అమ్మా నాకు భయంగా ఉంది… అని తల్లిని కొంగు చాటుకి దూరిపోయే పిల్లల్ని చూస్తుంటాం…
తెలీని భయాల పట్ల వారికున్న ఇన్సెక్యూరిటీని పారద్రోలడానికి వాళ్లకు కన్పించిన ఆలంబన అమ్మ!
అలా పిల్లలు తనకు అటాచ్ అవడం చూసి.. అమ్మ అనుకుంటుంది “నేను లేకపోతే వీళ్లేమైపోతారో” అని… ఓ నిస్సహాయ స్థితిని చూసి కరుణతో, జాలితో ఏర్పడే అటాచ్మెంట్ అది..
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే…
—————————————-
మనం గొప్ప అటాచ్‌మెంట్‌లుగా భావించే అనేకం మన అభద్రత నుండో, జాలి మూలానో బలపడేవే!
మనం భద్రంగా ఉండాలి… సోషల్‌గా ఎంత సెక్యూర్డ్‌గా ఉంటే అంత ధైర్యం మనకు..
అందుకే మనుషుల్ని ఎంతగానో అభిమానిస్తాం, ప్రేమిస్తాం, ఫ్రెండ్షిప్ చేస్తాం, ఆశిస్తాం… వారు మనకు అండగా ఉన్నారన్న విషయాన్ని తలుచుకుని గొప్పగా ఫీలవుతాం…
“నాకు ఫలానా వాళ్లు తెలుసు” అని గొప్ప గొప్ప వాళ్ల పేర్లు మనం ఇష్టమొచ్చినట్లు వాడి పారేయడానికి ఉండే కారణాల్లో ఇదొకటి! వాళ్లు మనకు తెలిసి ఉంటే మనకు మానసికంగా రక్షణ లభిస్తుందన్న ధీమా!
————————————————–
మనల్ని గొప్పగా ప్రేమించే వాళ్లు ఎవరూ లేకుండా… ఏక్ నిరంజన్లుగా బ్రతకడం మనకు భయం…
“బంగారం, కన్నా, చిన్నా, బుజ్జీ, పండూ…” అని పిలుపించుకోవాలి… ముచ్చట పడాలి… సంతోషపడాలి… అంత ప్రేమగా మాట్లాడేవారు ఉన్నారని గర్వపడాలీ!
వాస్తవానికి ఇందులో తప్పేం లేదు… ప్రేమని పొందొచ్చు, ప్రేమని కోరుకోవచ్చు….
——————————–
కానీ…. ప్రేమని కోరుకోవడం అభద్రత నుండో, ప్రేమని కురిపించడం జాలి నుండో పుట్టకూడదు!
ఓ అమ్మాయి సెల్‌ఫోన్ పోయిందని update పెడితే… లేదా జ్వరం వచ్చిందనో, ఇంకోటో పెడితే ఫిజికల్‌గా వెళ్లకపోయినా మానసికంగా వెళ్లి జాలితో జండూబామ్‌లు రాసొచ్చే జాలిపరులు మెండు మన లోకంలో!
అలాగే ఓ అమ్మాయో, అబ్బాయో పీకల్లోతు కష్టాల్లో కూరుకుని అభద్రతతో ఒణికిపోతుంటే…. “నీకెందుకు నేనున్నాను… నా వళ్లో తల పెట్టుకో, జాగ్రత్తగా ఉంటుంది” అని భరోసా సహజంగానే మనం ఇస్తుంటాం.. కొన్నిసార్లు అది అవసరం కూడా కావచ్చు.
కానీ ఆ అభద్రతలో ఉన్న మనిషి మనస్సు కొంత కుదట పడ్డాక… సాయం చేశామన్న కారణం కొద్దీ మనమో… సాయం పొందామన్న కృతజ్ఞత కొద్దీ వాళ్లో…. నిరంతరం మనతో అటాచ్ అయి ఉంటారు… అలా అటాచ్ అయి ఉండడం వల్ల పొసెసివ్‌నెస్ పెరుగుతుంది. ఈ వ్యక్తి మనకే స్వంతం అన్న స్థాయికి అది చేరుతుంది. ఆ పొసెసివ్ నెస్ తట్టుకోలేక “నీతో నా వల్ల కాదు” అని ఎవరో ఒకరు దూరంగా వెళ్లిపోయే స్థితీ వస్తుంది… అంతే ఆ తిరస్కార ధోరణి కాస్తా అభద్రతగా మళ్లీ మొదటికొస్తుంది.
———————————————–
ఈ క్షణం ఆనందంగా ఉంటే మరు క్షణం ఏం జరుగుతుందో అని బాధపడే పిరికి స్వభావం మనది. ఆ పిరికితనాన్ని పోగొట్టుకోవడానికి… కబుర్లు చెప్పీ, జనాల్ని పొగిడేసీ, వారి అవసరాలు తీర్చీ, డబ్బుతో ఆడించీ, అందంతో మాయచేసీ.. ఇలా రకరకాల టక్కు టమార విద్యలతో మనం మనుషుల్ని కూడగట్టుకుంటూనే ఉంటాం.. వారందరూ మనతో ఉన్నారన్న ధైర్యంతో ప్రశాంతంగా నిద్రపోతున్నాం..
—————————-
ఏవైతే అటాచ్మెంట్లు పెంచుకుంటున్నామో అవి ఇన్సెక్యూరిటీని పోగొట్టడం మాటెలా ఉన్నా… మనం ఇష్టపడే వాళ్లు మనకు తగ్గట్లే ప్రతీ క్షణం ఉండాలి అన్న మూర్ఖపు స్థాయికి మన అటాచ్మెంట్లు పెరిగిపోవడం వల్ల దారుణంగా మనస్సులకు గాయాలు చేసుకోవలసి వస్తోంది.
అందుకే భయం కొద్దీ జనాల్ని పోగేసుకోకండి… డబ్బునీ, సోషల్ స్టేటస్నీ పెంచేసుకోకండి… ఏ జనాలూ మిగలరు, చివరకు మిగిలేది హిమాయాల ఎత్తులో మనకు మిగిలేది నిరాశే!!
అలాగే జాలి కొద్దీ మనుషులతో అటాచ్ అవకండి… ఇవ్వాళ ఒళ్లో తలపెట్టుకుని పడుకున్నారు కాబట్టి జీవితాంతం మన ఒళ్లో తలపెట్టుకుని బ్రతికేస్తారు.. మనం ధీరోధాత్తుల్లా, భగవత్ ప్రతినిధుల్లా వారికి రక్షణగా నిలవొచ్చు అన్నంత పైత్యం ప్రకోపించవచ్చు. అదీ నిరాశకే దారి తీస్తుంది. కొంత మానసిక స్థైర్యం వచ్చాక ఎవరి దారిలో వాళ్లు వెళ్లిపోతారు… మనం జాలి చూపించాం కదా అని మనతో ఎవరూ జీవితాంతం అటాచ్ అవ్వాల్సిన అవసరం లేదు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
చాలా చక్కగా చెప్పారు