్షణం సరిదిద్దుకోండి.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
Chala baga chepparu! It is very comforting and assuring. Positive thinking nu gurthu chesaru.