Stress.. సొసైటీని చూసి స్ట్రెస్, అందరి కంటే మెరుగ్గా ఉండాలని తాపత్రయపడీ.. పోటీపడీ స్ట్రెస్..
సాయంత్రమైతే GVK Oneలో, Inorbitలో, Forum mallలో ప్రపంచాన్ని మర్చిపోయి వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి షాపింగ్ చేసి సంతోషాన్ని మూటగట్టుకోవడం కోసం.. విపరీతంగా సంపాదించే క్రమంలో పేరుకుపోతున్న స్ట్రెస్..
రోడ్ మీద పరిగెడుతున్న లేటెస్ట్ మోడల్ కారుని చూసి ముచ్చటపడి టార్గెట్ పెట్టుకుని, కొన్ని నెలలకు ఎలాగైనా దాన్ని కొనేసేయడానికి పెంచుకుంటున్న స్ట్రెస్..
పొట్టకోస్తే అక్షరం ముక్క రాని పక్కోడు.. భారీ ప్యాకేజ్ జాబ్ కొట్టేస్తే.. మన ఆర్థిక స్థితి చూసి మనపై మనం జాలి పెంచుకుని, మనల్ని మనం తిట్టుకుని కుమిలిపోయే తెలీని దిగులు లాంటి వత్తిడి..
“నేను నా ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను.. సంతోషం నా మనస్సులో మాత్రమే ఉంది.. మెటీరియల్స్‌లో, మనుషుల్లో ఎంతమాత్రమూ లేదనే” మెచ్యూర్డ్ ఆలోచనా విధానం నుండి అన్నింటి మాయలో పడిపోయి నిరంతరం అసంతృప్తిగా కదలాడే వత్తిడీ.. ఎప్పటికప్పుడు తోటి మనిషి కంటే వెనుకబడిపోతున్నామని కంపారిజన్లతో జీవశ్చవంలా బ్రతికేస్తున్న స్ట్రెస్..
వత్తిడికి నరాలు తెగిపోతున్నాయట.. నిద్ర పట్టట్లేదట.. యోగానో, మెడిటేషనో ప్రాక్టీస్ చేయాల్సొస్తోందట.. అయినా ఆ క్షణమే.. మళ్లీ పరుగూ, వత్తిడీ కామనే కదా!
——————–
దేవుడు అందరికీ ఆయుష్షు సమానంగా ఇచ్చాడు..
ఇక్కడ కొంతమంది ముసలితనంలో మంచాన పడతామనీ, చూసే వాళ్లు ఉండరనీ, ఆర్థికంగా మెరుగ్గా ఉండాలనీ, అలాగే యవ్వనంలో విలాసంగా బ్రతికేయాలనీ, అలా బ్రతకడమే ఆనందమనీ భావించేసి వత్తిడి పెంచుకుని ఆయుష్షుని తగ్గించుకుంటున్న వాళ్లు చాలామంది! పెద్ద వయస్సుని ప్లాన్ చేసుకోవడం కోసం పెద్ద వయస్సు రాకముందే హార్ట్ అటాక్‌లతో చనిపోయే వారూ, చిన్న వయస్సుని వత్తిడితో భారంగా గడిపేవారూ ఎక్కువయ్యారు.
ఆనందం మనస్సులో ఉంటుంది.. వస్తువుల్లోనో, విలాసాల్లోనో కాదు. ఇది సత్యం. కొన్నిసార్లు నేనూ వస్తువుల్లో ఆనందాన్ని చూస్తాను.. ఉదా.కు.. నా edge ఫోనంటే నాకు చాలా ఇష్టం. కానీ ఆ ఆనందం దాని వైపు చూసినప్పుడే. నా ఆనందమంతా నా మనస్సులో దాగి ఉంటుంది. ఆ ఆనందానికి ఎలాంటి రీజన్స్ అవసరం లేదు.
ఉన్న క్షణాన్ని సంతోషంగా బ్రతకడం వరం. ఈ క్షణాన్ని నరకం చేసుకుని రేపు సుఖంగా బ్రతుకుదామనుకోవడం ఓ పెద్ద భ్రమ. ప్రతీ ఒక్కరికీ కొద్దో గొప్పో విచక్షణ ఉంటుంది. ఈ క్షణంలో సంతోషంగా ఉండడమంటే జీవితం మీద బాధ్యత లేకపోవడం కాదు, రేపటి గురించి ఆలోచన లేకపోవడం కాదు. అన్నీ ఉండాలి కానీ చాలా పరిమితమైన ప్లానింగే కావాలి. జీవితం మొత్తం ప్లానింగ్ అయిపోయిన క్షణం ఆనందం ఆవిరైపోతుంది. అన్కండిషనల్గా, ఫ్రీ ఫ్లోలో జీవితం సాగాలి.
షాపింగులు చెయ్యడం తప్పు కాదు, సినిమాలకు వెళ్లడం తప్పు కాదు, ఫ్రెండ్స్‌తో డిన్నర్లు చేసుకోవడం తప్పు కాదు.. కానీ అన్నింటి కంటే ఆనందం మనస్సులో ఉంది. అది గుర్తించిన క్షణం సమాజానికి డిటాచ్ అయినప్పటికీ కూడా మనం సంతోషంగానే ఉంటాం. అలాంటి సహజమైన సంతోషం మనిషికి కావాలి. దాన్ని హృదయంలోంచి వెలికి తీయాలి.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply