చాలామంది తరచూ నన్ను అడిగే క్వశ్చన్ ఇది. స్పిన్నింగ్ ఆఫ్ ఎనర్జీ మన శరీరంలో నిరంతరం జరిగే ప్రక్రియ అన్నది మెడిటేషన్ చేస్తూ వెళ్లే కొద్దీ మొదట అర్థమయ్యే సత్యం. ఆ ఎనర్జీ శరీరంలో ఏ చక్రలో జరుగుతోంది అన్నది మనం కలిగి ఉండే భావోద్వేగాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అభద్రత, అహం, కోపం, ద్వేషం, ఒంటరితనం, అపరాధ భావం, ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ కాంప్లెక్స్‌లు వంటి భావోద్వేగాలు శరీరంలోని క్రింది మూడు చక్రాలైన రూట్, శాక్రల్, సోలార్ ప్లెక్లెస్లో ఎనర్జీని స్పిన్ చేస్తుంటాయి. మన ఎనర్జీ మొత్తం అక్కడ ఎనర్జీ బ్లాక్స్‌గా శరీరంలోని పై చక్రాలకు చేరకుండా బ్లాక్ అవుతుంది. దాంతో అనాహత చక్రకి చెందిన అన్ కండిషనల్ లవ్, విశుద్ధ, థర్డ్ ఐ, సహస్రార చక్రలకు చెందిన యూనివర్శల్ ఎనర్జీతో కలిసిపోయే సామర్థ్యం వంటివన్నీ అసాధ్యాలుగా మారతాయి.
సులభంగా అర్థమయ్యేలా చెప్పుకుందాం. వ్యక్తుల్లో, వస్తువుల్లో, పరిస్థితుల్లో సంతోషాన్ని చూస్తుంటారు చాలామంది. ఈరోజు ఒక వ్యక్తి ద్వారా సంతోషం కలిగితే అదే వ్యక్తి ద్వారా జీవితంలో ఏదో ఒక రోజు బాధ పడాల్సి వస్తుంది. ఈరోజు చాలా ప్రేమగా ఉన్న వ్యక్తి రేపు మరింత పొసెసివ్‌గా మారిపోతే ఊపిరాడకుండా ఉండి బాధ అనిపిస్తుంది, లేదా ఆ వ్యక్తి దూరం కావచ్చు. ఈ రోజు డబ్బు ద్వారా, పేరు, హోదా ద్వారా సంతోషం అనుభవిస్తుంటే.. కొన్నాళ్లకి అవి కూడా డైల్యూట్ అవుతాయి.
సో సహజంగా మనం చూపించే భావోద్వేగాలన్నీ క్లారిటీ ఆఫ్ థాట్‌ని పోగొడతాయి. ఓ ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేస్తాయి. జీవితాంతం ప్లెజర్ తర్వాత పెయిన్, పెయిన్ తర్వాత ప్లెజర్ ఇలా ఈ చక్రంలో ఇరికించేస్తాయి. దాంతో జీవితం అంటే మన కంట్రోల్లో లేదు అనే భావన వస్తుంది.
మెడిటేషన్ చేసుకుంటూ వెళ్లే కొద్దీ మైండ్ క్రియేట్ చేసే మాయని అధిగమించుకుంటూ వెళ్లే కొద్దీ మన ఎనర్జీ, మన ఎమోషన్ మన చేతిలో ఉంటుంది. ఎక్కువ శక్తిని హరించే నెగిటివ్ ఎమోషన్స్ (కోపం, భయం, బాధ, ఒంటరితనం, గిల్టీ ఫీలింగ్ వంటివన్నీ) తగ్గిపోయి శరీరంలో అపరిమితమైన ఎనర్జీ సిద్ధంగా ఉంటుంది.
అలాగే మనుషుల్ని జడ్జ్ చెయ్యడం, దూరంగా పెట్టడం, వ్యామోహంతో దగ్గరగా తీసుకోవడం వంటివి లేకుండా అందరి పట్లా ఒకే రకమైన అన్ కండిషనల్ లవ్ మొదలవుతుంది. నిరంతరం హృదయంలో అలౌకిక ఆనందం ఏర్పడుతుంది. సంతోషం కోసం మనుషులు అవసరం లేదు, పబ్‌లు అవసరం లేదు, వస్తువులు అవసరం లేదు. ఊరికే ఖాళీగా అలా కూర్చుని కూడా ప్రతీ క్షణం మనస్సులో సంతోషం, సంతృప్తి తొణికిసలాడుతూ ఉంటుంది. సో నెగిటివ్ ఎమోషన్స్‌కి ఎనర్జీ అవసరం లేకపోయేసరికి, మన చేతిలో ఉన్న ఎనర్జీ అంతా ఓ బలమైన లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించడం మీదా (ఆ లక్ష్యం పట్ల కూడా ఎలాంటి అటాచ్మెంట్ ఉండదు, కేవలం మన ఎనర్జీని సద్వినియోగం చేసుకోవడం కోసమే ఈ లక్ష్యాలు), మనలో ఉన్న ఎనర్జీ అంతా అందరి పట్లా నేచురల్‌గా ప్రేమగా ఉండడానికి ఉపయోగపడుతుంది.
బాధా, సంతోషం వంటి నిరంతరం రెండు స్థితుల్లో కొట్టుకుపోయి గందరగోళంగా మారే స్థితి నుండి ఓ నిశ్చలమైన స్థితి లభిస్తుంది.
అసలు మనం చేస్తున్న ఎంజాయ్మెంట్ అంటే ఏంటి? ఒక సమస్య నుండి ఒక పెయిన్ నుండి ఎస్కేప్ అయ్యే ప్రయత్నమే కదా! పబ్ కెళితే, మనుషులతో ఉంటే ఎంజాయ్ చేస్తున్నామనుకుంటే, మరి ఇవేమీ లేనప్పుడు జీవితాన్ని నరకంగా చూస్తున్నామనే కదా అర్థం. నిజమైన ఎంజాయ్మెంట్ మెడిటేషన్ ద్వారా లభిస్తుంది. దేనితో అవసరం లేని నిరంతరం హృదయంలో సంతోషం కలిగి ఉండే మానసిక స్థితి. ఆ స్థితికి చేరుకుంటే మనుషుల్ని ప్రేమించరా అంటే.. వందరెట్లు ఎక్కువగా ప్రేమిస్తారు.. కానీ మనం చూపించే ప్రేమకు రిటర్న్ ఏదో అవతలి వారూ ప్రేమ చూపించాలని expectation ఉండదు. దాంతో దుఃఖం నుండి విముక్తి లభిస్తుంది.