శ్రీవారి దర్శనానికి వెళ్లడం అంటే ఏవో ట్రిప్‌లకు వెళ్లి వచ్చినంత కాజువల్ విషయం కాదు…
స్వామి దర్శనం దొరకడం మనం అనుకున్నంత మామూలు విషయం కాదు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు, జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు.. చివరకు తిరుపతి కూడా చేరిపోనూవచ్చు కానీ స్వామి అనుగ్రహం లేకపోతే కనీసం స్వామి గుడిలోకి అడుగుపెట్టడం కుదరనే కుదరదు. ఇది చాలామందికి అనుభవమైనదే.
తిరుపతి EOగా పనిచేసిన పి.వి.ఆర్.కె. ప్రసాద్ గారు రాసిన “సర్వసంభవామ్” బుక్‌లో ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వారే స్వామి వారి దర్శనం నోచుకోలేక ఇబ్బందిపడిన సంఘటనలు చదివినప్పుడు “ఇలా కూడా జరుగుతుందా” అని ఆశ్చర్యమేస్తుంది. మనం స్వయంగా ఇలాంటివి చవిచూసినప్పుడు తెలుస్తుంది.
నాకు తెలిసిన చాలామంది దర్శనానికి క్యూలోకి వెళ్లి ఎవరో తరుముతున్నట్లు, స్థిమితంగా లేక బయటకు వచ్చిన వాళ్లున్నారు.. తీరా చూస్తే వాళ్ల కుటుంబంలోని వారు చనిపోవడమో, మరో అశుభమో జరిగి ఉంటుంది ఆ సమయంలో! ఇది చాలాసార్లు నేను గమనించాను. ఇకపోతే అన్ని రకాల ఏర్పాట్లూ చేసుకుని దర్శనానికి వెళ్లలేని వారుంటారు. స్వామి పట్ల సరెండర్నెస్ లేకపోవడం వల్ల ఏదో ఓ మామూలు విషయంలా తీసుకోవడం వల్లా ఏర్పడే అసౌకర్యాలు ఇవి.
నేను స్వామికి పూర్తిగా సరెండర్ అయి ఉంటాను ప్రతీ క్షణం. అయినా స్వామి నా పట్టుదలని పరీక్షించారు.
అసలేం జరిగిందంటే..
2007లో తిరుమల సిండికేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయిన నా ఆత్మబంధువు జగన్నాధం గారు అప్పట్లో వాళ్ల కుటుంబానికి 4 తోమాల సేవ టికెట్లకు అప్లై చేశారు. ఆయనా, వాళ్ల భార్యా, వాళ్ల అబ్బాయి, వాళ్ల అబ్బాయికి పెళ్లి అయితే వాళ్ల కోడలూ ఇలా నలుగురూ వెళ్లొచ్చని! అవి ఏడేళ్ల తర్వాత ఒక నెలరోజుల క్రితం అలాట్ అయ్యాయి. వాళ్లబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు. సో ఆ 4వ టికెట్ మీద నాకు తోమాల సేవాభాగ్యం కల్పించాలని జగన్నాధం గారికి స్ఫురించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్నాధం గారికి ఆ ఆలోచన కలిగించడం ద్వారా స్వామి నాకు ఆ అవకాశం ఇచ్చారని అటు జగన్నాధం గానూ, నేనూ ఎంతో బలంగా నమ్ముతున్నాం.
అనుకోని కారణాల వల్ల అన్నీ బుక్ చేసుకున్న తర్వాత… ఈసారి ప్రయాణం కేన్సిల్ చేసుకుందామా అన్న థాట్ నాకు ఈ నెల 13-15 తేదీల్లో వచ్చింది. స్వామి వారి జర్నీ ప్లాన్ అయ్యాక అలాంటి ఆలోచన కలగడం చాలా తప్పు, కానీ ఆ తప్పు నేను చేశాను. మళ్లీ అంతలోనే ఎలాగైలా వెళ్లాల్సిందే అని నాకు నేను సరెండర్ అయి వెళ్లాను, మెట్లెక్కాను, ముందురోజు 300 దర్శనం చేసుకున్నాను.
నాతో పాటు మిత్రులు హరిగారూ మెట్లెక్కారు. ముందురోజు సాయంత్రం జగన్నాధం గారు, వాళ్ల ఫ్యామిలీ, నెల్లూరు నుండి వచ్చిన మిత్రులు రఘు గారు, నేనూ, హరిగారు, చందూ అందరం కలిసి ఓ గంటపాటు సంతోషంగా గడిపాం. ఆ సమయంలో జగన్నాధం గారు స్వామి వారి నుండి కానుకగా వచ్చిన ఓ పట్టు షాలువా ప్రేమకొద్దీ బహూకరించారు. అంతా సంతోషంగా గడిచింది.
మరుసటి రోజు వేకువజాము 2కి లేచి రెడీ అయి.. 2.30కి జగన్నాధం గారికి కాల్ చేశాను. ఆయనా వాళ్లు స్టే చేసిన గెస్ట్ హౌస్‌లో రెడీ. “ఓ 5 నిముషాల్లో బయల్దేరదాం.. ఫలానా చోట కలుద్దాం” అనుకున్నాం. ఫోన్లు ఉండవని తెలుసు. సో ఆ లొకేషన్‌కి నేను, నా కార్ ఫ్రెండ్ చందూ చేరుకునేసరికి అక్కడెవరూ లేరు. ఇంకా రాలేదేమోనని 10 నిముషాలు వెయిట్ చేశా. వాళ్లు కన్పించలా. వెహికిల్స్ అక్కడే ఆపాలి. వాళ్ల కారు కోసం చూశాం. లేదు. ఓ పక్క టైమ్ అయిపోతోంది. లాభం లేదని వాళ్ల గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్లాం. అక్కడా వాళ్ల కారు లేదు.
మళ్లీ తోమాల సేవకి వెహికిల్స్ ఆపే లొకేషన్‌కి వచ్చి ఇంకో 5 నిముషాలు వెయిట్ చేశాం. నో యూజ్. ఇక చందూ “మీరు లోపలికి వెళ్లండి సర్.. అక్కడ ఉన్నారేమో” అన్నాడు. సో నేను అతన్ని పంపించి ఓ పావు కిలోమీటర్ నడిచి తోమాల క్యూ దగ్గరకు చేరుకున్నా. అక్కడ కూర్చున్న పదిమందినీ మొహంలో మొహం పెట్టి మరీ చూశా. చుట్టూ చూశా. టైమ్ దాటిపోయింది. 3.30కి లోపలికి పంపిస్తారు. 3.40 అయింది. ఏం చేయాలో అర్థం కాలా.
పావు కిలోమీటర్ నడిచి మళ్లీ వెనక్కి వెహికిల్స్ ఆపే దగ్గరకు వచ్చా.. 5 నిముషాలు చూశా, లాభం లేదు. ఇక ఆశలు పోయాయి. అదృష్టం లేదనుకున్నాను. పంచెతో కష్టం అవుతుంది అని పర్సు కూడా తెచ్చుకోలా… అవసరం అయితే జగన్నాధం గారి దగ్గర తీసుకుని తర్వాత ఇచ్చేద్దామని! చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఫోన్ లేదు.. అక్కడ సెక్యూరిటీ అతన్ని అడిగా.. “రూమ్ దగ్గర డబ్బులు పే చేస్తామంటే ఎవరైనా టాక్సీల వాళ్లు వస్తారా” అని! వస్తారు సర్ అన్నాడు.
అలా అడిగానే కానీ నాకు మనసొప్పలేదు. మళ్లీ పావుకిలోమీటర్ నడిచి క్యూలోకి ఎంటర్ అయ్యే దగ్గరకు చేరా.. మళ్లీ అందరి మొహాలూ చూశా.. ఇక లాభం లేదనుకుని క్యూలోకి ఎంటర్ అయ్యే దగ్గర సెక్యూరిటీ అతని దగ్గరకు వెళ్తే “టికెట్” అడిగాడు. “మా ఫ్యామిలీ లోపలికి వెళ్లారు, నేను ఇరుక్కుపోయాను” అని చెప్పా. అసలు వాళ్లు లోపలికి వెళ్లారో లేదో కూడా తెలీకుండానే, అంత ధైర్యంగా అలా ఎలా చెప్పానో నాకే తెలీదు. ఒకవేళ వాళ్లు లోపలికి వెళ్లకపోయి ఉంటే నా పరిస్థితి ఏంటన్న ఆలోచన కూడా రాలేదు. అలా అనేశానంతే గుడ్డిగా! అది దేవుడు కలిగించిన ఆలోచన. పేరు అడిగాడు.. “శ్రీధర్” అని చెప్పా. లోపలికి పంపించాడు… ప్రాణం లేచొచ్చినట్లయింది.
అంతటితో అయిపోలేదు.. లోపల స్కానింగ్ దగ్గర మళ్లీ ఆపారు.. వాళ్లని 2-3 నిముషాలు బ్రతిమిలాడా… ఇంత జరుగుతున్నా నాకు “ఏంటి స్వామి ఇలా చేశారు..” అన్న కోపమూ, అసహనమూ ఏమాత్రం కలగలేదు. స్కానింగ్ దగ్గరా ఒప్పుకున్నారు. మళ్లీ నాలుగు అడుగుల్లో ఫైనల్ ఛెకింగ్. అక్కడ 5 మంది స్టాఫ్ ఉన్నారు. అస్సలు పంపించేదే లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నా.
