“నాకు విష్ణువంటే ఇష్టం.. నాకు శివుడంటే ఇష్టం” అంటూ ఎవరికి వారు సరిహద్దులు గీసుకుంటూ ఉంటారు. మహాజ్ఞానాన్ని ఔపోసన పట్టిన గురువులు కూడా రెండు తత్వాలకు మధ్య వ్యత్యాసాన్ని ఎత్తి చూపిస్తుంటారు. ఇద్దరూ వేర్వేరని నమ్ముతుంటారు.
నా దృష్టిలో రెండూ వేర్వేరు అని చూస్తే రెండూ వేరుగానే కన్పిస్తాయి. ధ్యానం వంటి నిరంతర ఆధ్యాత్మిక సాధనల ద్వారా మన అవగాహనా శక్తి, పరిధి పెరిగాక రెండూ విడదీయరానంత బలంగా ఒకటే తత్వమన్నది అర్థమవుతుంది. మనం చూసే దృష్టిలో, మన అవగాహనా శక్తిలో ఉన్న పరిమితులను మొదట తెలుసుకోవాలి. అవగాహనా శక్తి పెరిగేలా మన ప్రయత్నాలు మనం చేయాలి. ఆ తర్వాత సృష్టి రహస్యం అర్థమవుతుంది.
విష్ణువు సృష్టి పాలకుడు, శివుడు సృష్టి నాశకుడు అన్నది మనకు తెలిసిందే! అసలు సృష్టే లేకపోతే నాశనం చెయ్యడం ఎలా సాధ్యపడుతుంది? నాశనమే చెయ్యకపోతే మరో సృష్టికి ఎలా అవకాశం లభిస్తుంది?
ఇది మన జీవితంలో ప్రతీ విషయంలోనూ రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది. Nallamothu Sridhar అనే వాడు ఓ కంపెనీలో మేనేజర్‌గా చేస్తున్నాడు అనుకోండి. మేనేజర్ స్థాయి నుండి అతను వైదొలగకపోతే అంతకన్నా మెరుగైనదో, అల్పమైనదో మరో స్థానానికి అవకాశం ఎక్కడ? రాజమౌళి బాహుబలి తీశాడు అనుకోండి.. ఆ సృష్టి నుండి బయటకు వచ్చి, దాన్ని తన ఆలోచనల నుండి నశింపజేసుకుని ముందుకు సాగకపోతే మరో సృష్టి ఎలా చెయ్యగలడు?
మన కుటుంబంలో ఆత్మీయులూ, మనమూ భూమ్మీదకు వచ్చాక ఓ దశలో చనిపోకపోతే మన ఆత్మలు వేరే రూపాలు సంతరించుకోవడానికి అవకాశం ఉండదు కదా! అంతెందుకు.. మీరే గమనించండి.. చిన్నప్పుడు మీ పిల్లలకు మీరు హీరోల్లా కనిపిస్తూ ఉంటారు. అంటే అక్కడ మీరు సృష్టి ధర్మంలో వారికి కావలసినవి అన్నీ సమకూరుస్తూ, ప్రేమని పంచుతూ సృష్టి చేస్తుంటారు. ఆ తర్వాత వారికంటూ వ్యక్తిత్వం వచ్చేకొద్దీ వారికి మీపై ఆధారపడే పరిస్థితి తగ్గిపోతుంది. దాంతో పాటే అనుబంధాలూ మందగిస్తూ వచ్చాయి. ముసలి వయస్సు వచ్చేటప్పటికి “అమ్మా తిన్నావా.. ఊరికే అలా పడుకోకపోతే కాస్త వాకింగ్ చేయి” అని ఏదో మొక్కుబడిగా చెప్పేసి వాళ్ల పనులు వాళ్లు చూసుకుంటూ ఉంటారు. కొన్నాళ్లకి విసుక్కుంటూ కూడా ఉంటారు. ఈ మొత్తం జర్నీలో అనుబంధాలు పెరగడం అనే సృష్టి జరగడమూ.. అనుబంధాలు తెగిపోవడం అనే శివతత్వమైన సృష్టి వినాశనమూ జరగలేదా? మరి విష్ణువు వేరు, శివుడు వేరూ అని ఎలా అంటారు? మన జీవితంలో ప్రతీ దశలో రెండు తత్వాలూ ఒక దాని స్థానంలో మరొకటి రీప్లేస్ అవుతుంటే?
ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే.. సృష్టి జరిగేటప్పుడే ఆ సృష్టి వినాశనమూ మొదలైనట్లే! జరిగే సృష్టి మనకు బయటకు సర్ఫేస్ మీద కన్పిస్తుంటే.. దాని వినాశనం మన కళ్లకు కన్పించకుండా అండర్ కరెంట్‌గా ఆ సృష్టితో పాటే కొనసాగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి మీతో ప్రేమతో మాట్లాడేటప్పుడే, ఆ వ్యక్తితో అనుబంధం బలోపేతం అయ్యేటప్పుడే అండర్ కరెంట్‌గా ఆ అనుబంధం తెగిపోవడానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోతూనే ఉంటాయి.
మనం సృష్టిని మాత్రమే ఇష్టపడతాం. వినాశనాన్ని చూసి భయపడతాం. అందుకే మెటీరియలిస్టిక్ ప్రపంచంలో కోరికలు, ఆశలూ, మనుషులూ, వాళ్లతో రిలేషన్లు, ప్రేమలూ వీటికి అలవాటుపడిపోయి, ఒక్కసారిగా ప్రాణం వదిలిపెట్టాలన్నా, ఒక్కసారిగా ఫ్రెండ్స్ దూరమైనా వేదన మిగులుతుంది. వినాశనం అనేది మరో సృష్టికి నాంది. ఆ సృష్టి మనకు అర్థమయ్యే రూపంలోనే ఉండాల్సిన పనిలేదు.
ఎంత సంపాదిస్తారో అంత పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనుషులతో ఎంత ప్రేమగా ఉంటారో అంత డిటాచ్డ్గా ఉండడానికి సిద్ధంగా ఉండాలి.. మీ రంగంలో ఎంత ఎత్తుకు ఎదుగుతారో కొన్నేళ్ల తర్వాత అంతే అనామకంగా మారిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అటు విష్ణు తత్వానికి కొనసాగింపు శివతత్వం ఉంటుందన్న అవగాహన లేని వారే నాకు సృష్టే కావాలి, వినాశనం వద్దు అనుకుని వేదనకు గురవుతూ ఉంటారు. చాలాసార్లు మీకు రాశాను.. నేను మనుషుల్ని ఎంతగా ప్రేమిస్తానో, వారికి నా ఎఫెక్షన్‌ని ఎంతగా పంచుతానో అంతే డిటాచ్ అయిపోతూ ఉంటాను. మనం సృష్టీ చేయాలి.. మనచేతే వినాశనమూ జరగాలి.. మనం డిటాచ్ అవలేకపోతే శివతత్వమో మనచేత బలవంతంగా డిటాచ్ అయ్యే పరిస్థితులు కల్పిస్తుంది.
నిండు కుండ లాంటి జీవితాన్ని ఇష్టపడడమే కాదు.. శూన్యతలోనూ స్థిమితంగా ఉండే ఔన్నత్యం కావాలి మనకు! ఒంటినిండా నగలు, ఖరీదైన కార్లు కలిగి ఉండడమే కాదు… వంటికి విభూది రాసుకుని, అన్నింటినీ త్యజించే కోల్పోయే గుణం కావాలి మనకు! ఈ సంస్కారం అలవడ్డప్పుడు విష్ణువు, శివుడు వేర్వేరు కాదనే సత్యం బోధపడుతుంది.
ఈ ఆర్టికల్‌ని నా పేరు ఉంచి ఎక్కడైనా షేర్ చేయొచ్చు. పేరుని తొలగించి షేర్ చెయ్యడం ఈ సత్యాన్ని, ఓ వ్యక్తి తన ఆధ్యాత్మిక సాధన ద్వారా తెలుసుకున్న విషయాలను అవమానించినట్లే అన్నది గ్రహించండి చాలు!
nsridharwritings
- Sridhar Nallamothu