వారెవ్వా… ఏం మాటలు ఏం మాటలు…..
అయ్యో మీ కాల్ చూసుకోలేదండీ.. ఆగండి ఇప్పుడే చూస్తాను…
మీరు పింగ్ చేశారు కానీ వర్క్‌లో ఉండి రిప్లై ఇవ్వలేకపోయా…
వారం రోజులుగా చాలా బిజీగా ఉన్నాను… ఎవరితోనూ మాట్లాడడం లేదు.. అందుకే నో రిప్లై వచ్చి ఉంటుంది.. సారీ అండీ…
……………..
ఇలాంటి వివరణలు అవసరం లేనంత చనువు ఎదుటి మనిషితో లేనప్పుడు… ఇలా వివరణలు ఇచ్చుకోవడం ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది?
ఇలాంటి వివరణలు అవసరం లేకపోయినా… ఇచ్చేటంత దూరం మనస్సుల్లో ఉన్నప్పుడు కూడా అంతే కష్టంగా ఉండదూ?
ఒక్క సంజాయిషీ చాలు.. మనుషుల్ని దగ్గర చేయాలన్నా, దూరం చేయాలన్నా! అదే అమృతమూ, విషమూ కూడా!!
మన రిలేషన్లు మాటల మధ్య మొగ్గలు తొడుగుతాయి..
మాటల ఎరువుతో బలాన్ని పుంజుకుంటాయి..
ప్రతీ మాటా తూచబడుతుంది… కొన్నిసార్లు బరువుగానూ తూగుతుంది.. కొన్నిసార్లు పేలవంగానూ మిగిలిపోతుంది.
కొన్నిసార్లు నిన్నటి మాటలు నేటి ప్రవర్తనకి సాక్ష్యాలుగా తీసుకోబడతాయి.. "నిన్న నువ్విలా మాట్లాడావు కాబట్టి ఇవ్వాళ నేనిలా మాట్లాడుతున్నా" అని నోరు మూయిస్తాయి.
"అది కాదబ్బాయ్.. నువ్వా ముక్కేదో ముందే నాకు చెప్పేసి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదు కదా" వంటి డైలాగులూ తరచూ విన్పిస్తుంటాయి. చేయదలుచుకుంటే అంతదాకా రాకుండా ఆపగలిగే శక్తి ముందే ఉండీ… అహం అడ్డొచ్చి.. అహాన్ని సంతృప్తిపరుచుకోవడం కోసం మాట్లాడే మాటలు అవి.
బంధాలకు మధ్య సంజాయిషీలూ, వివరణలూ, అపార్థాలూ అస్సలు అవసరమే లేదు.. ఆ ఇరువురు వ్యక్తులూ ఒకే రకమైన తెలివితేటలు కలిగి ఉన్నప్పుడూ.. ఒకే రకమైన ఎమోషనల్ బ్యాలెన్సింగ్, వేవ్ లెంగ్త్ కలిగినప్పుడూ!
ఎక్కువ ఊహించేసుకుని బాధపడి కుమిలిపోయే చిన్నపిల్లల తరహా మనస్థత్వాల దగ్గర సముదాయించడం కోసం వివరణలు ఇచ్చుకోవడం సబబు గానీ… అంతా అర్థమై కూడా అర్థం కానట్లు ప్రవర్తించే మనుషుల దగ్గర ఎన్ని వివరణలు ఇచ్చుకుని ఏం లాభం?
మాటలతో ఫుట్‌బాల్ ఆడేసుకోవచ్చు… ఎటు తంతే అటు పడతారు జనాలు… మాట్లాడడంలో ఎంత టెక్నిక్ తెలిస్తే.. అంతలా పెదాల చివర నవ్వు కన్పించకుండా లోపల్లోపల నవ్వుకుంటూనే ఏదైనా మాట్లాడేసుకోవచ్చు 🙂 అది గొప్ప అన్పిస్తుంది మనకు!!
అమాయకంగా మాటల మాటున మనుషుల్ని వెదుక్కునే ప్రాణాలకు మాత్రం ఈ మాటల ఆటలో నెగ్గుకురాలేకా.. ఈ మనుషుల మధ్య గొంతు పెగుల్చుకోలేక మాట మూగబోతుంది కూడా!! 🙁
గమనిక: ఇది ఎవరికైనా పనికొస్తుంది అన్పిస్తే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Leave a Reply