అప్పటి వరకూ అక్కడ శూన్యం కన్పిస్తుంది…
ఉన్న ఫళంగా ఓ మనిషి ఆ శూన్యంలోంచి ఎదుగుతూ అందరి కళ్లల్లోకీ చేరుతుంటే ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాదు. ఒక్కోరు ఎవరి మానసిక స్థితిని బట్టీ, వ్యక్తిత్వాన్ని బట్టీ ఒక్కోలా మాట్లాడేస్తుంటారు..
“ఏం ఎదిగిపోతున్నాడురా.. మనిషంటే ఇలా ఎదగాలి” అని కొందరు అబ్బురంగా చూస్తారు… కొందరు ఆ ఎదుగుదలని ఓర్చుకోలేక అస్సలేం తమకు పట్టనట్లు నటిస్తుంటారు. కానీ లోపల దహించివేస్తుంటుంది హృదయం.
మరికొందరు అరిచేతులు అడ్డుపెట్టి ఎదుగుదలని ఆపాలని చూస్తుంటారు. ఎవరి సంతోషాలు వారివి, ఎవరి భయాలు వారివి.. ఎవరి ఓర్వలేనితనం వాళ్లది.. వదిలేయండి.. అన్నీ వదిలేయండి.. మీ దృష్టిలో ఎదగడమొక్కటే లక్ష్యం కన్పించాలి.
ఎవరి మాటలో, రియాక్షన్లో, తిరస్కరణలో, నిష్టూరాలో, నిర్లక్ష్యాలో, చులకనలో ఏదీ మైండ్‌లో మోసుకు తిరగాల్సిన పనిలేదు. లక్ష్యం మీ కోసం వెయిట్ చేస్తోంది… ఇక్కడ చెత్త దగ్గర కూర్చుండిపోయి మైండ్‌ని డస్ట్‌బిన్ చేసుకోకండి.
మనుషులంతే… పాపం పిచ్చి వాళ్లు. రకరకాల బలహీనతలు. తాము కొన్ని బలహీనతలచే ప్రశాంతతను కోల్పోతున్నామనీ… నోరుపారేసుకుంటున్నామనీ.. దిగజారిపోతున్నామనీ గ్రహించే విజ్ఞత వాళ్లకు కరువవుతోంది. వాళ్లకే తెలీట్లేది వాళ్ల తలమీద ఏ రాక్షసి కూర్చుందో! ఇంకా వాళ్ల గురించి పట్టించుకుని.. వాళ్లు చూసే చూపులకూ, మాట్లాడే మాటలకూ ఎందుకు ఆగిపోతారు? ఎదుటి వ్యక్తి బలహీనతను అర్థం చేసుకుంటే మన మనస్సు అస్సలు గాయపడదు. వదిలేయడమే. మనది రాజమార్గం. రాయల్ మార్గం. దర్జాగా అనుకున్నది సాధించడమే.
జనాల కళ్లు బైర్లు కమ్మాలి… మీ ఎదుగుదల కళ్లల్లో ఇముడ్చుకోలేక! ఎదిగితే అంత కసిగా ఎదగాలి.. ఏదో ఈరోజు గడిచిపోయిందిలే అన్నట్లు ఉదాసీనంగా బ్రతికేయడం కాదు. కసి… కసి.. కసి.. ఒక్కటే మాట.. జీవితాంతం. ఈరోజు శూన్యం కన్పించొచ్చు.. కానీ రేపు ఆ శూన్యంలో మీరు నిలువెత్తు రూపంలా ఎదుగుతారు… మీ చుట్టూ వెలుగు ఉంటుంది.. జనాలుంటారు..!!
శరీరంలో బర్నింగ్ ఫైర్ ఉండాలి.. చాలామందికి పొట్టలో అగ్ని పుడుతుంది.. ఆకలి పుడుతుంది.. ఆ ఆకలి తినగానే చల్లారిపోతుంది. కానీ శరీరం మొత్తమూ, ఆలోచనల్లోనూ ఉండే బర్నింగ్ ఫైర్ అంత ఈజీలా చల్లారేది కాదు. నిరంతరం సాధిస్తూనే పోవాలి. యెస్.. మనమేం చెయ్యగలిగినా ఈ ఒక్కటే లైఫ్ ఉంది. Next జన్మ ఉంటుందో లేదో గ్యారెంటీ లేదు. సో ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే.. ఈ క్షణమే.. నిద్రపోకపోయినా ఫర్లేదు.. రాత్రంతా మెలకువగా ఉన్నా నష్టం లేదు… ముందు ఆలోచించండి.. జనాలకు అర్థం కాని విధంగా అద్భుతంగా ఎలా ఎదిగిపోవాలో.. దానికి ఎంత హార్డ్ వర్క్ చెయ్యాలో అన్నీ ప్లాన్ చేసుకుని మొదలెట్టండి.
లైఫ్ ఎలాగోలా గడిపేసేది మాత్రం కాదు.. “నా లైఫ్ ఇలాగే ఉండాలి అనుకుంటున్నాను” అని ఎవరికి వాళ్లం డిఫైన్ చేసుకుని సాధించి తీరాల్చింది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్!!
– నల్లమోతు శ్రీధర్
Lovely!!! :)… yet very true n inspiring! Thanks for this Post Sridhar!!