గుండె నిండా ఊపిరి పీల్చుకుని అరక్షణం కళ్లు మూసి మరుక్షణం కళ్లల్లో వెలుగులు నింపుకుని మనస్సుని సంతోషపెట్టుకునేది విజయమంటే..!!
మన లక్ష్యాలు, మన విజయాలూ, వాటి మధుర స్మృుతులూ మన కళ్లతో అనుభవించవలసిన స్వప్నాలు..
ప్రపంచం కళ్లతో ఆస్వాదించాలనుకునేది కాదు "విజయం".
మనుషుల సమూహాల మధ్య బ్రతికేస్తున్నాం కాబట్టీ.. మంచీ చెడూ అన్నీ ఆ సమూహాలతో పంచుకోవడం అలవాటైపోయింది కాబట్టీ… మన కళ్లతో తృప్తి తీరక సమూహాల కళ్లతో మన ఆనందాల్ని రెట్టింపు చేసుకునే తాపత్రయంలో… సంతోషపడుతున్నాం, చిన్నబుచ్చుకుంటున్నాం.
———————
పంచుకోవడం అనే ఈ క్రమంలోనే చిక్కొచ్చిపడింది..
"ఆనందానికి" మనకున్న డెఫినిషన్లు కాస్తా మన కంట్రోల్‌ని పోగొట్టుకుని ప్రపంచం కంట్రోల్లోకి వెళ్లిపోయాయి.
మనకు ఏది హాపీనో అన్నది వెనక్కి నెట్టేయబడింది… ఏం సాధిస్తే ప్రపంచం మనల్ని భుజాల మీద ఎగరేస్తుందో ఆ లక్ష్యాలు మొదటి ప్రయారిటీలుగా ముందుకొచ్చింది.
"పెద్దయ్యాక ఏం అవుతావు" అంటే "సైంటిస్ట్" అని గర్వంగా చిన్నప్పుడు చెప్పుకున్న వాళ్లెందరో…
ఊహ వచ్చే కొద్దీ అర్థమవుతూ వస్తోంది… ఓ క్రికెటరో, సినిమా స్టారో, క్యారెక్టర్ ఆర్టిస్టో, మ్యూజిక్ డైరెక్టరో.. ఇంకోటో.. ఇంకోటో… ఏదైనా చేసి నలుగురిచే గుర్తించబడితే చాలు "అదే జీవితం" అని దారి మార్చుకోబడుతోంది.
ఇక్కడ మరో చిన్న విషయం ప్రస్తావించి అసలు విషయంలోకి వెళ్తాను..
సంగీతం, నృత్యం, నటన వంటి కళలు ఖచ్చితంగా మనస్సుని వికసింపజేస్తాయి… అలాగని అవి మాత్రమే కళలు కాదు… వాటిలోనే బాల్యాల్ని, యావత్ జీవితాల్నీ ఇరికించేయకూడదు. ఇలా ఇరికించేస్తే వివిధ రంగాల మధ్య సమతౌల్యం దెబ్బతింటుంది. అలా సమతౌల్యం దెబ్బతిన్న రోజున అందరూ అన్ని పనులూ మానేసి కొన్ని రంగాల చుట్టూనే మిణుగురు పురుగుల్లా తిరుగుతుంటారు… చివరకు వ్యవసాయం కన్నా లాభసాటివి చాలా ఉన్నాయని ఎలాగైతే రైతులు పట్నాలకు వలసపోతున్నారో.. తద్వారా తిండి గింజలు దొరకట్లేదో అలా సమాజంలో ఎన్నో రూపాల్లో కొరత ఏర్పడుతుంది.
సో టివిల్లోని డాన్స్ బేబీ డాన్సులూ, పాటల పోటీలూ, వాటిల్లో ఓడిపోయిన వారి కన్నీళ్లూ, గెలిచిన వారి గెంతులూనే జీవితంగా డిఫైన్ చేయబడితే… లైట్ల చుట్టూ మిణుగురు పురుగుల్లా స్టూడియోల చుట్టూనే, కృష్ణానగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఛెక్ పోస్టుల చుట్టూనే చాలా జీవితాలు ముగిసిపోతాయి.
ఓ కాంపిటీషన్లోనో, మరో సినిమాలోనో కాసేపు కన్పించి… జీవితాంతం ఆ కొద్దిపాటి ఆనందంతో బ్రతికే చిన్న బ్రతుకులే మిగులుతాయి. "ఒక్కరోజు స్టార్"గా మేకప్‌లూ, డ్రెస్సింగ్ స్టైళ్లూ, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ల ఎడిటింగ్ నైపుణ్యంతో.. నిలువెత్తు ఫొటోని చూసుకుని… మురిసిపోయే లైఫ్ స్టైయిల్‌ని adopt చేసుకోవాలా.. జీవితాంతం స్టార్‌గా బ్రతకాలా అన్నది సమాజం, మీడియా నుండి వేరుపడి మనకు మనం నేర్చుకోవలసింది.
——————-
సరే అసలు విషయానికి వస్తాను…
"విజయం" అంటే ఏమిటో మనకు మనం అర్థం చేసుకోలేని కన్ఫ్యూజన్లో సమాజంచే, చుట్టూ ఉన్న ప్రపంచంచే హైజాక్ చేయబడకపోతే……
ఈరోజు వందల మంది రవీంద్రనాథ్ ఠాగూర్‌లు పుట్టుకొస్తారు.. స్వామి వివేకానందలు పుట్టుకొస్తారు… మధర్ థెరిస్సాలు ఆత్మీయ స్పర్శల్ని చాస్తారు….
అలాంటి గొప్పవాళ్లుగా తయారవ్వడమే "విజయం" అని నేను డిఫైన్ చెయ్యడానికి చెప్పట్లేదు ఈ ఉదాహరణను.. ఎవరికి వారు ఏది విజయమో, ఏది ఫెయిల్యూరో డెఫినిషన్ తమ కంట్రోల్లో పెట్టుకోగలిగిన రోజున… అంతర్లీనంగా బిజినెస్ స్ట్రేటజీస్తో ప్రమోట్ చేయబడుతున్న కొన్ని రంగాలే విజయాలుగా డిఫైన్ చేయబడవు…
రకరకాల రంగాల్లో.. ఎవరికి నచ్చిన విజయాల్ని వాళ్లు మనసారా ఆస్వాదించగలుగుతారు… చివరకు US వీసాలకు అప్లై చేసే వారి సంఖ్యా గణనీయంగా తగ్గుతుంది 🙂
గమనిక: ఇది ఎవరినైనా ఆలోచింపజేస్తుంది అనుకుంటే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అనుకరణ ఒక్కటే విజయం కాదు .చాలా చక్కగా చెప్పారు