సామాన్యులం..
మన విజయాల్ని భారత జట్టులో చూసుకుని రొమ్ములు విరుచుకునే టైపు…
దేశాన్ని మోడీలోనూ, రాష్ట్రాన్ని చంద్రుళ్లలోనూ చూసుకుని మురిసిపోయో మనుషులం
గుండె కదిలితే త్రివిక్రమ్ డైలాగులూ… ఎమోషనొస్తే నచ్చిన హీరో పంచ్ డైలాగులతో కక్కేసే బాపతు..
స్వామీ వివేకానంద కొటేషన్లతో జీవితాన్ని ఉత్తేజపరుచుకోవాలని ప్రయత్నించి కారణమేంటో తెలీక ఫెయిలై అతి సామాన్యంగా బ్రతికే అభాగ్యులం..
రాంగోపాల్ వర్మ ఏటిట్యూడ్ గురించీ.. అప్పుడప్పుడు జరిగే ఎన్కౌంటర్ల గురించీ.. ఒకర్నొకరు బూతులు తిట్టుకునే రాజకీయ నాయకుల గురించీ తెగ ఆలోచించేసి సమాజ శ్రేయస్సుని కాంక్షించే బాధ్యతాయుత పౌరులం…
సినిమా హీరో హీరోయిన్లలో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుని పులకించిపోయి ఓ ట్రాన్స్‌లో బ్రతుకీడ్చే మెంటల్ పేషెంట్లం..
ఫేస్బుక్ లైకుల కోసం mutual అండర్‌స్టాండింగ్‌తో బలమైన రిలేషన్లు మెయింటైన్ చేసే మానవతావాదులం…
మనకేం కావాలో తెలీదు.. మనం ఎవర్ని ఇంప్రెస్ చెయ్యాలనుకుంటున్నామో, ఎందుకు ఇంప్రెస్ చెయ్యాలనుకుంటున్నామో, మన బ్రతుకేంటో, మన ప్రయాణం ఎలా ముగుస్తుందో, అసలు ప్రపంచంలో దేన్ని ఎంతవరకూ తీసుకోవాలో.. ప్రశాంతతలో మనల్ని మనం ఎలా ఆవిష్కరించుకోవాలో… ఓ తుఫానులాంటి ఎమోషన్లలో కొట్టుకుపోకుండా ఎలా కాపాడుకోవాలో.. ఏమీ తెలీని నిస్సహాయులం.. అతి సామాన్యులం!!
ఈ అతి సామాన్యులే విజేతలకు పెట్టుబడి. ఈ సామాన్యులే పవన్ స్పీచులకూ… త్రివిక్రమ్ డైలాగులకూ, కెసిఆర్, చంద్రబాబుల రాజకీయాలకూ, ధోనీ సేన విజయాలకూ, వైఫల్యాలకూ, రాంగోపాల్ వర్మ మొండితనానికీ.. బుర్ర పాడుచేసుకుంటూ అన్ని మెంటల్ రిసోర్సెస్నీ ధారపోస్తుంటారు. ఇలాంటోళ్లే కావాలి..
కొందరు ధృవతారల్లా వెలుగొందాలంటే ఎందరో సామాన్యులు మిణుక్కుమనకుండానే దీపాలను ఆర్పేసుకోవాలి..
అందుకే మన జీవితాలు వెలగవు.. వేరొకరి జీవితాల వెలుగులకు చేతులు అడ్డంపెట్టి వారి జీవితాల్ని మనం పూనకంలోకి తెచ్చుకుని ఎలాగోలా చచ్చేదాకా బ్రతికేస్తుంటాం.
నీకోసం నువ్వు బ్రతికిన రోజున… ప్రపంచంలోని చెత్తనంతా బుర్రలోకి రాకుండా జాగ్రత్తపడిన రోజున నీ జీవితం వెలుగొందుతుంది.
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply