సంక్రాంతి నూర్పిళ్ల కాలం.. దాదాపు నా డిగ్రీ వరకూ వరిపొలాల్లోనే జీవితం గడిచింది మా తాతయ్యతో పాటు!
నాట్ల సమయంలో నారుమళ్ల నుండి పొలానికి నారుమోపులను చేరవేయడం దగ్గర్నుండి.. నాట్లు వేసే వాళ్లకి ఆ మోపుల్ని అందుబాటులో ఉంచడం.. పంట కాలువల్ని శుభ్రం చేసి చేనుకి నీళ్లు అందేలా చూడడంతో మొదలయ్యీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో చేనుని యూరియా, DAP చల్లించడం, వరి కంకులు పొట్ట పోసుకునేటప్పుడు ఎక్కడ భారీ వర్షం పడుతుందోనని బిక్కుబిక్కుమంటూ బ్రతకడం.. అన్నట్లు చెప్పడం మర్చిపోయా.. పొలంలో నాకు ఒకటే భయముండేది.. చేను గట్ల మీద పసిరిగ పాములు చుట్టుచుట్టుకుని ఉంటాయి, గ్రీన్ కలర్ల్లో, స్పష్టంగా చూస్తే తప్పించి కన్పించను కూడా కన్పించవు, అవి పెద్దగా ప్రమాదకరం కాదు గానీ అవంటే నాకు ఒళ్లు జలదరించేది. వాటి గురించి తెలీక ముందు దర్జాగా గట్ల మీద వేగంగా నడిచిన నేను ఆ తర్వాత మెల్లగా నిశితంగా చూస్తూ అడుగులో అడుగూ వేస్తూ నడవడం భలే మంచి జ్ఞాపకం.
సంక్రాంతి నెల వచ్చేసరికి నూర్పిళ్లకి సిద్ధపడడం.. పంట చేతికొచ్చిన రోజు బస్తాలను ఎడ్లబండిపై ఎక్కించి ఆ బస్తాలపై దర్జాగా కూర్చుని ఇంటికి చేరుకోవడం.. అదో అద్భుత ప్రపంచం. కల్లాకపటం లేని రోజులు. ఈరోజు ప్యూరిఫైడ్ వాటర్ తప్పించి తాగని నేను ఇంటి నుండి నాకూ, మా తాతయ్యకి మా అమ్మమ్మ తెచ్చిచ్చిన బాక్స్‌ని ఆవురావురుమంటూ తినేసి పక్కనే పంట కాలువలోకి వంగి దోసిళ్లతో నీళ్లు తీసుకుని కడుపారా తాగిన రోజులు ఇప్పటికీ నా కళ్ల ముందు చెక్కు చెదరకుండా ఉన్నాయి. జీవితం ఎలా మారిపోయిందో తెలీదు.
మా దగ్గర ఉప్పరపాలెం అని ఉండేది. అక్కడ తెలిసినాయన ఒకాయన మా తాతయ్య మీద అభిమానంతో సంక్రాంతి వచ్చిందంటే ఓ బలమైన కోడిని తీసుకొచ్చి మా సావిట్లోనే దాన్ని డ్రెస్సింగ్ చేసి అందించేవాడు.. అలా నేరుగా డ్రెస్సింగ్ చేయడం చూసి కొన్నాళ్లు చికెన్ కూడా తినకుండా ఉన్న రోజులూ గుర్తున్నాయి.
నూర్పిళ్లు అయ్యాక కూడా వరి కళ్లాల్లో అవసరాన్ని బట్టి పడుకోవలసి వచ్చేది. మా తాతయ్య, నేనూ రెండు దుప్పట్లు మాత్రమే తీసుకెళ్లి ఆ గడ్డినే పరుపుగా చేసుకుని ఆ చలిలో, మంచులో ముణగదీసుకుని పడుకున్న రోజులూ మరిచిపోలేనివి. అలా పడుకున్నప్పుడు చుట్టూ ఎక్కడా జనసంచారం లేకపోవడం వల్ల ఏర్పడే చిన్నపాటి భయమూ, పక్కన మా తాతయ్య నిద్రపోయి నేను ఒక్కడినే మెలకువగా ఉండడం వల్ల కీచురాళ్ల వంటివి కూడా భయపెట్టిన తీపి జ్ఞాపకాల ముందు ఈరోజు అనుభవిస్తున్న ఎంటర్టైన్మెంట్లు ఏ మూలకూ చాలవు.
అదృష్టవశాత్తు నా జీవితం చాలా వైవిధ్యంగా గడిచింది. ఒకదానికి మరో దానికి పొంతన లేని జీవితం.. ఎక్కడ పొలం పనులు, ఎక్కడ పల్లెటూరి చదువులు, ఎక్కడ ICWAI, సినిమా ఫీల్డ్, టెక్నాలజీ, మీడియా, మధ్యలో ఆసక్తి కొద్దీ నేర్చుకున్న, ప్రవేశించిన ఇతర రంగాలూ.. ఇంత డైనమిక్‌గా లైఫ్ ఉండబట్టే నా లైఫ్ నాకు చాలా ఇష్టం, ఇప్పటికీ ఛాలెంజింగ్‌గా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను. ఐ లవ్ మై లైఫ్!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply