యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే ।
హత్వాఽపి స ఇమాఁల్లోకాన్న హంతి న నిబధ్యతే ।। 17 ।।
కర్తృత్వ అహంకారం భావన (చేసేది నేనే అన్న భావనను విడిచిపెట్టి) బుద్ధి మమకారాసక్తి లేకుండా ప్రవర్తించే వారు, ప్రాణులను సంహరించినా సరే చంపినట్లు కాదు. ఆ చర్యల వల్ల కర్మ బంధనములకు లోను కారు.
వివరణ: ఈ శ్లోకంలో చెప్పబడిన ప్రాణులను సంహరించినా సరే కర్మ బంధనములకు లోను కారు అనే అంశం విషయంలో చాలామంది గందరగోళానికి లోనవుతారు. దీన్ని స్పష్టంగా తెలుసుకుందాం.
సృష్టి ముందుకు సాగాలంటే సృష్టిలోని ప్రతీ జీవీ దేనినో ఒకదానిని ఆహారంగా తీసుకుంటూ సాగుతుంటాయి. ఒక పదార్థాన్ని ఆహారంగా తీసుకోవడం అనేది ఒక జీవి మనుగడకి సంబంధించిన ప్రాధమిక ధర్మం. కొన్ని జీవులు ఆకులు, అలములు తీసుకుంటే మరికొన్ని జీవులు పురుగులు మొదలుకుని పెద్ద పెద్ద ఇతర జీవులను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాయి. ఒక జీవి మరో జీవిని ఆహారంగా తీసుకునేటప్పుడు తన ఆకలిని జయించాలన్న ఆరాటం ఉంటుంది గానీ సంహరించబడే రెండో జీవిని హింసించాలన్న క్రూరత్వం ఏమాత్రం ఉండదు. క్రూరత్వం అనేది అహానికి సంబంధించిన ఓ రూపం. నన్ను ఫలానా వ్యక్తి, ఫలానా జంతువు కష్టపెట్టాయి కాబట్టి వాటిని కష్టపెట్టాలి, వాటిని ఆహారంగా చేసుకుని వాటిని అంతరింపజెయ్యాలి అనే భావన క్రూరమైనది. అలాంటి క్రూర భావన ఏమీ లేకుండా ఒక జీవి సృష్టి ధర్మంలో భాగంగా ముందుకు సాగడం కోసం, యూనివర్శల్ ఎనర్జీ తన ఇంటెలిజెన్స్‌ని స్వేచ్ఛగా అమలుపరిచే పొందికలో భాగంగా.. “దీనిపట్ల నేను క్రూరంగా ఉండాలి” అని గానీ, “ఇది నేను చేశాను” అనే అపరాధ భావనను గానీ మోస్తూ ఉంటే ఆ ప్రాణిని సంహరించిన పాపం చుట్టుకుంటుంది. “తప్పు చేశాను అనే అపరాధ భావం పాపం ఎలా అవుతుంది” అనే సందేహం మీకు రావచ్చు. సృష్టి ధర్మానికి అనుగుణంగా ఒక జీవి తన ఆహారాన్ని సమకూర్చుకోవడం పాపం కాదు, కానీ నేను తప్పు చేశాను అనే భావన ఏర్పడ్డప్పుడు ఆ గిల్ట్ ఫీలింగ్ నుండి సోలార్ ప్లెక్సెస్ చక్ర ఎనర్జీ అసమతౌల్యతకు గురవుతుంది. ఒకవేళ తప్పు చేశాను అనే భావన ఏర్పడితే ఇతర సాత్వికమైన ఆహారపు అలవాట్లకి మారిపోవచ్చు గానీ అపరాధ భావనను పెంచి పోషించుకోకూడదు.
నాన్ వెజిటేరియన్ తినాలా లేదా అనే సందేహంలో చాలామంది ఉంటుంటారు. ఒక మనిషి ఎలాంటి ఆహారాన్ని ఆస్వాదిస్తున్నాడు అన్నది అతను తన చేతిలో ఉంటుంది అనుకుంటాడు గానీ అది అతని ప్రవర్తనని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ ప్రవర్తన సాంఖ్య శాస్త్రంలో చెప్పబడిన ఐదు కర్మ కారకాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అవేంటో ఓసారి గుర్తు చేసుకోండి. జ్ఞానేంద్రియాల నుండి స్వీకరించే సమాచారం, వాటికి లేబుల్స్ వేసే మన మనస్సు, వాటికి జతచేయబడే అప్పటి వరకూ జీవితంలో మనకు ఏర్పడిన అవగాహనకు సంబంధించిన ఇంటెలిజెన్స్, ఇది నాకు ఏ విధంగా వర్తిస్తుంది అని తన ఇగో దృష్టిలో చూసే ఇగో దృక్పధం, చివరిగా నైతికత ఈ ఐదు అంశాల ఆధారంగా (వీటి గురించి గత శ్లోకాల్లో వివరంగా రాయడం జరిగింది, చదవండి) ఒక మనిషి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మరి ఈ ఐదు కారకాలను ఏది నియంత్రిస్తుంది అంటే ఆ ఆత్మకి సంబంధించిన కాన్షియస్నెస్. మరి వీటన్నింటికి పైనా ఆ ఆత్మ యొక్క కాన్షియస్‌నెస్‌ని (జీవితం పట్లా, సమాజం పట్లా, వ్యక్తుల పట్లా, భగవంతుని పట్లా కలిగి ఉండే అభిప్రాయాలు, వాటి ఆధారంగా ఏర్పడే మూడ్, స్పందించే గుణం.. ఇలా ఎన్నో కాన్షియస్‌నెస్‌లో భాగం) అదుపులో పెట్టేది ఏదీ అంటే భగవంతుడు అని మనం పిలుచుకునే విశ్వశక్తి, (యూనివర్శల్ కాన్షియస్నెస్).
అంటే మన ఆత్మ తన గత రూపం నుండి మోసుకు వచ్చిన వైబ్రేషన్స్, ఎనర్జీ ఆనవాళ్ల ఆధారంగా మనకు అవే తరహా వైబ్రేషన్స్ ఇప్పుడున్న భౌతిక రూపంలో తిరిగి అనుభవించే ప్రాప్తముండి (అవి మంచివైనా, చెడ్డవైనా) ఆయా కర్మ ఫలాలను అనుభవించడానికి మనకు మనం కొన్ని మానసిక కర్మలు, భౌతిక కర్మలు చేయడానికి ఓ రంగస్థలం సిద్ధమవుతుంది అన్నమాట. ఆ రంగస్థలమే అన్నదమ్ముల మధ్య కొట్లాటలు లేదా విపరీతమైన ప్రేమ లాంటివి. కొట్లాటలు ఏర్పడాలంటే అన్నదమ్ములో, భార్యాభర్తలిద్దరి మధ్యనో వారు విషయాలను చూసే దృక్పధంలో, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే విధానంలో ఓ బ్లర్డ్ విజన్ (స్పష్టంగా అర్థం కాని అజ్ఞానం) చోటుచేసుకోబడి ఉండాలి. ఇప్పుడు రెండు సోల్స్ ద్వేషమో, కోపమో, అసంతృప్తో లాంటి ఒకే రకమైన వైబ్రేషన్స్ అనుభవించాల్సిన కర్మలు మిగిలిపోయి ఉంటే వారిరువురీ మధ్య ఆ ఘర్షణ చోటుచేసుకోబడడానికి సంబంధించిన అపార్థాలూ, ఒకరికొకరు తమ అహాన్ని వదులుకోలేని పంతం అన్నీ కలిసి చివరకు ఘర్షణకి దారి తీస్తుంది. ఘర్షణ పడాలంటే రక్త ప్రవాహం ఎక్కువ జరగాలి. మానసిక వత్తిడికి సంబంధించిన స్ట్రెస్ హార్మోన్ విపరీతంగా విడుదల కావాలి. ఆ గుణాన్ని అకామిడేట్ చెయ్యడం కోసం, ఆ గుణాన్ని కలిగి ఉండడం కోసం ఆ జీవుడిచే రజో గుణాన్ని పెంచే కారం, ఉప్పూ, మసాలాలు ఎక్కువ ఇష్టపడడం, ఊరికూరికే భావోద్వేగాలకు లోనవడం వంటి గుణాలు సంక్రమిస్తాయి.
ఉప్పూ, కారం తగ్గించుకోవచ్చు కదా అని ఎవరైనా చెప్పినా “అది నా వల్ల కాదు, చప్పటి కూడు నా నోటికి ఆనదు” అని ఎందుకు చాలామంది తిరస్కరిస్తారు అంటే వాళ్ల శరీరం అనే క్షేత్రం రజోగుణ కర్మలు చెయ్యడానికి అలవాటుపడిపోయింది. అందర్నీ అరవడం, కోప్పడడం, రేపేమవుతుందో అనే ఆందోళనకు లోను కావడం వంటి కర్మలన్నీ అనుభవించాక “ఇది నా వల్ల కావట్లేదు, నా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి” అనే సంకల్పం ఆ జీవుడికి దానంతట అది కలిగి తనకు తానుగా ఆహారపు అలవాట్లు మార్చుకుంటారు. అప్పుడు కూడా తనకు తానుగా మార్చుకున్నాడు అని మనకు కన్పించేది కేవలం సర్ఫేస్ మీద మాత్రమే, ఓ జీవుడి గుణం ఒక స్థితి నుండి మరో స్థితికి మారడం వెనుక పైన చెప్పబడిన ఇంటెలిజెన్స్ పాత్ర ఎంతో ఉంది. వ్యక్తిగతంగా రోజుకి భారీ మొత్తంలో స్లీపింగ్ పిల్స్, తర్వాతి కాలంలో మందు, సిగిరెట్, నాన్‌వెజ్, కూల్‌డ్రింక్స్ వంటివన్నీ జీవితంలో వేర్వేరు దశల్లో కేవలం ఒకే ఒక రోజు నిర్ణయంతో నేను మానేయగలగడానికీ అది నా సంకల్ప బలం కాదు.. కొన్ని వదిలించుకునే సమయం వచ్చి, మనిషి తన గుణాన్ని తాను మెరుగుపరుచుకునే స్థితి ఇంటెలిజెన్స్ చేత కల్పించబడినప్పుడే ఆ దృఢనిశ్చయం కలుగుతాయి. తమో, రజో గుణాల ఆహారపు అలవాట్లని వదిలేసి, సాత్విక ఆహారం వైపుకి మళ్లిపోయాక తెలీకుండానే ధ్యానం, ఆధ్యాత్మికత పట్ల నాకు ఆసక్తి ఏర్పడడం, 2016 నుండి నిరంతరం ధ్యాన సాధన చెయ్యడం లాంటివన్నీ ఆ ప్రాప్తాన్ని బట్టి మాత్రమే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పైన భగవానుడు చెప్పినట్లు “చేసేది నేనే” అనే భావన ఉన్నంత సేపూ మన పూర్వ జన్మల, ఈ జన్మ వైబ్రేషన్స్‌ని అనుభవించేలా చేసే యూనివర్శల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంది అనే వాస్తవం నుండి మనం దూరంగా జరుగుతాం.
ఇక్కడ మరో సందేహం రావచ్చు.. “నా సంకల్పం కొద్దీ నాన్ వెజిటేరియన్ వంటి ఆహారాలను మానేయడం ద్వారా నా గుణాన్ని మార్చుకోవడం ద్వారా నేను పూర్వ జన్మ కర్మల నుండి విముక్తం కావచ్చు కదా” అనే సందేహం కలగవచ్చు. కలహం అనే పరిస్థితి ఏర్పడ్డప్పుడే ఆ కలహానికి అవసరమైన ఆహారపు అలవాటు ఏర్పడిపోయింది. కాబట్టి ఆహారపు అలవాట్లు మార్చుకుని గొడవలకు దూరంగా, ఆందోళనకు దూరంగా ఉండడం సాధ్యం కాదు. మైండ్ చేసే ఆలోచనలకు తగ్గట్లే శరీరం తన ఆహారాన్నీ, వ్యసనాలను కోరుకుంటుంది. కొన్నాళ్లకి శరీరమే మైండ్ అయిపోయి “నాకు అర్జెంటుగా బిర్యానీ పెట్టు, చికెన్ పెట్టు” అని డిమాండ్స్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది ఈ మానసిక స్థితిని అనుభవిస్తున్నారు. ఈరోజు కాదులే, వచ్చేవారం నాన్‌వెజ్ తిందాం అని వారి మైండ్‌లో అనుకున్నా వారి శరీరం మాత్రం టెంమ్టేషన్ రూపంలో బలవంతం చేస్తుంటుంది. దీనికి ఒకటే పరిష్కారం మెడిటేషన్, అన్నింటినీ జడ్జ్ చేసే స్వభావం నుండి బయటపడడం, ఒకరితో ఒకరు పోల్చుకుని ఆందోళనకు గురి కావడం అనే నైజం నుండి ప్రయత్నపూర్వకంగా దూరంగా జరగడం ద్వారా మనిషి తన ఈ జన్మ కర్మలు తన నియంత్రణలో ఉండేలా, పాప కర్మలు చెయ్యకుండా అదుపు చేసుకోవచ్చు. కానీ ఓ సమస్య రూపంలో గానీ, ఆత్మీయుల ఎడబాటు వంటి వాటి ద్వారా గానీ గత జన్మల కర్మల ఫలాలు ఎటూ అనుభవించక తప్పదు. కనీసం ఇప్పటి ప్రవర్తనని బుద్ధిని మార్చుకోవడం ద్వారా సంస్కరించుకోవచ్చు. అలా సంస్కరించుకున్న తర్వాత దానంతట అదే రజో, తమో గుణానికి చెందిన ఆహారం పట్లా ఆసక్తిని కోల్పోయి సాత్విక ఆహారం తీసుకోబుద్ధి అవుతుంది.
పై శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్పిన దాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకుంటే ఆహార విహారాదులు మన ఛాయిస్‌లు కాదు, మన కర్మ ఛాయిస్‌లు. ఆయా కర్మలను అనుభవించడానికి కావలసిన పరిస్థితులు,వాటి పట్ల మన భావోద్వేగాలు, ఆ భావోద్వేగాలను శరీరం ఎగ్జిక్యూట్ చెయ్యడానికి సరిసమానమైన ఆహారపు అలవాట్లు అన్నీ ఓ ఎన్విరాన్మెంట్గా ఏర్పడతాయి.
కొంతమంది తపోసంపన్నులు ఆహారం తీసుకోకుండా రోజుల తరబడి ధ్యాన ముద్రలో ఉండగలుగుతారు. కారణం వారి ఆలోచనలను జయించి, ఆలోచలను ఎగ్జిక్యూట్ చెయ్యడానికి ఏమాత్రం శరీరానికి అదనపు శక్తి అవసరం లేని స్థితికి వారు చేరుకోబట్టి!
- Sridhar Nallamothu