
కొంతమందికి జీవితం ముళ్లకిరీటంలా భారంగా ఉంటుంది. మిగతా ప్రపంచం మొత్తం సంతోషంగా ఉండి తామొక్కళ్లమే దిగంతాల్లో కూరుకుపోయిన దిగాలు ప్రదర్శిస్తుంటారు. కన్పించిన ప్రతీ వ్యక్తి మనకన్నా సంతోషంగానే ఉన్నారనే ఓ పిచ్చి అపోహ మరింత కుంగదీస్తుంది. ప్రతీ శరీరంలో బయటకు తెలియని ఎన్ని నొప్పులున్నాయో, ప్రతీ మనసులో ఉబికిరాని ఎన్ని రోదనలు మూలుగుతున్నాయో మనకేం తెలుస్తుంది?
కష్టాలున్నా, బాధలున్నా అందరూ సంతోషంగా ఉంటారు. కష్టాలను, బాధలను మర్చిపోయి సంతోషంగా ఉండడం వారు ప్రదర్శిస్తున్న నటన అనుకుంటాం మనం. వారు తమని తాము మోసం చేసుకుంటున్నట్లు చులకనగా చూసేస్తుంటాం.
సంతోషం అనేది కష్టాల్తోనో, బాధల్తోనో ఆవిరైపోయేది కాదు.. సుఖాలతో పొంగిపొరిలేదీ కాదు. కావాలంటే ఏ క్షణమైనా మనల్ని ముంచెత్తే అద్భుతమైన భావన. సంతోషానికి కోరికలూ, కొలమానాలూ పెట్టుకుని తూకం వేయడానికి ప్రయత్నిస్తే అది వీసమంతైనా తూగదు.
మన బుద్ధికి మనం సంతోషంగా ఉండడానికి ఓ కారణం కావాలి, మన మనసు మనం సంతోషంగా ఉండడానికి ఓ అర్హతని వెదికి తగిన అర్హత కన్పించకపోతే ఆ సంతోషాన్ని తోసేస్తుంది. ఇలా బుద్ధితోనో, మనసుతోనో నిర్ణయించుకునేది కాదు సంతోషం, మనం ఎలాంటి బేరీజులూ వేసుకోకుండా అన్ కండిషనల్ గా స్వీకరించనంత కాలం సంతోషం మన దరి చేరదు. అన్ కండిషనల్ గా స్వీకరించిన మరుక్షణం, తీరని బాధల్లోనూ సంతోషం మనల్ని విడిచిపెట్టి పోదు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా
Leave a Reply