సరిగ్గా అదే సమయంలో జగన్నాధం గారి అబ్బాయి కేశవ్ నన్ను చూసి వచ్చి వాళ్లని రిక్వెస్ట్ చేస్తున్నాడు టికెట్ చూపిస్తూ! నాకు ఆశలు చిగురించాయి. కానీ వాళ్లు వినట్లా. అంతలో జగన్నాధం గారూ వచ్చారు.. ఆయన 2-3 నిముషాల పాటు రిక్వెస్ట్ చేశాక బలవంతం మీద ఒప్పుకున్నారు. ఇలా వాళ్లని కలిసిన 5 నిముషాల్లోపే అక్కడ గేదర్ అయి ఉన్న తోమాల సేవ భక్తులను గుడిలోకి పంపించారు. ఇప్పటివరకూ జరిగిన దానిలో ఒక్క 5 నిముషాలు ఆలస్యం అయినా నాకు దర్శనం దొరికేది కాదు. స్వామి నాకు దర్శనం కలిగించాలనుకున్నాడు.. కానీ నేను చేసిన తప్పుకి నన్ను పరీక్షించాలనుకున్నాడు.. “వీడికి దర్శనం చేసుకునే ఉద్దేశం బలంగా ఉందా లేదా” అని!
—————————————–
ఇది నా వెర్షన్ అయితే… జగన్నాధం గారు ఎంత టెన్షన్ పడ్డారో.. వాళ్లకి నేను కన్పించలేదు. ఫోన్ వాళ్ల కారులో వదిలేశారు. క్యూలోకి వెళ్లకపోతే మీ టికెట్లూ వేస్ట్ అవుతాయని వాళ్లు టెన్షన్ పెట్టారట.. సో తప్పనిసరిగా క్యూలోకి వెళ్లారు. క్యూలోకి వెళ్లాక కూడా వెయిటింగ్ టైమ్‌లో వాళ్లబ్బాయి 300 దర్శనం లైన్లూ అన్నీ నా కోసం వెదుకుతున్నారు. జగన్నాధం గారి బాధపడడం చూసి వాళ్ల భార్య సర్ధిచెప్తున్నారు.
“ఇంత గొప్ప దర్శనం.. నా అభ్యర్థన మేరకే ఆయన హైదరాబాద్ నుండి వచ్చారు.. ఇలా అయిందేమిటి” అన్న బాధలో ఆయనున్నారు. స్వామి లీలల గురించి ఆయనకు తెలుసు. సో కాసేపు నమ్మకమూ, కాసేపు దిగులూ! ఇలా లోపల వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు.
మొత్తానికి కలో, నిజమో నమ్మడానికి లేకుండా చాలా సంతోషంతో గర్భగుడిలోకి ప్రవేశించాం.
అరక్షణం పాటు స్వామిని చూస్తేనే జన్మ తరించిపోయినట్లు ఫీలవుతాం ఉచిత, 300 రూపాయల దర్శనానికి వెళ్లినప్పుడు..! అలాంటిది సరిగ్గా 50 నిముషాలు స్వామి వారి గర్భగుడిలో అలా కనురెప్ప వేయడం కూడా మర్చిపోయి స్వామిని చూస్తుండిపోయాను. స్వామి అలంకారం మొత్తమూ కన్నులారా చూడడమైంది. స్వామికి నాలుగు అడుగుల దూరం వరకూ (ఓ వాకిలికి ఇవతల) వెళ్లి కన్నులారా పైకీ క్రిందికీ చూసి కళ్లల్లోకి నిలుపుకుని శఠగోపం తీసుకుని బయటకు వచ్చాం.
—————————-
స్వామితో నాకు అటాచ్మెంట్ చాలా బలపడింది. నా ప్రతీ ఆలోచనలోనూ ఆయన ఉంటారెప్పుడూ! నాకు పైన జరిగినది అసౌకర్యమే తప్పించి, అలాగే నా పట్టుదలని స్వామి వారు పరీక్షించాలనుకున్నారే తప్పించి.. ఇది కోఆర్డినేషన్ లోపమూ, కమ్యూనికేషన్ లోపమూ అసలే కాదు. ఎందుకంటే నాకు తిరుపతి కొత్తా కాదు, జగన్నాధం గారికి కొత్తా కాదు. ప్రతీ క్షణం టచ్‌లోనే ఉన్నాం. అయినా ఇలాంటి అద్భుతాలు చాలామందికి తిరుపతిలో జరుగుతాయి. కావాలంటే గుర్తు తెచ్చుకోండి.
స్వామి పట్ల నిరంతరం ప్రేమా, గౌరవమూ, భక్తీ కలిగి ఉంటే అన్నీ ఆయనే చూసుకుంటారు… అది పరీక్ష అయినా అనుగ్రహమైనా!! కొందరంటారు.. “తిరుపతి ఎన్నిసార్లు వెళ్తారు సర్” అంటూ! తిరుపతి వెళ్తేనా భక్తా అని కొందరంటారు. స్వామి వారు అనుగ్రహం ఎన్నిసార్లు లభించినా అది నాకు అదృష్టమే!!
– నల్లమోతు శ్రీధర్
GREAT EXPERIENCE SIR. YOU ARE BLESSED.