లైఫ్ స్టోరీ రాద్దామని నాకు ఎప్పుడూ పక్కనే కన్పించే శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటో వైపు చూశాను.. ఆయన బ్లెస్సింగ్స్ కోరుతూ! వెంటనే అన్పించింది ఆయన అనుభవంతోనే మొదలుపెట్టాలని!
బాపట్లలో రాధా ఫొటో స్టూడియో అని ఉండేది. మిత్రుడు రాధాకృష్ణ ఫొటోలు బాగా తీస్తారు. ఆయన్ని వెంటేసుకుని బాపట్ల నుండి రేపల్లె దగ్గర పెనుమూడి వంతెన వరకూ చేరుకుని పడవలో మోపిదేవి వంటి రకరకాల ప్రదేశాలు ఫొటోల కోసం తిరిగాను. బాపట్ల ఆర్ట్స్ కాలేజ్‌లో B.Com చదువుకునే రోజులు అవి. బాపట్ల పక్కనే జమ్ములపాలెం మా ఊరు. వారంలో ఒకటి రెండు రోజులు ఇంటికి వెళ్లకుండా ఆ స్టూడియోలోనే గడిపే వాడిని. తలా ఒక బీర్ తెచ్చుకుని తాగే వాళ్లం. అప్పట్లో అయిన అలవాటు 2005లో జీవితాంతం పట్టుకోకుండా మానేశాను అనుకోండి.
ఓరోజు రాత్రి డ్రింక్ చేస్తుంటే.. తిరుపతి కొండ మీద సీనరీ బాగుంటుంది. అక్కడికెళ్లి ఫొటోలు దిగుతాం అన్న ఆలోచన వచ్చింది. “రాధాకృష్ణ పనిలోపని దర్శనం చేసుకుని వద్దాం” అన్నాడు. “దర్శనానికి చాలా టైమ్ పడుతుంది, ఆ క్యూలో ఏం వెయిట్ చేద్దాం, ఫొటోలు తీసుకుని వచ్చేద్దాం అన్నాను”. ఇష్టం లేకపోయినా సరే అన్నాడు. అనుకున్న విధంగానే రాధా, వేణు, నేనూ ముగ్గురం ట్రైన్లో తిరుపతి, తర్వాత టాక్సీలో తిరుమల చేరుకున్నాం. ఫొటోలు తీసుకున్నాం. క్రిందికి దిగాక రైల్వేస్టేషన్కెళితే బాపట్ల వైపు వెళ్లే ఏ ట్రైన్ మరో నాలుగు గంటల పాటు లేదు. చేతిలో చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి.
సరే హైవే దాకా వెళితే లారీలు ఉంటాయి, ఒంగోలు దాకా వెళ్లొచ్చు అని రాధా చెప్పాడు. సరే ఏదో లారీ పట్టుకుని కనాకష్టంగా ఒంగోలు దాకా వెళ్లాం. విపరీతమైన ఆకలి. తినడానికి కూడా అవలేదు. ఒంగోలు స్టేషన్‌కెళితే అప్పుడే బాపట్ల వైపు వెళ్లే ఓ ట్రైన్ దొరికింది. ట్రైన్లో జనరల్ బోగీలు ఆ ఇరుకులో కాలు కూడా పెట్టడానికి లేనంత రద్దీలో అలాగే నిలబడి బాపట్లకి చేరుకున్నాం. బాపట్ల స్టేషన్లో కేవలం 20-30 సెకన్లపాటే ట్రైన్ ఆగుతుంది. లోపలి నుండి రావడానికి ఎవరూ దారి ఇవ్వడం లేదు. ఎలాగోలా గేటు దాగా వచ్చి చేతిలో బ్యాగ్ క్రిందికి విసిరేసి గబాగబా దిగాం. ఇది చాలా దారుణమైన అనుభవం.
ఆరోజు మొదలైంది టెస్టింగ్.. ఆ తర్వాత రెండేళ్లు ఎన్నో అవమానాలు (ఇంకో దగ్గర వాటి గురించి వివరంగా రాస్తాను). సూయిసైడ్ అటెమ్ట్లు. ఎన్నిసార్లు సూయిసైడ్ చేసుకోవాలనుకున్నా బ్రతికేవాడిని. ఆ తర్వాత అన్ని అలవాట్లు మానేసి చెన్నైలో సూపర్‌హిట్ ఫిల్మ్ మ్యాగజైన్‌కి సబ్ ఎడిటర్‌గా వెళ్లాక ఓరోజు వర్క్ లేక ఖాళీగా కూర్చుంటే.. జయా మేడమ్ (ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు వంటి సినిమాల డైరెక్టర్) ఓ మేన్యుస్క్రిప్ట్ తీసుకొచ్చి చేతికిచ్చి.. “ఇది టైప్ చేసి పెట్టు శ్రీధర్” అంటూ చేతికిచ్చారు. అది శ్రీ వేంకటేశ్వరస్వామి చరిత్ర. భూమ్మీద ఎలా వెలిసిందీ, చాలా వివరంగా రాయబడిన పుస్తకం. ఆ వర్క్ చేశాక, నెలరోజులకి అన్నమయ్య సినిమా కవరేజ్‌కి నన్ను డెడికేటెడ్‌గా కేటాయించారు. తిరుపతి అన్నమయ్య ఆడియో రిలీజ్‌కి వెళ్లాను. నాగార్జున, సుమన్, కస్తూరి, రాఘవేంద్రరావు గారు, భారవి గార్లతో కలిసి స్వామి వారిని అత్యద్భుతమైన దర్శనం చేసుకున్నాను. అన్నమయ్య సక్సెస్ మీట్లో భాగంగా తిరుపతిలో బ్రహ్మానందం గారు అందరు ఆ సినిమా టీమ్‌తో లారీలో ఊరేగింపులో పాల్గొన్నాను.
మధ్యలో ఒకటి రెండుసార్లు మాత్రమే వెళ్లినా స్వామి వారు ఎప్పుడూ నా ఆలోచనల్లో ఉండే వారు. 2011 నుండి 2019 వరకూ సంవత్సరానికి కనీసం ఐదారుసార్లు మెట్ల మార్గం గుండా నడిచి స్వామి వారిని దర్శించకున్నాను. 2017లో తిరుమలలో ఉంటే రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి జగన్నాధం గారితో కలిసి స్వామి వారి గర్భగుడిలో అరగంట పాటు తోమాల సేవలో కూర్చునే భాగ్యమూ కలిగింది. అక్కడ కూడా టెస్టింగే. 2017 మేలో మూడొందల రూపాయల దర్శనానికి వెళ్లాను. జగన్నాధం గారు “జూలైలో తోమాల సేవ ఉంటుంది, మీరు రావాలి సర్” అంటూ ముందే చెప్పారు. “ఇప్పుడేగా వచ్చింది, అప్పుడు చూద్దాంలే సర్” అని బదులిచ్చాను. జూలైలో తోమాల సేవ కన్ఫర్మ్ అయ్యాక కూడా అయిష్టంగానే వెళ్లాను. ఆరోజు చూడాలి.. వాళ్లు ఓ గెస్ట్ హౌస్‌లో ఉన్నారు. నేను ఇంకో గెస్ట్ హౌస్ లో ఉన్నాను. వేకువజాము ఒక దగ్గర కలుద్దాం అనుకున్నాం. అక్కడికి వెళితే వాళ్లు కన్పించలేదు. ఫోన్ కార్లో పెట్టి డ్రైవర్ని పంపించేశాను. అరగంట అక్కడక్కడే తిరిగాను. తిరిగి రూమ్‌కి వెళదామంటే పంచె ధరించడం వల్ల, టవల్ తప్పించి షర్ట్ లేకపోవడం వల్ల పర్సు తీసుకు రాలేదు. వేకువజాము అంత చలిలో చెమటలు కారిపోతూ ఆశలు వదిలేసుకుని ఆ క్యూ దగ్గరకు వెళ్లి సెక్యూరిటీని అడిగాను “మా వాళ్లు లోపలికి వెళ్లారు, నేను మిస్ అయ్యాను, లోపలికి పంపమని”. అసలు టికెట్ లేకుండా తిరుమలలో ఎవర్నీ పంపరు. కానీ ఆయన పంపారు. లోపలికి వెళితే వెరిఫికేషన్ విజిలెన్స్ వారు టికెట్ లేదని పంపమని మొండికేశారు. అదే డిపార్ట్మెంట్లో కొత్తగా చేరిన ఓ అమ్మాయి ఇన్స్పెక్టర్తో “ఇందాక వేరే వాళ్లు శ్రీధర్ అనే ఆయన వస్తే పంపమని చెప్పి వెళ్లారు సర్” అంటూ పై అధికారికి చెప్పే ధైర్యం లేక ననుగుతూ చిన్న స్వరంతో చెప్పింది. ఆయన ఏమనుకున్నారో నన్ను లోపలికి పంపారు. నేను అలా క్యాబిన్లోకి వెళ్లడం, అప్పటి వరకూ వెయిటింగ్లో ఉన్న తోమాల సేవ భక్తులు అంతా కదిలిపోవడం వెంటనే జరిగింది.
ఆ స్థితిలో స్వామి ముందు అరగంట సేపు కూర్చుంటే అప్పుడు ఓ భావాతీత స్థితి. కొన్ని విషయాలు లాజిక్‌కి అందవు. హృదయంతోనే అర్థం చేసుకోవాలి.
అప్పటి నుండి ఇప్పటి వరకూ తిరుమలకి విజిలెన్స్ విభాగానికి తిరుమల మీద చెడు ప్రచారం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ట్రైనింగ్ ఇచ్చే బాధ్యతనూ స్వామి వారే నాకు కల్పించారు. నేను తిరుమల వెళితే చాలు, నాతో పాటు కలిసి నడవడానికి “శ్రీహరి” గారు అనే మిత్రుడిని ఇచ్చారు. దాదాపు 20 సార్లు కలిసి నడిచాం. స్వామి ఓ మనిషి రూపంలో నాతో ఉన్న భావనే కలుగుతుంది. శ్రీహరి గారు కాంట్రాక్టర్. కాంట్రాక్ట్ పనుల మీద మధ్యలో రెండేళ్లు వైజాగ్‌లో ఉండి కూడా నేను తిరుమల వస్తున్నానంటే, నా కోసం కొన్ని గంటలు వైజాగ్ నుండి తిరుపతి జర్నీ చేసి నాతో కలిసి నడిచేవారు. అలాగే తిరుపతిలో నాకు ఏ లోటూ లేకుండా ప్రేమగా చూసుకోవడానికి రెండు హోటల్స్ యజమాని అయిన వినీత్ గారు, చందు అనే డ్రైవర్ ఇలా ప్రతీ ఏర్పాటూ చేశారు. ఏదో స్వంత ఇంటికి వెళ్లినట్లు వెళ్లి టకాటకా రెడీ అయి దర్శనానికి వెళ్లడమే. అంత సౌకర్యవంతమైన వాతావరణం కలిగింది.
మా ఇంట్లో ఏ గదిలోకి వెళ్లినా స్వామి వారి ఫొటో కన్పిస్తుంది. రోజూ ఆయన రూపంలోకి చూడడం నా అన్ కాన్షియస్ యాక్టివిటీ.