ఉశ్వాస, నిశ్వాస ప్రేరేపితాలైన నాడీ చలనాల మూలంగా నిరంతరం సృష్టి చేయబడుతూనే ఉంటుంది….
శరీరపు కణజాలాల్లో ప్రాణశక్తీ… ఆలోచనల్లో మానసిక పుష్టీ శివైక్యం చెందడానికి…. ఊపిరి ఆగిపోయేటంత లిప్తపాటు ఘడియ చాలు… ఆ మాత్రానికే విర్రవీగే అమాయకత్వం…
కళ్లెదుట ప్రపంచం మాయా కాదూ… అలాగని వాస్తవమూ కాదు… ఎన్నో తోలుబొమ్మల్ని ఎమోషన్స్‌తో సహా ఆడించి వినోదించే ఓ క్రీడ….
కోరికలు పుడతాయి.. తీరతాయి… చివరకు నశిస్తాయి…
నశించేటప్పుడు ఎనలేని వైరాగ్యానికి కారణమయ్యే కోరిక జనించేటప్పుడు అంతులేని మోహాన్నీ సృష్టించడం…. ఓ చక్రభ్రమణం! అలాంటి చక్రభ్రమణాల వెంబడే మన పరుగులన్నీ!
పరుగైనా ఆగాలీ… కోరికలైనా స్థిమితపడాలి….
ఈ వైభోగమంతా… కల్పితమనే స్ఫురణే….. బలవంతంగా విదుల్చుకోబడి… జన సమూహంలో మైమరుపుతో మాయపుచ్చుకునేటంత భరింపశక్యం కానిది….
మనకు ఫిలాసఫీ అస్సలు నచ్చదు… చుట్టూ ఇంతమంది నడుమ భౌతికం మాట పక్కనపెడితే…. ఆలోచనల్లో వరకైనా ఎక్కడ ఒంటరిమైపోతామోననే భయం…. ఆలోచనల్లో తోడు కావాలి…. భౌతికంగా తోడు కావాలి…. సమూహంలో నిశ్చింతగా ఉన్నామన్న భ్రమ కావాలి జీవితాంతం!
అంతర్ముఖంగా ఒంటరిగానూ…. బాహ్యప్రపంచంలో సమూహంతోనూ కంపార్టమెంటలైజేన్ చేసుకునే నేర్పు అస్సలుండదు మనకు….!!
లోపలకు తొంగిచూస్తే బయట ప్రపంచం వదిలి వెళ్లిపోతుందేమోనన్న భయం…
మనకు శివుడు కావాలి… భోళాశంకరుడు ఆశీస్సులివ్వాలి… సుఖాలు ప్రసాదించాలి… మాయాసృష్టి నుండి విడివడి శివైక్యం చెందాలంటే మాత్రం ఎక్కడలేని భయమూ….
సృష్టించబడేది ఏదైనా వాయులీనమైపోతుంది…. ఇది ప్రాకృతిక ధర్మం….
కోరికలూ చల్లబరచబడతాయి… ఆవేశాలూ అణిచివేయబడతాయి…. వైభోగాలూ విరక్తి కారకాలవుతాయి… ఆనందాలూ విచారాల ముగింపు తీరాల్లో తేలియాడతాయి… నువ్వూ, నేనూ, మనమూ… నిన్నా రేపటి నడుమ సమాధైపోతాం…
ఇన్ని సత్యాల నడుమ ఎక్కడికక్కడ విడిపడి బ్రతక్కపోతే ఉన్న జీవితం అంతా వేదనే మిగులుతుంది….
చాలామంది చెప్తుంటారు…. ఎంజాయ్ చేయనీయండి…. వేదాంతం చెప్పొద్దు అని… ఈ క్షణం నీకు సృష్టించబడుతున్న ఎంజాయ్మెంట్ మరుక్షణం ఏదో కారణంతో ఉరితాడు కాకపోతే అది ప్రకృతి ధర్మమెలా అవుతుంది….?
అందుకే జీవితాన్ని ఆస్వాదించొచ్చు…. కానీ మోహం పనికిరాదు…. ఏ క్షణమైనా దేన్నయినా చిరునవ్వుతో త్యజించే గొప్పదనమే ప్రకృతి ప్రతీ జీవి నుండీ కోరుకునేది!!
గమనిక: ఇది ఎవరిలోనైనా ఆలోచన రేకెత్తిస్తుంది అనుకుంటే ఇతరులకూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Very well said..baga rasaru..keep writing..