"సుత్తి లేకుండా సూటిగా చెప్పేయ్" డైలాగ్ ఏదో బాగుంది… నిజమే కదా అన్పించేది మొదట్లో! కానీ అది బద్ధకస్థుడి అసహనంగా తోస్తోంది… ఈ మధ్య ఇలాంటి ముక్తసరి, ముక్కుసూటి మాటల వల్ల మనుషుల మధ్య ఏర్పడుతున్న అపార్థాలను గమనిస్తుంటే!!
వాడాల్సిన చోట మాటలు పొదుపుగా వాడాల్సిందే! కానీ…. లోపల real feelనే మిస్ అయ్యేలా కట్ చేసి మాట్లాడడం మాత్రం చాలా bad habit.
ఈరోజు మనుషులు మొండిగా తయారవ్వడానికి, అన్నీ తమకు తెలిసినవే అనుకోవడానికీ, ఎవరు చెప్పేదీ వినకుండా పోవడానికీ కారణం…. "బేసికల్గానే ఓపిగ్గా వినే, చదివే, గ్రహించే" లక్షణాలు కోల్పోవడం!
మనిషి మాట్లాడుతుంటే ఓపిగ్గా వింటే విషయం పూర్తిగా అర్థమవుతుంది…. ఒక్క మాట మాట్లాడగానే మధ్యలో కలగజేసుకుని పది మాటలు మనం రిటర్న్ మాట్లాడితుంటే విషయాలు ఏం అర్థమవుతాయి?
పేరాలు పేరాలు చదవలేరట… మళ్లీ అది చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు 🙂 చదివే ఓపికే లేని మనకు బ్రతకడానికి ఎంత ఒళ్లు బరువో తెలీట్లేదూ!!
చదవడం, అర్థం చేసుకోవడం, బుర్రకు ఎక్కించుకోవడం ఓ కళ…. అభ్యాసం… జీవితాన్ని మెరుగైన స్థితికి తీసుకెళ్లే path. దాన్ని వదులుకుంటే ఎలా?
మాటలు sms షార్ట్ కోడ్లా ఉండడానికీ, సినిమాల్లోని పంచ్ డైలాగుల్లా 2 లైన్లలో మాట్లాడుకోవడానికి జీవితం ఏమీ షార్ట్ ఫిల్మ్ కాదూ… రెండున్నర గంటల్లో ముగిసిపోయే తెలుగు సినిమానూ కాదు…
మన బుర్రలు ఎంత బద్ధకిస్తున్నాయో మనం గ్రహించట్లేదు.. ఎవరి సంగతో ఎందుకు ఇలాంటి మనుషులతో గడిపీ గడిపీ నాకూ కొంత overlook నేచర్ అంటుకుంది…. గతంలో పేజీలు పేజీలు ఓపిగ్గా చదివి అర్థం చేసుకునే నేను ఒక పేరాలో అక్కడో లైనూ, ఇక్కడో లైనూ చదివేసి అంతా అర్థమైందనే ఫీలింగ్‌కి వచ్చేస్తున్నాను… ఇది తప్పు కాదూ…..?
ఇలాంటి తప్పుల్ని సరిచేసుకోమని ఎవరు చెప్తారు… మనకు మనం గుర్తించి సరిచేసుకోపోతే? నాబోటి వాడు ఎవరైనా చెప్పినా కనీసం ఇలాంటివి చదివే ఓపిక కూడా ఉండనప్పుడు ఇక బ్రెయిన్ షార్ప్‌గా ఎక్కడ ఉంటుంది?
gn, tc, tq, svsc… ఇలా ప్రతీదీ షార్ట్ చేసుకుంటూ పోవడం, అదేదో ట్రెండ్‌లా ఫాలో అయిపోవడం గొప్ప మాత్రం కాదు…. ఇది గ్రహించిన రోజున మనకు పోయిన ఓపిక తిరిగి వస్తుంది.
మీరు వివరంగా మాట్లాడందే మీ ఏ రిలేషనూ సరిగ్గా నిలబడదు.. అరే… చాలా డీటైల్డ్‌గా రాస్తుంటేనే, మాట్లాడుతుంటేనే జనాలు అపార్థాలు చేసుకుంటున్నారే… చిన్న చిన్న ముక్కలు రాసేసి/మాట్లాడేస్తుంటే జనాలు భుజాలు తడుముకుని మనకు దూరం అయిపోవట్లేదా?
నేను అప్పుడప్పుడు 2 లైన్లలో రాసే వాటికే.. "ఇందులో చాలా మీనింగులున్నాయే" అని చనువుగా ఫోన్లు చేసి అడిగే మిత్రులూ ఉంటారు… ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం డీటైల్డ్‌గా ప్రవర్తించనంతకాలం రిలేషన్లు బలంగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఉండవు. అలాగే మన బుర్రలూ బద్ధకంగా మొద్దుబారిపోతాయి…
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అనుకుంటే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Leave a Reply