సాయంత్రం మా ఊరికే చెందిన ఓ పెద్దాయన ఆప్యాయంగా పలకరించడానికి వచ్చారు… స్వతహాగా రైతు.. దాదాపు ఆరవై ఏళ్ల పైబడిన వయస్సు..
యోగక్షేమాలు అయ్యాక.. వ్యవసాయం గురించి, వర్షాలూ, నారుమళ్ల గురించి మాటలు సాగాయి…
“ముప్పై మూడో నాడు ఏమవుతుందో గానీ… చుక్క వాన లేదు” అంటూ భలే ఫ్లోలో మాట్లాడేస్తూ పోతున్నారాయన. “ముప్పై మూడో నాడు ఏమవుతుందో” అనేది ఆయన ఊతపదం. చిన్నప్పటి నుండి ఊళ్లో మా తాతయ్య, వాళ్ల ఫ్రెండ్స్ సాయంత్రానికి అరుగుల మీద కూర్చుని.. కొంత అమాయకత్వంతోనూ, కొంత అవగాహనతోనూ చెప్పుకునే ఇలాంటి కబుర్లు వాళ్లని సూపర్‌మేన్‌లుగా చాలా అడ్మైరింగ్‌గా చూస్తూ వినడం అలవాటైపోయి ఉండడం వల్ల ఆయన మాటలు నాకు భలే నచ్చాయి.
ఎప్పుడెక్కడ ఎలా ఉన్నా.. నా మనస్సులో కదలాడే భావాలను జాగ్రత్తగా గమనించడం నాకు ఎప్పుడూ అలవాటు. అందుకే ఇలాంటివి అన్నీ రాయగలుగుతున్నాను. అలా థాట్ ప్రాసెస్‌ని గమనించే ప్రక్రియలో అర్థమైన విషయం.. ఆయన మాట్లాడుతుంటే ఎన్నాళ్లైంది ఇలాంటి మాటలు విని అని ఓ రకమైన సంతోషమూ, ఆ పిచ్చాపాటీ సంభాషణ ఓ పక్కన నా సమయం ఎంత kill చేస్తోందో.. ఇతర ప్రయారిటీలు గుర్తొచ్చి అంత అసహనమూ పేరుకుపోయేలా చేసింది. అదంతా పనుల వత్తిడిచే, లైఫ్స్టైల్చే ఇన్ఫ్లుయెన్స్ చెయ్యబడిన ఇన్స్టెంట్ ఎమోషన్. బట్ నాకు తెలుసు.. వందల మంది సమకాలీనులతో గడిపే దాని కన్నా ఒక్కరు అనుభవజ్ఝులతో కాసేపు మాట్లాడితే చాలు.. ముఖ్యంగా ముందు తరాలతో ఎంతసేపు మాట్లాడినా నష్టం లేదు. లాభం తప్పించి!!
అసలు అలాంటి స్వచ్ఛమైన పడికట్టు పదాలు వినే అదృష్టం మన అసహనంతో కాలదన్నుకుంటున్నాం. వాళ్లకేం తెలీవని అనుకుంటున్నాం.. పాత తరాలూ, పాత చింతకాయ పచ్చడీ అనుకుంటున్నాం.. “కదిలిస్తే ఏదో సోది చెప్తారు.. అది వినే ఓపికా, తీరికా నాకు లేవు” అని కసురుకుంటున్నాం.
—————–
మనలో పేరుకుపోయిన వత్తిడీ, హడావుడీ వాళ్లు మెల్లగా మాట్లాడే మాటల్లో reflect అవుతోంది. వాళ్లు సాగదీసి.. ఏదో సోది చెప్తున్నారని అనేసుకుంటాం గానీ అంత నెమ్మదిగా, ప్రశాంతంగా, నిదానంగా మాట్లాడగలుగుతున్నారంటే మనలో చచ్చిపోయినా.. వాళ్లలో సజీవంగా ఉన్న ఓపికగా ఎందుకు అర్థం కావట్లేదు మనకు?
మనకన్నీ వేగంగా జరిగిపోవాలి… మాటలూ సూటిగా, సుత్తి లేకుండానే ఉండాలి. నాబోటి వాడు ఇలాంటివి పేరాలు పేరాలు రాసినా… “ఇది చదివే ఓపిక ఎవడికుంది బాస్.. ఒకటి రెండు లైన్లలో చెప్పొచ్చు కదా” అనేస్తున్న వాళ్లెందర్నో చూస్తే నవ్వొస్తుంది.
అస్సలు మనకు ఏ పని చెయ్యడానికి ఓపిక మిగిలి ఉంది? అస్సలు ఓపికంటూ ఒకటి ఉండి చచ్చిందా? ఓపికే లేనప్పుడు తినే తిండి ఏమైపోతోంది?
———–
అత్యంత విలువైన తరాలు అంతరించిపోతున్నాయి.. మన బంధువుల్లో కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్లు ఒక్కొక్కరు చనిపోతుంటే.. “పాపం పోయారు” అని మొక్కుబడిగా అనేసుకుంటున్నాం తప్పించి.. వాళ్లు భౌతికంగానే పోవట్లేదు… వాళ్లతో పాటు వాళ్ల జీవితకాలం గ్రహించిన జీవనసారమూ సమాధైపోతోంది. వాళ్లు మన కళ్ల ముందు కదలాడినప్పుడూ వాళ్లేమిటో మనకు అర్థం కాలేదు, వాళ్ల శరీరాలు కాలిపోయాకా వాళ్ల విలువ మనకు తెలీట్లేదు.
“ముసిలోళ్లకు, ముసలమ్మలకు పద్ధతి తెలీదు, నాగరికత తెలీదు.. వాళ్లు చాలా ఛాదస్తంగా ప్రవర్తిస్తారు.. శుభ్రత అస్సలు పాటించరు..” ఎప్పుడూ ఇవే కంప్లయింట్లు అందరి నోటా!
కానీ వాళ్ల పక్కన కూర్చుని వాళ్లు చెప్పే మాటలు కధల్లా వినండి… ఓపిక తెచ్చుకుని వినండి… మనకు తెలీని కొత్త ప్రపంచం, మనం కళ్లు తెరవకముందే సాగిపోయిన అద్భుతమైన ప్రాపంచిక సారం వాళ్ల కళ్లల్లో కదలాడుతుంది. దాన్ని ఒడిసిపట్టుకోగలిగితే చాలు… బుర్రనిండా గ్రహిస్తే చాలు… జీవితం మొత్తం అర్థమవుతుంది.
కావలసిందల్లా ఓ మనిషి దగ్గర ఒదిగి వినయంగా, ఓపికగా చెవులు అప్పగించి కూర్చుని వినడం, గ్రహించడం, విశ్లేషించడం మాత్రమే.
ఈరోజు ఈ మాటలు చదివే ఓపికా, మీ చుట్టూ ఉన్న ముసలోళ్లు చెప్పే మాటలు వినే ఓపికా మీకు లేకపోతే.. it’s up to you.. మిమ్మల్ని మీరు ఎలా జమకట్టుకున్నా, మీ ఓపికలేమికి ఎలాంటి సమర్థింపుని జోడించుకున్నా.. హ్యాట్సాఫ్ చెప్పడం తప్పించి చెయ్యగలిగిందేమీ లేదు.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply